Share News

ప్రతి ఇంటా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి

ABN , Publish Date - Sep 21 , 2026 | 03:25 AM

ప్రకృతికి ప్రాధాన్యమిస్తూ భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి ఇల్లూ గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రం కావాలని, అప్పుడే సాధారణ విద్యుత్‌ ఉత్పత్తిపై భారం తగ్గనుందని అన్నారు.

ప్రతి ఇంటా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి

  • ప్రకృతితో మమేకమైన అభివృద్ధికే భవిష్యత్తు

  • గ్రే గ్రోత్‌ నుంచి గ్రీన్‌ గ్రోత్‌ వైపు అడుగులు పడాలి

  • అభివృద్ధి ఆగకూడదు.. పర్యావరణానికి గాయం చేయకూడదు

  • బెంగళూరులో ‘ది ఎర్త్‌ సెంటర్‌’ ప్రారంభంలో సీఎం చంద్రబాబు

  • చంద్రబాబుకు మరో నగరం నిర్మించే అవకాశం: కర్ణాటక సీఎం డీకే

అమరావతి, బెంగళూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రకృతికి ప్రాధాన్యమిస్తూ భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి ఇల్లూ గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రం కావాలని, అప్పుడే సాధారణ విద్యుత్‌ ఉత్పత్తిపై భారం తగ్గనుందని అన్నారు. ఆదివారం బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌లో సంపూర్ణ పర్యావరణానికి అనుకూలమైన విస్టా స్పేసెస్‌ ఎకో ఫ్రెండ్లీ విధానంలో నిర్మించిన ‘ది ఎర్త్‌ సెంటర్‌’ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి ఎర్త్‌ సెంటర్‌ భవనాన్ని ప్రారంభించారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక పని వాతావరణాన్ని సమన్వయం చేస్తూ ది ఎర్త్‌ సెంటర్‌ను నిర్మించారు. సుస్థిర నిర్మాణం, ప్రకృతి అనుసంధానం, రీ సైకిల్‌ చేసిన పదార్థాల వినియోగం వంటి అంశాలకు ఈ భవనంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ భవనం ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నగరాలు పూర్తిగా కాంక్రీట్‌మయంగా మారాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే విధానం వస్తోందన్నారు. కాంక్రీట్‌ జంగిల్స్‌ నుంచి పర్యావరణహిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రే గ్రోత్‌ నుంచి గ్రీన్‌ గ్రోత్‌ వైపు అడుగులు వేయాలని సూచించారు. భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి సాగాలని స్పష్టం చేశారు.


పర్యావరణ సమస్యలను అధిగమిద్దాం

వాతావరణ మార్పులతో కలిగే దుష్పరిణామాలు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని, ఇప్పటికే మన ముందున్న సవాల్‌ అని చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. భవన నిర్మాణాల్లో నెట్‌ జీరో విధానాన్ని అవలంబించాలని, సోలార్‌ విద్యుత్తుకు ప్రాధాన్యమివ్వాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. చెత్తను కంపోస్టుగా మార్చడంతోపాటు రీయూజ్‌ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ది ఎర్త్‌ సెంటర్‌ నిర్మాణం జరిగిందని కొనియాడారు. ఇలాంటి పర్యావరణహిత భవనాలకే భవిష్యత్తు ఉంటుందన్నారు. దశాబ్దాలుగా నగరాల అభివృద్ధి గ్రే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆధారంగా సాగిందని... ఇకపై గ్రీన్‌ గ్రోత్‌, సర్క్యులర్‌ గ్రోత్‌, రీజనరేటివ్‌ గ్రోత్‌ విధానాలు అవసరమని సూచించారు. స్వచ్ఛమైన విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేలా భవనాలను రూపొందించాలని సూచించారు. ప్రతి ఇంటి పైకప్పును ఒక పవర్‌ ప్లాంట్‌గా మార్చవచ్చని, ప్రతి నీటి చుక్కను తిరిగి వినియోగించుకోవచ్చని, ప్రతి వ్యర్థ ప్రవాహాన్ని ఒక వనరుగా మార్చుకోవచ్చన్నారు. నీటిని, నేలను కాపాడటం అంటే సంపదను సృష్టించడమేనన్నారు. వ్యవసాయంలో జీరో బడ్జెట్‌ నేచరుల్‌ ఫార్మింగ్‌ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఇదే స్ఫూర్తిని పట్టణాభివృద్ధిలోనూ అవసరమని పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ‘ది ఎర్త్‌ సెంటర్‌’ ప్రాజెక్టును రూపొందించిన రఘువీర్‌ వీరమాచినేని, ప్రవీణ్‌కుమార్‌, విస్టా స్పేసెస్‌ బృందం, వెంకరమణన్‌ అసోసియేట్స్‌ ప్రతినిధుల్ని చంద్రబాబు అభినందించారు.


అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ అద్భుతం: డీకే ప్రశంసలు

అమరావతిలో అమలుచేసిన ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ది ఎర్త్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో వివిధ ప్రాంతాల అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని, కొత్త నగరాలు, కొత్త ప్రాంతాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ప్రస్థానంలో ఎదురయ్యే ఇబ్బందులకు చంద్రబాబు అమలుచేసిన ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం మార్గనిర్దేశం చేసిందన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ను చంద్రబాబే తొలిసారి అమలుచేశారని ప్రశంసించారు. ఈ విధానాన్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అభివృద్ధిలో భూములిచ్చిన వారిని భాగస్వాములను చేయడమనేది చాలా మంచి ఆలోచనగా పేర్కొన్నారు. చంద్రబాబు ముందుచూపు, నిబద్ధత కలిగిన నేత అని కొనియాడారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో చంద్రబాబుదే కీలక భూమిక అన్నారు. మరో అందమైన అమరావతి నగరం నిర్మించే అవకాశం ఆయనకు దక్కిందన్నారు. బెంగళూరు పరిధి దాటి అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ 1.4 కోట్ల మంది జనాభా ఉంటే... 1.3 కోట్ల వాహనాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడి రోడ్లను మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దక్షిణ భారత్‌లో మేధస్సుకు కొదవలేదన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది కీలకమన్నారు. సంపూర్ణ పర్యావరణానికి అనుకూలమైన భవన నిర్మాణానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. విస్టా స్పేసెస్‌ జాయింట్‌ ఎండీ రఘువీర్‌ వీరమాచనేని, శ్వేత, రవికుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 03:25 AM