పెట్టుబడిదారులకు భద్రత, భరోసా..
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:37 AM
పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని లాంటిదని, ఉన్నతమైన ఆలోచనలతో ముందుకొచ్చి కలలను సాకారం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో గురువారం మొదలైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ...
వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చేవారికి పూర్తి సహకారం
ఈ సదస్సులో 10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు అవకాశం
కూటమి హయాంలో 22.6 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు ఎక్కువ సహకారం
సీఐఐ భాగస్వామ్య సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని లాంటిదని, ఉన్నతమైన ఆలోచనలతో ముందుకొచ్చి కలలను సాకారం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో గురువారం మొదలైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం పూర్తి భద్రత, భరోసా ఇస్తుందన్నారు. ఏపీ 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతంతో తూర్పు ఆసియా దేశాలకు ముఖద్వారంగా ఉందన్నారు.
వినూత్న ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతకు ఇక్కడ కొదవ లేదన్నారు. ఇక్కడికి వచ్చే పెట్టుబడుదారులు పూర్తి సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు సీఐఐ సదస్సుల ద్వారా 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ఒప్పందాలు జరిగాయని పవన్ వివరించారు. వాటి ద్వారా 19.6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ సదస్సుకు ముందు కాకినాడలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో 15 ఒప్పందాల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులతో 14 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా సంతకాలు జరిగాయన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సదస్సులో రూ.10 లక్షల కోట్ల్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువ సహకారం అందిస్తామని చెప్పారు. అక్కడున్న వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. ఏ పరిశ్రమ అయినా పర్యావరణానికి హాని కలగకుండా ఉండాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు