అభ్యర్థులెవరో చూడొద్దు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:27 AM
పొత్తు ధర్మాన్ని నిలబెట్టేందుకు నా స్థాయిని కూడా పక్కనపెట్టి.. చాలా మంది నాయకులతో మాట్లాడాను. అయినా కూడా వినకుంటే వారికి పార్టీ పట్ల విధేయత లేదని భావించాల్సి ఉంటుంది. - సీఎం చంద్రబాబు
మా పనితీరు చూసి కూటమినే గెలిపించండి.. ప్రజలకు సీఎం వినతి
‘స్థానిక’ ధిక్కారాన్ని సహించం
పొత్తు ధర్మం పాటించాల్సిందే
రెబెల్స్‌పై సస్పెన్షన్ వేటే
రెండో మాటకు తావే లేదు
సీట్లు రాని వారికి నామినేటెడ్, ఇతర పదవులతో న్యాయం చేస్తాం
ఉపసంహరింపజేసే బాధ్యత ఇన్చార్జి మంత్రులదే
పంచాయతీ ఎన్నికలయ్యాక సహకార సంఘాలకూ పెట్టేద్దాం: సీఎం
క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు చర్చ
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరనేది చూడకుండా.. కూటమి ప్రభుత్వ పనితీరు చూసి.. కూటమి నిలబెట్టిన అభ్యర్థులనే గెలిపించాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపిచ్చారు. కూటమి కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని పాటించి తీరాల్సిందేనని.. ఇందులో రెండో అభిప్రాయానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. అజెండా అంశాలపై చర్చ అనంతరం అధికారులందరినీ పంపించివేసి మంత్రులతో సీఎం మాట్లాడారు.
అర్నబ్ తుఫాను నష్టం.. స్థానిక ఎన్నికలు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తులు, నాయకుల కంటే పార్టీ గొప్పదని.. పొత్తు ధర్మం అంతకంటే ముఖ్యమని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా పార్టీ ఆదేశాలను కాదని పోటీలో ఉండే రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు ఖాయమన్నారు. ఈ విషయంలో కూటమిలోని మూడు పార్టీలదీ ఒకటే మాటగా పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో కొందరు రెబల్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని.. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. స్థానికంలో సీట్లు దక్కని అభ్యర్థులకు పార్టీపరంగా లేదా నామినేటెడ్ పదవుల ద్వారా న్యాయం చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
తాత్కాలిక ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను వదులుకోవద్దని రెబల్స్‌కు సూచించారు. తాను, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్.. ముగ్గురం కలిసి స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాట్లుపై గతంలో ఎన్నడూ లేనంత కసరత్తు చేశామని.. అయినా కూటమిలో విభేదాలంటూ ప్రత్యర్థులు ప్రచారం చేశారని, దానికి చెక్ పెట్టే విధంగా ముగ్గురం కలిసి విలేకరుల సమావేశం పెట్టి మరీ సీట్ల సర్దుబాటు ఏవిధంగా చేసుకున్నామో, కూటమి పార్టీల అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయాలో వివరించామని, దీనికి ప్రజల్లో మంచి స్పందన లభించిందని తెలిపారు.
బీఫామ్ ఉన్న అభ్యర్థులే ఉండాలి..
రెబల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో గురువారం నాటికే పోటీలో లేకుండా చేయాల్సిన బాధ్యత జిల్లా ఇన్చార్జి మంత్రులు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మంత్రులు తమ సొంత నియోజకవర్గాల బాధ్యతతోపాటు వారు ఇన్చార్జిగా ఉన్న జిల్లాల్లో బీఫామ్స్ ఇచ్చిన కూటమి అభ్యర్థులే పోటీలో ఉండేలా చూడాలని, వారి గెలుపు బాధ్యత కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. తాను తుఫాను పరిస్థితిని గాడినపెట్టేందుకు ఈ రెండ్రోజులూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూనే పార్టీ పనులపైనా దృష్టి పెడతానని చెప్పారు.
సహకార ఎన్నికలకు ఏర్పాట్లు..
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వచ్చే నెల 7వ తేదీతో పూర్తవుతాయని సీఎం తెలిపారు. తర్వాత మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని, అవి ముగిసిన వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
‘సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నాయకులం కూర్చుని మాట్లాడుకున్నాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం. దాని ముందు సీట్ల సర్దుబాటు పెద్ద విషయం కాదు. జనసేన, బీజేపీ నుంచి అక్కడక్కడా రెబల్స్ బరిలో ఉన్నారు. పొత్తు ధర్మానికి అనుగుణంగా పోటీ నుంచి వైదొలగాలని వారికి మా స్థానిక నేతలు చెబుతున్నారు. అయినా వినకుండా ముందుకు వెళ్లే వారి విషయంలో మరో ఆలోచన లేకుండా ఓ నిర్ణయానికి వస్తాం’ అని పవన్ స్పష్టం చేశారు.
ఇన్చార్జి మంత్రులు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలతో సమన్వయం చేసుకోవాలి. జనసేన, బీజేపీ నేతలతోకూడా టచ్‌లో ఉండి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి. ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. వారితో ఓట్లు వేయించుకునే బాధ్యత స్థానిక నేతలపైనే ఉంది.
- సీఎం చంద్రబాబు
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు