36,485 మందితో బందోబస్తు: డీజీపీ
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:54 AM
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఆదివారం జరిగే పోలింగ్ కోసం 36,485 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. మంగళగిరిలోని ఏపీ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ విధుల్లో ఉన్న పోలీసు బృందాల మధ్య సమన్వయం చేస్తారని చెప్పారు. సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైనచోటుకు వెంటనే పంపే ఏర్పాట్లు చేశామన్నారు.
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ ముగిసిన తర్వాత గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు అనుమతి లేకుండా చేపట్టరాదన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయకర్త ఐజీ ఎస్.హరికృష్ణ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృతస్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..