కరువు మండలాలు 388
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:43 AM
నైరుతి రుతుపవన కాలం, ఖరీఫ్-2026 సీజన్‌లో ఏర్పడిన తీవ్ర వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
21 జిల్లాల్లో 283 చోట్ల తీవ్రం.. 105 మధ్యస్తం.. రాయలసీమలో ప్రభావ తీవ్రత ఎక్కువ
ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ.. ఉత్తరాంధ్రలో విజయనగరం, అనకాపల్లి
కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవన కాలం, ఖరీఫ్-2026 సీజన్‌లో ఏర్పడిన తీవ్ర వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 283 తీవ్ర, 105 మధ్యస్త కరువు మండలాలుగా వెల్లడించింది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జి. సాయిప్రసాద్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. రాయలసీమతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరువు ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయనగరం, అనకాపల్లిలోనూ ప్రభావం ఎక్కువగా ఉంది. కరువు నిర్ధారణకు ప్రామాణికాలు, కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఖరీఫ్ కరువును అక్టోబరు 31 నాటికి ప్రకటించాల్సి ఉంది. అయితే జూన్ నుంచి ఆగస్టు వరకు 53.4 శాతం వర్షపాత లోటు నమోదు కావడం, ఎల్‌నినో పరిస్థితులతో కరువు మండలాలను ముందుగానే ప్రకటించాలని కరువు నిర్ధారణ కమిటీ ప్రతిపాదించింది. ప్రతి మండలంలో కరువు తీవ్రతను నిర్ధారించడంలో మూడు ప్రధాన దశలను పరిగణనలోకి తీసుకున్నారు. వర్షపాత వ్యత్యాసం, వర్షం లేని రోజుల వ్యవధి, పంట విత్తిన విస్తీర్ణం, వృక్ష సంపద స్థితి, తేమ లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల లభ్యత ఆధారంగా కరువు మండలాలను నిర్ణయించారు. వరుసగా 3-4 వారాల పాటు తక్కువ వర్షపాతం నమోదు కావడాన్ని ప్రామాణికంగా తీసుకుని వీటిని నిర్ధారించారు.
జిల్లా కలెక్టర్ల ప్రతిపాదనలను సెప్టెంబరు 30న వర్చువల్‌గా జరిగిన కరువు కమిటీలో చర్చించారు. రాష్ట్రంలో 688 మండలాలు ఉండగా.. కమిటీ సిఫారసు మేరకు 21జిల్లాల పరిధిలో 388 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 283 తీవ్ర కరువుగా, 105 మధ్యస్త కరువు మండలాలుగా వర్గీకరించింది. కరువు మండలాలపై నిర్దిష్ట ప్రాంతాల వివరాలను తెలియజేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా గెజిట్లను ప్రకటించి రైతులు రుణ సదుపాయం పొందేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు