పంచాయతీ పోలింగ్‌కు 46,000 మంది పోలీసులు
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:07 AM
తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు, 23 పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ కోసం 46 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా: డీజీపీ హరీశ్ గుప్తా
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు, 23 పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ కోసం 46 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత 3,191 సర్పంచ్, 25,061 వార్డు స్థానాలకు, మరో 23 పట్టణ స్థానిక సంస్థల్లో గురువారం పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచాం. డ్రోన్లు, సీసీ కెమెరాలు, బాడీవార్న్ కెమెరాలు, ట్రేస్ యాప్ వంటి టెక్నాలజీతో బందోబస్తు నిర్వహిస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ముందస్తు బైండోవర్లు చేపట్టాం. నగదు, మద్యం పంపిణీ అడ్డుకోవడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశాం’ అని తెలిపారు. 23 పట్టణ స్థానిక సంస్థల, గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు కో ఆర్డినేషన్ ఐజీ బి.రాజకుమారి తెలిపారు.
బందోబస్తుకు కేటాయించిన మొత్తం 46,350 మంది పోలీసు సిబ్బందిలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తు కోసం 16,701 మంది సిబ్బందిని, గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల కోసం 29,649 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న పోలీస్ బలగాలతో పాటు 127 ప్లటూన్ల ఏపీఎస్పీ ప్రత్యేక బలగాలతో పాటు, రైల్వే, ఈగల్, ఇతర విభాగాలకు చెందిన బలగాలనూ వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి