సవాళ్లతో సావాసం!
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:16 AM
సుమారు 50 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అభివృద్థికి కట్టుబడి పనిచేశానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా అవి నాతోనే
వ్యక్తిగత కక్షలకు అతీతంగా నా లక్ష్యం.. అప్పుడే రాజకీయాల్లో రాణించగలం
సంస్కరణల పిపాసి ప్రధాని మోదీ.. రూ.500 నోటు రద్దు చేయాలని సూచించా
‘ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్’ శేఖర్గుప్తాతో సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సుమారు 50 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అభివృద్థికి కట్టుబడి పనిచేశానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో పట్టణీకరణ ప్రణాళికాబద్థంగా లేకపోవడం వల్లే మురికివాడలను అభివృద్థి చేయాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక నగరాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
స్థిరమైన మౌలిక సదుపాయాలు, వినూత్న పట్టణ ప్రణాళికతో ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా అమరావతి గ్రీన్‌ఫీల్డ్ నగరం నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్’ శేఖర్గుప్తాతో సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణం.. సవాళ్లు
సుమారు 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజలకు సేవ చేయడం, మార్పు తీసుకురావడంపైనే తాను దృష్టి సారించానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయ జీవితంలో ఓర్పు, వ్యక్తిగత కక్షలకు అతీతమైన లక్ష్యం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. పాలనలో ఆవిష్కరణలు, సంస్కరణలకు ప్రాధాన్యమివ్వాలని తన అనుభవం నేర్పిందన్నారు.
తన కెరీర్ మొత్తంలో వాటినే అనుసరించానని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తాను సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులు ఎదుర్కొన్నానని, కానీ తాను వ్యక్తిగత కక్షలకు అతీతంగా ప్రజలకు మంచి పాలన అందించడంపైనే దృష్టి సారించానని వివరించారు.
రాష్ట్ర విభజన.. ఆర్థిక సవాళ్లు
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలకు సమానంగా రాష్ట్రంపై భారీ రుణభారం ఉందన్నారు. దీనిని అధిగమించడానికి సంపద సృష్టి, ఆదాయం పెంపు, కేంద్ర ప్రభుత్వ మద్దతును ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నామని వివరించారు. ఏపీ వ్యవసాయ మూలాలు, సుదీర్ఘ తీరప్రాంతంతో సహా అపారమైన సహజ వనరులను గుర్తిస్తూ, రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
పాలనలో డిజిటలైజేషన్
పాలనలో డిజిటలైజేషన్, పారదర్శకత కోసం తాను చేస్తున్న కృషి గురించి చంద్రబాబు వివరించారు డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం, నగదు ఆధారిత లావాదేవీలను తగ్గించడంలో ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
మైనార్టీల భాగస్వామ్యం..
పాలనలో మైనారిటీల భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. మతపరమైన భావోద్వేగాల కంటే ప్రభుత్వ మద్దతు ద్వారా సమానత్వం, సాధికారత సాధించడం ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ పదవుల్లో ముస్లింలకు తగిన ప్రాతినిథ్యం లేకపోవడాన్ని ప్రస్తావించారు.
రాష్ట్ర విభజన.. హైదరాబాద్ అభివృద్ధి
ఉమ్మడి రాష్ట్ర విభజనపై స్పందిస్తూ.. విభజన పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, అయితే అది సృష్టించిన సవాళ్లను తాను గుర్తించానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్థి, అక్కడ నాలెడ్జ్ ఎకానమీని నిర్మించడంలో తన పాత్రను గుర్తుచేసుకున్నారు, దాని ఫలాలను ఇప్పుడు తెలంగాణ పొందుతోందన్నారు.
‘సీఈవో ముఖ్యమంత్రి’.. మంచిదే!
దార్శనిక ప్రణాళిక, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇచ్చే ‘సీఈవో తరహా ముఖ్యమంత్రి’ అనే ముద్ర తనపై ఉండటాన్ని చంద్రబాబు స్వాగతించారు. అయితే తాను కేవలం సీఈవో సీఎంగానే కాకుండా నీటి భద్రత కోసం నదుల అనుసంధానం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్న సీఎంగా ముందుకు వెళుతున్నానని తెలిపారు.
సాంకేతిక రంగంలో ఏపీ పాత్ర
దార్శనికతకు..సాంకేతిక పురోగతి ప్రధాన ఆధారమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఏపీని ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ర్టానిక్స్, అభివృద్థి చెందుతున్న సాంకేతికతలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
పెట్టుబడిదారులకు భద్రత
పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించేందుకు, పెట్టుబడులకు భద్రత కల్పించే సవాళ్లను చంద్రబాబు ప్రస్తావిస్తూ.. గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో వాస్తవ రూపం దాల్చని వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ కారణంగా పెట్టుబడిదారుల్లో ఎలాంటి అభద్రతభావం నెలకొందో చూశామని, వీటన్నింటికీ పరిష్కారాలను అన్వేషిస్తూ అడుగులు వేస్తున్నామన్నారు.
ల్యాండ్ పూలింగ్ విజయవంతం
అమరావతిలో భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) ఒక విజయవంతమైన నమూనాగా నిలిచిందనేది నూరు శాతం నిరూపితమైందని చంద్రబాబు అన్నారు. ఇది రైతులను పట్టణాభివృద్థిలో భాగస్వాములుగా మార్చిందని, సంప్రదాయ భూసేకరణకు బదులుగా, రైతులు తమభూమిని ఇచ్చి, ప్రతిఫలంగా నివాస లేదా వాణిజ్య అవసరాల కోసం అభివృద్థి చేసిన ప్లాట్లతో పాటు వార్షిక చెల్లింపులను పొందుతున్నారన్నారు.
జెన్‌జీ ఆకాంక్షలు చూడాలి
పరిశ్రమలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి విద్య, నైపుణ్యాభివృద్థి తమ ప్రభుత్వ వ్యూహంలో అంతర్భాగంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో మారుతున్న రాజకీయ, సైద్ధాంతిక దృశ్యాన్ని జెన్‌జీ ఆందోళనలు ఆవిష్కరిస్తున్నాయన్నారు. యువశక్తిని ఉత్పాదక మార్గంలో మళ్లించడానికి, సామాజిక స్థిరత్వాన్ని కాపాడటానికి పర్యాటకం, అభివృద్థి చెందుతున్న రంగాలతో సహా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను సృష్టి అవసరమన్నారు.
విపత్తు నిర్వహణ.. భారీ ప్రాజెక్టులు..
ఎల్‌నినో, తుఫానుల సమయంలో తమ ప్రభుత్వం నిర్వహించిన సమర్థవంతమైన విపత్తు నిర్వహణను సీఎం ప్రస్తావించారు. ముందస్తు అంచనాల కోసం ఏఐని ఉపయోగించడం, సేవలను వేగంగా పునరుద్థరించడానికి పొరుగు రాష్ర్టాలతో సమన్వయం చేసుకున్నామన్నారు. సాంకేతికత, సమన్వయ పాలన వల్ల కలిగే ప్రయోజనాలను ఇది నిరూపిస్తోందన్నారు.
రాజకీయ వారసత్వం అపోహే!
రాజకీయ వారసత్వంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వంశపారంపర్య రాజకీయాలపై ఉన్న అపోహలను తోసిపుచ్చారు. రాజకీయాలు, వ్యాపారం, మరే రంగంలోనైనా విజయం అనేది.. కుటుంబ నేపథ్యంపై కాకుండా వ్యక్తిగత ప్రతిభ, కృషి, ప్రజామోదంపై ఆధారపడి ఉంటుందన్నారు. నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి మంచి పేరు, సామర్థ్యాన్ని పెంచుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు.
మెట్రో నగరాలతో అమరావతి పోటీ
రాజధాని అమరావతి రూపకల్పనలో సుస్థిరత, సామర్థ్యం మిళితమై ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పచ్చదనం, జలాశయాలు, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి భారీ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ సహా కేంద్రీకృత యుటిలిటీలు, అన్ని పరిపాలనా కార్యాలయాలు ఒకే కారిడార్‌లో ఉండేలా కాంపాక్ట్ గవర్నమెంట్ జోన్‌తో ఈ నగరం ప్రణాళిక చేశామని తెలిపారు. ఇది పర్యావరణ సుస్థిరత, సమర్థవంతమైన పాలనను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోటీపడేలా విస్తృతమైన రింగ్ రోడ్లు, మౌలిక సదుపాయాల ద్వారా ఈ నగరాన్ని చుట్టుపక్కల పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్