Share News

పరవాడలో ‘ఫార్మా’ కాలుష్యంపై కొరడా!

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:02 AM

ఫార్మా పరిశ్రమలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, చెరువుల్లోకి విడిచిపెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల ఫార్మా సిటీలోని పలు కంపెనీలు నాలుగు రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినప్పుడు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడిచిపెట్టేశాయి.

పరవాడలో ‘ఫార్మా’ కాలుష్యంపై కొరడా!

  • వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడిచిపెట్టేసిన పరిశ్రమలు

  • ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో కదిలిన పీసీబీ అధికారులు

  • చెరువులు, గెడ్డవాగుల్లో నీటి నమూనాల సేకరణ

  • 95 పరిశ్రమలకు షోకాజ్‌ నోటీసులు

పరవాడ (అనకాపల్లి జిల్లా), సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఫార్మా పరిశ్రమలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, చెరువుల్లోకి విడిచిపెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల ఫార్మా సిటీలోని పలు కంపెనీలు నాలుగు రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినప్పుడు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడిచిపెట్టేశాయి. అవి కాలువలు, గెడ్డల ద్వారా పరవాడ పెద్ద చెరువులో కలిశాయి. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ దృష్టికి వెళ్లింది. ఆయా ప్రాంతాల్లో పర్యటించి వాస్తవాలను తెలుసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు పీసీబీ జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ శంకర్‌నాయక్‌, ఈఈ పీవీ ముకుందరావు సిబ్బందితో కలిసి శనివారం పరవాడ పెద్ద చెరువు, భరణికం మల్లోడిగెడ్డవాగు, తానాం శ్మశానవాటిక సమీపంలో గల గెడ్డవాగు, ఫార్మాసిటీ డ్రైన్ల నుంచి వ్యర్థ జలాలు కలిసే గెడ్డవాగును పరిశీలించారు. నీటి నమూనాలను సేకరించారు. వాటిని విశాఖ ల్యాబ్‌కు తరలించి పరీక్షలు చేపడతామని, నివేదికను ఉప ముఖ్యమంత్రికి అందజేస్తామని పీసీబీ అధికారులు వెల్లడించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా విడిచిపెట్టినట్టు ప్రాథమికంగా అంచనాకు రావడంతో ఫార్మాసిటీలోని 95 పరిశ్రమలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదకరమైన ఫార్మా వ్యర్థాలను క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, తేదీ, సమయం నమోదయ్యే విధంగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. షోకాజ్‌ నోటీసులు తీసుకున్న యాజమాన్యాలు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:02 AM