మహిళలే భవిష్యత్ ఆర్థిక చోదక శక్తులు
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:27 AM
మహిళలే భవిష్యత్ గ్లోబల్ ఆర్థిక చోదకశక్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా రావాలని పిలుపునిచ్చారు. వచ్చే సీఐఐ సదస్సులో 50 శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలన్నారు.
‘ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్-2026’లో ముఖ్యమంత్రి
ఏపీలో 35.8 శాతం మహిళా శ్రామిక శక్తి ఉంది
దీనిని త్వరలోనే 50 శాతానికి తీసుకువెళ్తాం: సీఎం
విశాఖపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మహిళలే భవిష్యత్ గ్లోబల్ ఆర్థిక చోదకశక్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా రావాలని పిలుపునిచ్చారు. వచ్చే సీఐఐ సదస్సులో 50 శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలన్నారు. మహిళల రాజకీయ సాధికారతతో పాటు ఆర్థిక సాధికారతకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయ, ఆర్ధిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతం మించినప్పుడే తనకు సంతృప్తి అని చెప్పారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘‘ది ఉమెన్ హూ విల్ షేప్ ది నెక్ట్స్ ఎకానమీ’’ థీమ్‌తో జరిగిన చర్చలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ, సీఐఐ అలియన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుచిత్రా ఎల్లా, పారిశ్రామికవేత్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ, ‘‘అవకాశం ఇస్తే మహిళలు గొప్ప విజయాలు సాధిస్తారు. దేశాన్ని బలమైన ఆర్ధిక శక్తిగా నిర్మలాసీతారామన్ నడిపిస్తుండటం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో 1.13 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘం సభ్యులుగా ఉన్నారు. వారు తీసుకున్న రుణాల్లో 99.6 శాతం రీపేమెంట్ చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల వద్ద రూ. 30,000 కోట్ల కార్పస్ ఫండ్ ఉంది. దాదాపు రూ.లక్ష కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. స్వయం ఏపీ బ్రాండ్‌తో డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తున్నాం.
విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాను. స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలు ఉండటం సంతోషం. వైజాగ్ మేయర్ కూడా మహిళే. ఇటీవల ఏపీలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 8మంది మహిళలకు మేయర్లుగా అవకాశం కల్పించాం. రాజకీయ పార్టీలన్నీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేయాలి. ఇటీవల విశాఖ, విజయవాడ, మంగళగిరిలో రూ.50,000 కోట్ల విలువైన 60,000 ఇళ్ల పట్టాలు మహిళల పేరిట ఇచ్చాం.
కొత్త ప్రాజెక్టుల్లో మహిళలకే ఎక్కువ ఉద్యోగాలు
ప్రస్తుతం ఏపీలో 35.8 శాతం మహిళా శ్రామిక శక్తి ఉంది. దీనిని త్వరలోనే 50 శాతానికి తీసుకువెళ్తాం. విశాఖ బ్రాండెక్స్ దుస్తుల తయారీ కేంద్రంలో 20వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. గ్లోబల్ టాయ్ పార్క్‌లో 30వేల ఉద్యోగాలు మహిళల కోసం ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల్లో అధికంగా మహిళలకే ఉద్యోగాలు వస్తాయి. ప్రకృతి వ్యవసాయంలో కూడా మహిళలు అద్భుతాలు చేస్తున్నారు. ఎక్కడా రాజీ లేకుండా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
మహిళలు సాంకేతికతపై దృష్టి పెట్టాలి
డేటా సెంటర్లు, క్వాంటమ్, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాలకు అద్భుతమైన పురోగతి ఉంది. తిరుపతిలో సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. మహిళలు సాంకేతికతపై దృష్టిపెట్టాలి. మహిళా పారిశ్రామికవేత్తలకు ఎక్కువ రాయితీలు అందిస్తున్నాం. దావోస్ సమ్మిట్‌కు ఏపీ నుంచి ఐదుగురు మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యేలా సహకరిస్తాం. మహిళల కోసం ప్రత్యేకంగా టెక్ పార్క్ ఏర్పాటు చేసి.. వారికి ఉచితంగా భూమి, ప్రోత్సాహకాలు అందిస్తాం’’ అని సీఎం చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు