వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:57 AM
వైద్యం నుంచి వ్యవసాయం వరకు వివిధ రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
టెక్నాలజీతో సేవలను మరింత సులభతరం చేయాలి
శాఖల పనితీరు, ప్రభుత్వ ఆదాయం మెరుగుపర్చాలి
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం ఆదేశాలు
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైద్యం నుంచి వ్యవసాయం వరకు వివిధ రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆధునిక టెక్నాలజీ, ఏఐ స్టాక్ ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు శాఖల పనితీరు, ప్రభుత్వ ఆదాయాలను మెరుగుపర్చాలని నిర్దేశించారు. సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్సులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత సమర్థంగా, వేగంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడినప్పుడే మరింత మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పర్యవేక్షణ లోపాలను సరిదిద్దుకుని, ప్రతి శాఖ తన పనితీరును నిరంతరం సమీక్షించుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆసుపత్రుల్లో చేరిన వెంటనే రక్త పరీక్షలు, ఎంఆర్ఐలు, ల్యాబ్ టెస్టుల పేరిట రోగులను ఇబ్బంది పెట్టకుండా రోగం లక్షణాలను బట్టి ఏఐ ద్వారా వైద్య సేవలను అందించాలని సీఎం సూచించారు. తద్వారా త్వరితగతిన రోగికి ఉపశమనం కలిగించవచ్చని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగంలోనూ ఏఐ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నంద్యాల జిల్లాలో ప్రయోగాత్మకంగా ఏఐ ఆధారిత సేద్యంలో సాధించిన విజయాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించాలని వ్యవసాయ శాఖకు సూచించారు. వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతక సహకారం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. అధికారులకు రెవెన్యూ, లీగల్ ఏఐ స్టాక్ ద్వారా వివిధ అంశాలను విశ్లేషించి, అత్యుత్తమ పనితీరు సాధించేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అత్యంత కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఒక కొలమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సాంఘిక, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఆర్థిక, మున్సిపల్, ఇంధన శాఖల ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: