Share News

రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డు!

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:03 AM

సముద్రంలో వేటకు వెళ్లి రెండు బోట్లలో ఒక బోటు క్షేమంగా తిరిగి రాగా, గల్లంతైన మరోబోటులోని మత్స్యకారుల ఆచూకీ కోసం ఇండియన్‌ కోస్ట్‌గార్డు, భారత నౌకాదళం రంగంలోకి దిగింది.

రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డు!

  • గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు

  • సీఎం చంద్రబాబు లేఖతో కేంద్ర సహకారం

  • క్షేమంగా తిరిగొచ్చిన ఏటిమొగ మత్స్యకారులు

కొత్తపల్లి, అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సముద్రంలో వేటకు వెళ్లి రెండు బోట్లలో ఒక బోటు క్షేమంగా తిరిగి రాగా, గల్లంతైన మరోబోటులోని మత్స్యకారుల ఆచూకీ కోసం ఇండియన్‌ కోస్ట్‌గార్డు, భారత నౌకాదళం రంగంలోకి దిగింది. కాకినాడ జిల్లా ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన మత్స్యకారులు గరికిన సింహాద్రి, గంపల ప్రకాశ్‌, తిర్రి నారాయణ, సూరాడ చిన్న, సూరాడ కోదండ, కందాల రాము, మేరుగు నారాయణ ఈ నెల 4న డీప్‌సీలో వేటకు వెళ్లడంఏడుగురు మత్స్యకారులు గల్లంతవడం తెలిసిందే.

వారి ఆచూకీ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మత్స్యశాఖ మంత్రి, హోంమంత్రుల ఆదేశాల మేరకు ఇండియన్‌ కోస్ట్‌గార్డు, ఇండియన్‌ నేవీల పర్యవేక్షణలో బుధవారం కూడా సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగాయి. అయినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈనేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక లేఖ రాయడంతో కేంద్ర సహకారంతో మరింత విస్తృతంగా గాలింపుచర్యలు చేపట్టినట్టు కాకినాడ జిల్లా మత్స్యశాఖ డీడీ కృష్ణారావు బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.

సుబ్బంపేట మత్స్యకారుల బోటు బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాల సముద్ర జలాల వైపు వెళ్లి ఉండే అవకాశం ఉందనే కోణంలో ఆ దేశాల సహకారం కోసం కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్


రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఈ నెల 4న ఎప్పటిలాగే వేటకు వెళ్లారని, తనతో ఆఖరిసారి ఈనెల 18న ఫోన్‌లో మాట్లాడి డీప్‌సీలోకి వెళుతున్నామని తన భర్త సింహాద్రి చెప్పారని భార్య కుమారి తెలిపారు. కాగా, గల్లంతైనవారిలో ఒకరు తప్ప మిగిలిన ఆరుగురు 40 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగినవారే. ఆయా కుటుంబాలకు చెందిన పిల్లలు.. నాన్న ఎప్పుడువస్తారని అమాయకంగా అడిగే ప్రశ్నలకు పెద్దలు మౌనంగా రోదించడం తప్ప ఏమీ చెప్పలేకపోతున్నారు.

ఏటిమొగ మత్స్యకారులు క్షేమం

కాకినాడ జిల్లా ఏటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లి, ఇంజన్‌ వైఫల్యంతో సముద్రంలో నిలిచిపోయిన మత్స్యకారుల బోటు సురక్షితంగా కాకినాడ హార్బర్‌కు చేరుకున్నట్లు మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం తెలిపారు. ఈ బోటులోని డ్రైవర్‌తో సహా ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చారని ఆయన పేర్కొన్నారు. కాగా, గల్లంతైన సుబ్బంపేటకు చెందిన ఏడురుగు మత్స్యకారులనూ క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 05:08 AM