డిగ్రీ నుంచే ‘ఏఐ’ నైపుణ్యాభివృద్ధి!
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:55 AM
విద్యార్థులకు డిగ్రీ నుంచే అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక నైపుణ్యాభివృద్ధితో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ నెలలోనే అమరావతిలో పాన్ ఐఐటీ కౌన్సిల్
వివిధ రంగాల్లో ఏఐ విస్తరణకు పరిశోధనలు
కొంత నిధులు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇటీవలి సదస్సు తీర్మానాల అమలు దిశగా చర్యలు
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు డిగ్రీ నుంచే అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక నైపుణ్యాభివృద్ధితో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. డిగ్రీ విద్యతో సమాంతరంగా కృత్రిమ మేధ బోధనను అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధి విషయంలో సమయం ఆదా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో ఈ కీలక మార్పును అమలు చేయాలని భావిస్తోంది. ఈ నెల 3న విజయవాడ అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన పాన్ ఇండియా ఐఐటీ-2026 సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి కేంద్రంగా ఈ నెలలోనే ‘పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్’ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంతో రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఏఐ సాంకేతిక నైపుణ్య విస్తరణతో కూడిన పరిశోధనలు చేయడంతో పాటు వాటి ఫలితాలను రాష్ట్రానికి అందించేలా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
యూనివర్సిటీల సమన్వయంతో..
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో విద్యను అభ్యసించిన సుమారు 5 లక్షల మంది ఐఐటీయన్లతో ఏర్పడిన కూడిన పాన్ ఐఐటీ అలుమ్ని ఇండియా బలమైన నెట్‌వర్క్ కలిగి ఉంది. ఐఐటీయన్లు రాష్ట్రంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, ఎనర్జీ, వ్యవసాయం, జలవనరులు, వాతావరణంలో మార్పులు, రవాణా తదితర రంగాల్లో కృత్రిమ మేధను జోడించి అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో కూడిన సేవలు అందించాలని ఇటీవల జరిగిన సదస్సులో నిర్ణయించారు. పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల కోసం రూ.500 కోట్ల మేర నిధులను సమీకరించనున్నారు. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత జమ చేయనుంది. పాన్ ఇండియా ఐఐటీయన్ల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే కౌన్సిల్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలసి సమన్వయం చేసుకొని పనిచేయనుంది.
డిగ్రీతో పాటు సాంకేతిక నైపుణ్యం
విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను నేర్పించడంపై, అవగాహన కల్పించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముందస్తుగా రెగ్యులర్ విద్యను అభ్యసించాకే, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలనే వాదన ఉంది. అయితే దీన్ని కొందరు మేధావులు అంగీకరించడం లేదు. డిగ్రీ విద్యతో సమాంతరంగా నైపుణ్యాభివృద్ధితో కూడిన సాంకేతిక విద్యను చదవడం ద్వారా సమయాభావం ఉండదన్న మరో అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డిగ్రీతో పాటు సాంకేతిక నైపుణ్యంతో కూడిన విద్యాబ్యాసాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు