Share News

28 నెలల్లో 22 లక్షల కోట్లు

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:48 AM

‘‘భారత్‌ నేడు అద్భుతమైన ప్రగతి పథంలో దూసుకుపోతోంది. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ గ్రోత్‌ ఇంజన్‌లా మారబోతోంది. సంస్కరణలు, పారిశ్రామిక అనుకూల విధానాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నాం.

28 నెలల్లో 22 లక్షల కోట్లు

  • పెట్టుబడులకు నవ్యాంధ్ర స్వర్గధామం

  • బిల్డ్‌ ఏపీ మా ప్రభుత్వ నినాదం

  • ప్రోత్సాహకాల కోసం ఎస్ర్కో ఖాతా

  • దేశాభివృద్ధిలో ఏపీ గ్రోత్‌ ఇంజన్‌

  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

  • సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026

  • కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో సీఎం

న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘భారత్‌ నేడు అద్భుతమైన ప్రగతి పథంలో దూసుకుపోతోంది. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ గ్రోత్‌ ఇంజన్‌లా మారబోతోంది. సంస్కరణలు, పారిశ్రామిక అనుకూల విధానాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నాం. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో శాశ్వతంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది’’ అని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కేంద్రం అందిస్తున్న సహకారం, వివిధ రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్‌ కార్యాచరణను పారిశ్రామికవేత్తలకు వివరించారు. గత ఏడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. గడచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని చెప్పారు. కేవలం ఎంవోయూలకే పరిమితం కాకుండా వాటిని వాస్తవ పెట్టుబడులుగా మలిచేలా ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. పెట్టుబడుల స్వర్గధామం నవ్యాంధ్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బిల్డ్‌ ఏపీ నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.


రాష్ట్రానికి భారీ పరిశ్రమలు

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నిర్ణీత గడువులోగా, నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా ‘ఎస్ర్కో అకౌంట్‌’ విధానాన్ని తీసుకువస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే నెల 12, 13 తేదీల్లో రాష్ట్రంలో జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ సమక్షంలో ఈ విప్లవాత్మక విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై రాయితీల కోసం ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, పాతకాలపు నాలా వంటి చట్టాలను రద్దు చేశామని తెలిపారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’ దశ దాటి ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ యుగంలోకి అడుగుపెట్టామని, దరఖాస్తు చేసుకున్న క్షణం నుంచే అనుమతులు వేగంగా లభిస్తాయని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఏ విధానాన్నైనా తక్షణమే అమలు చేయడానికి ఏపీ సిద్ధంగా ఉందన్నారు. గూగుల్‌ 1 గిగావాట్‌ డేటా సెంటర్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ వంటి ప్రముఖ సంస్థలు ఏపీకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సాంకేతిక, గ్రీన్‌ ఎనర్జీ, పెట్రోకెమికల్స్‌ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో 5 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయని, రిలయన్స్‌తో పాటు బీపీసీఎల్‌ పెట్రోకెమికల్స్‌ కాంప్లెక్స్‌ వంటి భారీ ప్రాజెక్టులు వేగంగా పట్టాలెక్కుతున్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో 10 వేల ఎకరాల్లో భారీ సెమీకండక్టర్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో ప్రత్యేకంగా డ్రోన్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో క్వాంటమ్‌ కంప్యూటర్లను తయారు చేస్తామని, అమరావతి నుంచి వీటిని ఎగుమతి చేస్తామని స్పష్టం చేశారు. 10 జిల్లాలను కలుపుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఆగ్రో ప్రాసెసింగ్‌, ప్రకృతి వ్యవసాయానికి ఊతమిచ్చేలా హార్టికల్చర్‌ హబ్‌ను తీర్చిదిద్దుతామన్నారు.


అన్ని రంగాల్లో పురోగతి

గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి నదులను అనుసంధానిేస్త ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి కొరత ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. సౌత్‌ఈస్ట్‌ ఏషియాకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చడమే తమ లక్ష్యమన్నారు. 500 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యంలో ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. దుగ్గరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు మజగావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చిందని, మచిలీపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు గోవా షిప్‌యార్డ్‌ సంస్థ అంగీకరించిందని వెల్లడించారు. తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలో డ్రోన్‌, ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రాయలసీమలో ఐదో తరం ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టును రక్షణ శాఖ ప్రారంభించిందని తెలిపారు. డేటా లేక్‌ వంటి వ్యవస్థల ద్వారా ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. జీఎస్టీ పన్నుల వసూళ్లలో ఏఐ ఆధారిత సాంకేతికతను అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐతో పాటు పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో రాణించేలా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను ప్రత్యేక బ్రాండ్‌ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లకు ప్రమోట్‌ చేస్తామని వెల్లడించారు. బ్లూ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని చంద్రబాబు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:48 AM