Share News

బాధితులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలి

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:23 AM

రాష్ట్రంలో మురసు తుఫాన్‌ అనంతర సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అందుతున్న పరిహారంపై ఆరా తీసిన ఆయన..

బాధితులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలి

  • మురసు పంటనష్టం లెక్కింపులో వేగం పెరగాలి

  • నిత్యావసరాల ధరలను నియంత్రించాలి

  • తుఫాన్‌ సహాయ చర్యలపై సీఎం సమీక్ష

  • 1,825 గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు

  • రైతుబజార్లలో రూ. 35కే కిలో ఉల్లి

  • బియ్యం ధరలు తగ్గింపునకు మిల్లర్లు, హోల్‌సేలర్లు అంగీకారం

  • చంద్రబాబుకు వివరించిన అధికారులు

అమరావతి, నవంబరు7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మురసు తుఫాన్‌ అనంతర సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అందుతున్న పరిహారంపై ఆరా తీసిన ఆయన.. ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని స్పష్టం చేశారు. శనివారం క్యాంప్‌ కార్యాలయంలో తుఫాన్‌ సహాయక చర్యలు, బాధితులకు ఇస్తున్న పరిహారంపై సీఎం సమీక్ష నిర్వహించారు.

బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు తక్షణ ఆర్థిక సాయం అందించే అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి 92 శాతం అంచనాలు పూర్తయ్యాయని, వ్యవసాయ పంటలకు సంబంధించి ఈనెల 9 నాటికి పూర్తి స్థాయిలో అంచనా వేసే ప్రక్రియ ముగుస్తుందని అధికారులు వివరించారు. రెండు తుఫాన్ల ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ, కూలిన స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయడం వంటి పనులపై సీఎం ఆరా తీశారు.


అర్నబ్‌ తుఫాన్‌కు 30 వేల స్తంభాలు దెబ్బతినగా, అన్ని గ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరించినట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. మురసు తుఫాన్‌కు ప్రభావితమైన 1,825 గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 3.82 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలు అందించామని, మిగిలిన వారికి వెంటనే పంపిణీ పూర్తిచేస్తామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెప్పారు. మరోవైపు మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. ఉల్లి, బియ్యం, పామాయిల్‌, గోధుమపిండి, కందిపప్పు వంటి సరుకుల ధరలను నియంత్రించాలని చెప్పారు.

నిత్యావసరాలను రేషన్‌ దుకాణాల్లో అందించే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. కిలో రూ. 35కే ఉల్లిని రైతుబజార్లలో విక్రయిస్తున్నామని, ఇందుకోసం 8 వేల క్వింటాళ్ల ఉల్లిని మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్నామని అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గించి విక్రయించేందుకు నిరంతరం మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో బీపీటీ, సోనా, సాంబ, కేఎన్‌ఎం రకాల బియ్యాన్ని రూ. 66కు, హెచ్‌ఎంటీ-ఆర్‌ఎన్‌ఆర్‌ రకాల బియ్యాన్ని రూ. 76కు, జై శ్రీరామ్‌ రకాన్ని రూ. 82కు, కామన్‌ వెరైటీలు రూ. 47కు విక్రయించేందుకు వ్యాపారులు అంగీకరించారని వివరించారు.


ధరణి బ్రాండ్‌ బియ్యాన్ని రైతుబజార్లలో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 70కు విక్రయిస్తున్న బియ్యాన్ని రైతుబజార్లలో రూ.50కే అందుబాటులోకి తెచ్చామని, అలాగే బీపీటీ రకం రూ. 49కే విక్రయిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 150 కౌంటర్ల ద్వారా 27,430 క్వింటాళ్ల బియ్యాన్ని 1.03 లక్షల కుటుంబాలు వినియోగించుకున్నట్లు వివరించారు. రూ. 125కు లీటర్‌ పామాయిల్‌, రూ.100కే కందిపప్పు, రూ. 25కే కిలో గోధుమపిండిని రేషన్‌ దుకాణాల్లో అందించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 01:26 AM