గోదారి-కావేరిని కలపండి!
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:48 AM
గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్రం చొరవ, రాష్ట్రాల సమన్వయంతో ఈ నదుల అనుసంధానం జరిగితే దక్షిణాదిన...
వాటర్‌గ్రిడ్‌కూ మార్గం సుగమం
ప్రధానికి చంద్రబాబు అభ్యర్థన
పుష్కరాలకు ప్రత్యేక నిధులివ్వండి
మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకరించండి
విశాఖకు మెట్రో రైలు ఇవ్వండి
పాతికేళ్ల పాలనా ప్రస్థానంపై శుభాకాంక్షలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ
పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్రం చొరవ, రాష్ట్రాల సమన్వయంతో ఈ నదుల అనుసంధానం జరిగితే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమృద్థిగా నీరు అందుతుందన్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసంలో ఆయనతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్థికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ, నీటిపారుదల వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి- కావేరి నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధానికి సీఎం వివరించారు.
దేశవ్యాప్తంగా రహదారుల నెట్‌వర్క్, పవర్‌గ్రిడ్ వంటివి ఎన్‌డీఏ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని.. ఇప్పుడు నదుల అనుసంధాన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్థి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా... దేశ విదేశాల నుంచి సైతం గోదావరి పుష్కరాలకు భక్తులు తరలి వస్తారని సీఎం వివరించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న ఔటర్ రింగ్ రోడ్డు వంటి అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. విశాఖ మెట్రోను మంజూరు చేయాలని కోరారు. బీచ్ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. రాష్ట్రంలో అందరికీ అభివృద్థి ఫలాలు సమానంగా అందేలా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర-2047 విజన్ గురించి ప్రధానికి తెలిపారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. కరువు నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మదనపల్లె కేంద్రంగా ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలను కూడా వివరించారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని తెలిపారు.
మీది స్ఫూర్తిదాయక నాయకత్వం
25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశసేవలో అరుదైన ఘనత సాధించారని.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని చూపారని.. క్రమశిక్షణ, నిబద్థతతో దేశానికి సేవలు అందించారని కొనియాడారు. దూరదృష్టి, స్పష్టమైన లక్ష్యం, దృడమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పాలనతో భారత్‌ను ప్రపంచ శక్తిగా మలిచారని.. సంక్షేమం, అభివృద్థి, సుపరిపాలనతో దేశ గమనాన్ని మార్చారని ప్రశంసించారు. ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి వికసిత్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత గౌరవాన్ని, విశ్వసనీయతను మరింత పెంచేలా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు