Share News

అమరావతిపై అదే కక్ష!

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:07 AM

రాజధాని అమరావతిలో వేగంగా పనులు జరుగుతుంటే వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

అమరావతిపై అదే కక్ష!

  • రాజధానిలో పనులు వైసీపీకి ఇష్టం లేదు

  • పదే పదే ప్రపంచబ్యాంకు, ఏడీబీకి ఫిర్యాదులు

  • అమరావతి రైతులపై వైసీపీ నేతల పగ

  • రుషికొండపై నాలుగు నెలల్లో నిర్ణయం

  • ఏప్రిల్‌కి పెట్టుబడిదారుల రక్షణ చట్టం

  • హార్టీకల్చర్‌ హబ్‌ మిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం

  • ఇప్పటి స్థితిలో పునర్విభజన బిల్లు మంచిదే

  • రేపటిలోగా కూటమి ఎంపీలు ఢిల్లీలో ఉండాలి

  • మంత్రులతో సీఎం చంద్రబాబు మాటామంతీ

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో వేగంగా పనులు జరుగుతుంటే వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని రైతులపై కక్ష కట్టి, అమరావతిపై ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు వైసీపీ నేతలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నారని ఆగ్రహించారు. రైతులు చేసిన త్యాగాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారని, వైసీపీకి అమరావతి సాకారం కావడం అసలు ఇష్టం లేదన్నారు.

శుక్రవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సీఎం అధ్యక్షతన హైబ్రిడ్‌ విధానంలో జరిగింది. చంద్రబాబు, లోకేశ్‌ మినహా మిగిలిన మంత్రులంతా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. క్యాబినెట్‌ భేటీలో అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి అంశం చర్చకు వచ్చింది. అమరావతి కోసం రైతులు చేసిన పోరాటానికి గుర్తుగా అమరావతిలో ఏదో ఒకటి చేయాలని లోకేశ్‌ సూచించగా, సీఎం తప్పనిసరిగా చేద్దామన్నారు.


పునర్విభజనతో ఏపీకి మేలు

కేంద్రం తెస్తున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఏపీకి ఎంతో మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. అలా కాకుండా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 50 శాతం పెంచడం వల్ల అన్ని రాష్ట్రాలకూ ఉపయోగమే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా ఈనెల 29 నాటికి ఉండాలని కోరారు. డీలిమిటేషన్‌పై మాట్లాడేందుకు ఢిల్లీ రావాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఫోన్‌ చేశారని సీఎం... మంత్రులకు వివరించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్‌ వచ్చిందని తెలిపారు. తనతోపాటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ను కూడా ఢిల్లీ రావాల్సిందిగా కోరారని, అయితే ఆయన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో రాలేకపోతున్నారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పునర్విభజన ఏపీకి చాలా మంచిదని, దీన్ని అందరం ఆహ్వానించాలని సీఎం.. మంత్రులకు తెలిపారు.


రుషికొండపై చర్చ..

రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలనే అంశంపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ముందు ఉంచారు. ఆతిధ్యరంగానికి ఇవ్వాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచించింది. దీనిపై అధ్యయనం చేసి, 120 రోజుల్లో రుషికొండ ప్యాలె్‌సపై వచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్ర్‌స్టను పరిశీలించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకొన్నారు. రుషికొండను ప్రజల సందర్శనార్థం ఉంచుదామని సూచించగా, సీఎం ఆమోదించారు.

ప్రాజెక్టుల క్యాలెండర్‌ అమలు చేద్దాం

రాష్ట్రంలో పెట్టుబడిదారుల రక్షణ చట్టాన్ని జనవరికి ఆమోదించి వెంటనే కేంద్రానికి పంపాలని సీఎం సూచించారు. ఏప్రిల్‌ నాటికి కేంద్రం ఆమోదిస్తే ఏప్రిల్‌ 1 నుంచి ఏపీలో ఈ చట్టం అమలులోకి వస్తుందని చెప్పారు. అన్ని ప్రాజెక్టులకు క్యాలెండర్‌ను అమలు చేయాలన్నారు.

హార్టీకల్చర్‌ హబ్‌కు సీఈవో

రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ను డిసెంబర్‌ 1న ప్రారంభిస్తామని, దీని వల్ల వ్యవసాయ ఆదాయం పెరగాలని.. రైతులకు తగిన మద్దతు ధర లభిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. హార్టీకల్చర్‌ హబ్‌ను పక్కాగా అమలు చేసేందుకు ఒక మిషన్‌ను నెలకొల్పి దానికి ఒక సీఈవోను కూడా నియమిస్తామని సీఎం తెలిపారు.


కొఠియా వివాదంపై..

ఆంధ్రా-ఒడిసా సరిహద్దుల్లో కొఠియా గ్రామాల వివాదం, గిరిజనులకు ఒడిసా అధికారుల వేధింపులు తదితర అంశాలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే ఒడిసా సీఎస్‌తో మాట్లాడాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. తాను కూడా ఒడిసా సీఎంతో మాట్లాడతానని చెప్పారు. రాజమండ్రి కోర్టు ఉత్సవాలలో పాల్గొనేందుకు ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వస్తున్నారని, వారి గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందుకు మంత్రులు అందరు రావాలని సీఎం కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 03:18 AM