Share News

ఏపీ బ్రాండ్‌ పెరగాలి

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:15 AM

సీఐఐ భాగస్వామ్య సదస్సును కేవలం ఎంవోయూల కోసం కాకుండా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తి నింపేలా, ఏపీ బ్రాండింగ్‌ మరింత పెరిగేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరిగే ఈ సదస్సుకు సన్నాహకంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో 5 రీజినల్‌ కాన్ఫరెన్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు

ఏపీ బ్రాండ్‌ పెరగాలి

  • ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యమిచ్చేలాఐదు ప్రాంతాల్లో 5 కాన్ఫరెన్స్‌లు

  • పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలి

  • ప్రాజెక్టులకు ఎంవోయూలు ఇక్కడే

  • ‘స్టార్టప్‌’ పెట్టుబడులకు ‘షార్క్‌ట్యాంక్‌’: సీఎం చంద్రబాబు

  • భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహకాలపై సమీక్ష

అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సీఐఐ భాగస్వామ్య సదస్సును కేవలం ఎంవోయూల కోసం కాకుండా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తి నింపేలా, ఏపీ బ్రాండింగ్‌ మరింత పెరిగేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరిగే ఈ సదస్సుకు సన్నాహకంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో 5 రీజినల్‌ కాన్ఫరెన్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో వీటిని నిర్వహించి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని, ప్రాజెక్టులకు ఎంవోయూలు జరగాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, పెట్టుబడి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చర్చలు నిర్వహించాలన్నారు. విశాఖపట్నంలో నవంబరు 12, 13 తేదీల్లో నిర్వహించనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహకాలపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడం, గతంలో కుదిరిన ఎంవోయూలను కన్వర్ట్‌ చేయడం, ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులను గ్రౌండ్‌ చేయడం, రీజినల్‌ కాన్ఫరెన్స్‌ల ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ప్రతి రీజినల్‌ కాన్ఫరెన్స్‌లో ఎంఎస్ఎంఈ షోకేస్‌ పేరుతో ప్రోత్సాహం అందించాలని సీఎం సూచించారు. అలాగే స్టార్ట్‌పలకు పెట్టుబడులు పెట్టేవారి కోసం వినూత్నంగా షార్క్‌ట్యాంక్‌ అనే విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. రతన్‌ టాటా ఇన్నొవేషన్‌ హబ్‌లను రీజినల్‌ కాన్ఫరెన్స్‌లకు అనుసంధానం చేయాలని చెప్పారు. పాఠశాల విద్యార్థులు స్టార్టప్‌ ఆలోచనలు చేసేలా రీజినల్‌ సదస్సులు ఉండాలని.. ఏడో తరగతి నుంచే పిల్లలకు ప్రేరణ ఇచ్చేలా ఎంట్రప్రెన్యూర్షి్‌పకు సంబంధించి పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలన్నారు. ‘ఇన్వెస్ట్‌ కడప’ తరహా కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తే మరింతగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు. భాగస్వామ్య సదస్సుకు ముందే.. మరో 30 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. అక్టోబరు చివరి నాటికి పెట్టుబడి ప్రతిపాదనల్లో 80 శాతం కన్వర్ట్‌ చేయాలని.. వాటిలో 75 శాతం గ్రౌండింగ్‌ చేసే లక్ష్యంతో శాఖలు పనిచేయాలని సీఎం నిర్దేశించారు.


రీజినల్‌ కాన్ఫరెన్స్‌ల షెడ్యూల్‌..

వచ్చేనెల7 నుంచి 26 తేదీ వరకు రీజినల్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తారు. విశాఖలో 7న ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ-ఫిన్‌టెక్‌, సెమీకండక్టర్స్‌, జీసీసీ, ఫార్మా, మెడ్‌టెక్‌పై ఫోకస్‌ చేస్తూ కాన్ఫరెన్స్‌ జరుగుతుంది. 12న కాకినాడలో (మారిటైమ్‌, షిప్‌ బిల్డింగ్‌, కెమికల్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, అమ్మోనియా, ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రంగాలు).. 16న గుంటూరులో (పరిపాలన, రాజధాని ప్రాంత అభివృద్ధి, అర్బన్‌ ఇన్‌ఫ్రా, క్వాంటమ్‌ వ్యాలీ, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌).. 23న అనంతపురంలో (ఏరో స్పేస్‌, రక్షణ, ఆటోమోటివ్‌, సహజ వ్యవసాయం, హార్టీకల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పునరుత్పాదక ఇంధనం).. 26న తిరుపతిలో (పర్యాటకం, ఆతిథ్యం, ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌, సెమీకండక్టర్‌, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌, ఆటోమోటివ్‌, స్పేస్‌, ఫుట్‌వేర్‌ రంగాలు) కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తారు. విశాఖ సదస్సుకు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించేందుకు దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దేశీయంగా చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించగా.. శుక్రవారం అహ్మదాబాద్‌, 28న హైదరాబాద్‌, 30న ముంబైలో జరుపుతారు. అంతర్జాతీయంగా సింగపూర్‌, దక్షిణ కొరియా, తైవాన్‌లలో రోడ్‌షోలు పూర్తయ్యాయి. ఈ నెల 29-అక్టోబరు 1 మధ్య స్వీడన్‌లో, అక్టోబరు 13-14 తేదీల్లో జపాన్‌లో, 15, 16 తేదీల్లో చైనాలో నిర్వహిస్తారు.

ఈ వార్తలనూ చదవండి...

పీజీ కోర్సుల్లో చేరేవారేరి?

మహిళల భద్రతకు ప్రాధాన్యం

Updated Date - Sep 25 , 2026 | 04:15 AM