Share News

36వేల మందితో ఎన్నికల బందోబస్తు

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:26 AM

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 4,372 పోలింగ్‌ కేంద్రాల ప్రాంతాల్లో 36,351 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించింది.

36వేల మందితో ఎన్నికల బందోబస్తు

  • 261 కేసులు నమోదు.. 107 మంది అరెస్టు..

  • 733 మందికి నోటీసులు.. 1.06 లక్షల మంది బైండోవర్‌

  • 2.94 కోట్ల విలువైన 496 కిలోల గంజాయి స్వాధీనం

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 4,372 పోలింగ్‌ కేంద్రాల ప్రాంతాల్లో 36,351 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించింది. అక్టోబరు 15 నుంచి 29 వరకూ 261 కేసులు నమోదు చేసి 107 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. అత్యధికం గా తిరుపతి జిల్లాలో 61 కేసులు, కడప 36, అన్నమయ్య 31, అనంతపు రం 26, మార్కాపురంలో 22 చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపింది. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) కింద 733 మందికి నోటీసులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా 51 మందిని, తిరుపతిలో 27, కడపలో 16, ప్రకాశంలో 8, కర్నూలులో ఐదుగురిని అరెస్టు చేశారు.

ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 19,993 మందిపై ముందస్తు చర్యలు చేపట్టారు. 1.06 లక్షల మందిని బైండోవర్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న 2,726 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు అమలు చేశారు. ఎన్నికల తనిఖీల్లో రూ.4.92 లక్షల నగదుతో పాటు రూ.2.94 కోట్ల విలువైన 496 కిలోల గంజాయి, రూ.12 లక్షల విలువైన 4,463 లీటర్ల మద్యం, రూ.39 వేల విలువైన 114 లీటర్ల నాటుసారా గంజాయి, రూ.1.50 లక్షల విలువైన బాణసంచా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు శాఖ వివరించింది. బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు 111 స్ట్రాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. వీటి రక్షణ కోసం 4,655 మంది పోలీసులను కేటాయించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద 525 మంది, కమ్యూనికేషన్‌ విభాగంలో 500 మంది సిబ్బందిని నియమించారు.


సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా: డీజీపీ

పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశామని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఓటర్లను బెదిరించినా, దాడులకు పాల్పడినా, ప్రలోభాలకు గురిచేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామని డీజీపీ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 01:26 AM