Share News

కూటమి బలంగా ఉండాలి!

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:01 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అందరూ కలిసి పనిచేయాలని.. కానీ ఎవరి గౌరవం తగ్గకూడదని అన్నారు. అలాగే, జనసేన గౌరవానికి భంగం వాటిల్లకుండా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.

కూటమి బలంగా ఉండాలి!

  • అందరూ కలిసి పనిచేయాలి, ఎవరి గౌరవమూ తగ్గకూడదు

  • అధికారంలోకి వచ్చాక జనసేన నేతల్లో రక్తం చల్లబడిపోయింది

  • అలాకాకుండా ఏంచేయాలో తెలుసు

  • 3 నెలల్లో పిఠాపురంలో క్యాంప్‌ ఆఫీస్‌

  • ఎంపీ సీట్లు త్యాగం చేయడం వల్లే జనసేనకు విశ్వసనీయత పెరిగింది

  • పిఠాపురం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

‘‘ఈ రోజు అధికారంలోకి వచ్చి అందరం పదవులు అనుభవిస్తున్నామంటే దీనికి జనసేన కార్యకర్తల కృషే కారణం. స్థానిక ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వారికి ప్రాధాన్యం కల్పించాలి. కష్టపడ్డ జనసైనికులను గుర్తించి సీట్లు, పదవుల్లో 30 నుంచి 40ు ప్రాధాన్యం కల్పించాలి.’’ - పవన్‌ కల్యాణ్‌

కాకినాడ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అందరూ కలిసి పనిచేయాలని.. కానీ ఎవరి గౌరవం తగ్గకూడదని అన్నారు. అలాగే, జనసేన గౌరవానికి భంగం వాటిల్లకుండా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం పట్టణంలో నిర్వహించిన బహిరంగసభలో పవన్‌కల్యాణ్‌ ప్రసంగించారు. ఎన్నికల్లో ఎంపీ సీట్లు వదులుకున్నందుకు, జనసేన త్యాగానికి విశ్వసనీయత(గుడ్‌విల్‌) పెరిగిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి సంబంధించి ఆర్వోబీ, సముద్రపు కోత నివారణకు నిధులు సాధించి అభివృద్ధి పనులు చేయగలుగుతున్నట్టు వివరించారు. తనకు కృతజ్ఞత ఎక్కువని, కష్టాల్లో ఉన్న మనిషికి అండగా ఉండడం తన గుణమని పేర్కొన్నారు.


‘‘నా నేల నాకు ఇదే నేర్పించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటా. ప్రజల అభివృద్ధి, ఆకాంక్షలకంటే ముందు వారి అవసరాలు తీర్చేలా పనిచేద్దాం.’’ అని పవన్‌ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో తనకు ప్రజల నుంచి వినతులు చాలా వస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో జనసేన కమిటీ పనితీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘‘అధికారంలో లేనప్పుడు జనసేన నేతల్లో ఉడుకు రక్తం ఉండేది, అధికారంలోకి వచ్చాక రక్తం చల్లబడిపోయింది. వారిలో రక్తం చల్లబడకుండా ఏం చేయాలో నాకు తెలుసు. 3-4 నెలల్లో పిఠాపురంలో క్యాంప్‌ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాం. అది ఏర్పాటయ్యాక నేతలతో కలిసి కూర్చుని చర్చించి పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో దిశానిర్దేశం చేస్తా.’’ అని చెప్పారు. అప్పటివరకు అభివృద్ధికి నేతలు సహకరించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి వచ్చి కనిపించడం లేదని చాలామంది అంటున్నారని, ఎందుకు కనిపించడంలేదనే దానికి నియోజకవర్గంలో జరుగుతున్న భారీ అభివృద్ధి పనులే నిదర్శనమని స్పష్టంచేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో చూపిస్తానన్నారు. ఎన్నికల్లో గెలవడం.. ఓడిపోవడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, అయితే ప్రజలు ఒకరిని గెలిపిస్తే ఏం చేయగలరనేది నిరూపించానని చెప్పారు.

రూ.1,500 కోట్ల పనులకు శ్రీకారం

పిఠాపురం నియోజకవర్గంలో రూ.1,500 కోట్ల విలువైన పనులకు పవన్‌కల్యాణ్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బహిరంగ సభ వేదికపై ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా రూ.230 కోట్లతో పిఠాపురం పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.118 కోట్లతో త్వరలో ఆర్వోబీ పనులు ప్రారంభిస్తామన్నారు. రూ.323 కోట్లతో ఉప్పాడలో సముద్రపుకోత నివారణకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు చేబ్రోలు గ్రామంలోని సీతారామస్వామి దేవాలయంలో ఏకాదశి వ్రత పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో రూ.10.67 కోట్ల వ్యయంతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకం పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 04:10 AM