Share News

కనీస మార్కులొస్తేనే కొలువు

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:03 AM

డీఎస్సీ-2026లో ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. అభ్యర్థులు మొదటిసారి ఉద్యోగం పొందాలంటే కనీస అర్హత మార్కులు తప్పనిసరిగా సాధించాలనే నిబంధన విధించింది. తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో దీనిని చేర్చింది.

కనీస మార్కులొస్తేనే కొలువు

  • డీఎస్సీ- 2026లో కీలక నిబంధన విధించిన ప్రభుత్వం

  • ఓసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం సాధించాలి

  • బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30శాతం తప్పనిసరి

  • క్రీడల కోటా, మాజీ సైనిక అభ్యర్థులకూ ఇదే వర్తింపు

  • స్కూల్‌ అసిస్టెంట్‌- వ్యాయామ విద్య పోస్టులకు కూడా...

  • స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో కాంట్రాక్టు సర్వీసుకు వెయిటేజీ

  • మొత్తం 2,721 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల

  • కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షల నిర్వహణ

డీఎస్సీ-2026లో ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. అభ్యర్థులు మొదటిసారి ఉద్యోగం పొందాలంటే కనీస అర్హత మార్కులు తప్పనిసరిగా సాధించాలనే నిబంధన విధించింది. తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో దీనిని చేర్చింది. ఇంతకుముందు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. దీంతో కొన్ని కేటగిరీల అభ్యర్థులకు 10 మార్కులు, 5 మార్కులు వచ్చినా ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది.

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఇకపై డీఎస్సీలో కనీస అర్హత మార్కులు వస్తేనే టీచర్‌ ఉద్యోగం వస్తుంది. ఆ మేరకు కూటమి ప్రభుత్వం డీఎస్సీ-2026లో కీలక మార్పు తీసుకొచ్చింది. ఓసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం కనీస మార్కులు సాధించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. డీఎస్సీ (80శాతం), టెట్‌ (20శాతం) కలిపి ఈ మార్కులు రావాల్సి ఉంటుంది. ఈ నిబంధనకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులు ఎవరూ లేకపోతే సంబంధిత కేటగిరీలో ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయరు.


వాటిని వచ్చే డీఎస్సీకి క్యారీ ఫార్వార్డ్‌ చేస్తారు. అదేవిధంగా క్రీడల కోటా, మాజీ సైనిక అభ్యర్థులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌- వ్యాయామ విద్య పోస్టులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఈ డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు కూడా డీఎస్సీ పరీక్ష రాయాలి. కనీస అర్హత మార్కులు కూడా సాధించాలి. ప్రభుత్వ, అటానమస్‌, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలంటే ఆయా సంస్థల నుంచి అనుమతి పొందాలి. దరఖాస్తు ఫీజు కింద రూ.వెయ్యి చెల్లించాలి.

అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాలు. సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 49 ఏళ్లు. దివ్యాంగులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే ప్రాధాన్యతా క్రమాన్ని ఎంపిక చేసుకోవాలి. మెరిట్‌ జాబితాలు విడుదల చేసిన తర్వాత ఒకసారి ఎడిట్‌ ఆప్షన్‌ ఇస్తారు. మెరిట్‌ జాబితా విడుదల చేసిన ఏడు రోజుల్లో అభ్యర్థులు వారి సర్టిఫికెట్లను డీఎస్సీ వ్యక్తిగత లాగిన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయని వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు శాప్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్‌ చేసుకోవాలి. క్రీడా అభ్యర్థి గుర్తింపు సంఖ్యను పొంది, దానిని డీఎస్సీ దరఖాస్తులో పొందుపరచాలి.

డీఎస్సీ పరీక్షలు కంప్యూటర్‌ ఆధారిత విధానంలోనే జరుగుతాయి. జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ఇంగ్లిష్‌, అభ్యర్థి ఎంచుకున్న భాషల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారు. మిగిలిన 5 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ పోస్టుల కోసం స్థానికులు, స్థానికేతరులు పోటీ పడవచ్చు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాలకు వర్టికల్‌ రిజర్వేషన్‌, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళలు, క్రీడా కోటా అభ్యర్థులకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఈ డీఎస్సీలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 350 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఐఈఆర్‌టీలు, ఐఈడీఎ్‌సఎ్‌సలు, సీఆర్‌టీలుగా, టీటీడీ విద్యాసంస్థలు, కేజీబీవీల్లో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఏడాదికి 0.5 మార్కుల చొప్పున గరిష్ఠంగా 5 మార్కులు దాటకుండా వెయిటేజీ ఇస్తారు.

కేటగిరీల వారీగా పోస్టులు

రెగ్యులర్‌ టీచర్‌- 2,111, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌- 350, సొసైటీలో 260 చొప్పున పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగాల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ స్కూళ్లలో ఖాళీలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో 1,186 స్కూల్‌ అసిస్టెంట్‌, 1,535 ఎస్జీటీ పోస్టులున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:05 AM