అక్రమ నిర్బంధంతో ఒంటరిని చేయాలని కుట్ర
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:32 AM
సరిగ్గా మూడేళ్ల క్రితం అక్టోబరు 31న 53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాటి 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను.
తెలుగుజాతి తిరుగుబాటుతో ఆ కుట్రలు బద్దలయ్యాయి
నాడు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
53 రోజుల అక్రమ నిర్బంధం, విడుదలపై సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ‘సరిగ్గా మూడేళ్ల క్రితం అక్టోబరు 31న 53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాటి 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను’ అంటూ సీఎం చంద్రబాబు తన అక్రమ నిర్బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. ‘‘వైసీపీ విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని నాటి పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను.
అక్రమ నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు... యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్బంధం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందినవారు స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం.
రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకు... విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు... సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం ‘నిజం గెలవాలి’ అని మీ వద్దకు వస్తే వారితో కలసి అడుగేసి నిజాన్ని గెలిపించారు.
ధర్మాన్ని నిలబెట్టారు. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించి.. మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, నమ్మకం, అభిమానం... నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగుజాతిని నంబర్ 1 చేస్తా’ అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
నాడు ప్రజలు చూపిన ఆత్మీయత, మద్దతుకు జీవితాంతం కృతజ్ఞురాలిని: భువనేశ్వరి
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చంద్రబాబు అక్రమ అరెస్టు, విడుదల ఘటనను గుర్తు చేసుకున్నారు. ఎక్స్‌లో ఆమె పోస్టు చేశారు. ‘నిత్యం ప్రజల కోసం శ్రమించే చంద్రబాబు అక్రమ అరెస్టు ఘటనతోపాటు ఆ కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి ప్రజలు ఇచ్చిన మద్దతు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నాటి పాలకుల అక్రమ నిర్బంధం అనంతరం మూడేళ్ల క్రితం అక్టోబరు 31న చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వచ్చారు.
రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండే నేను ‘నిజం గెలవాలి’ అంటూ చంద్రబాబు అక్రమ అరెస్టుపై మీ వద్దకు వచ్చినప్పుడు నా కష్టాన్ని మీ కష్టంగా భావించి నిజాన్ని గెలిపించారు. ప్రజలు చూపిన ఆత్మీయతకు, మద్దతుకు, నమ్మకానికి జీవితాంతం కృతజ్ఞురాలిని అని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.
నిజం గెలిచిన రోజుని జీవితంలో మర్చిపోలేను: లోకేశ్
‘నిజం గెలిచిన రోజు, న్యాయం జరిగిన రోజు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆనందించిన రోజు...’ అంటూ చంద్రబాబు జైలు నుంచి విడుదలైన రోజును మంత్రి లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో, తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టయిన దార్శనిక నేత చంద్రబాబు... రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రోజు. 53 రోజులపాటు గొడ్డలి పార్టీ కక్ష రాజకీయాలకు జైలులో అక్రమంగా విజనరీ లీడర్‌ను నిర్బంధించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా చంద్రబాబుకి అండగా నిలిచారు. అభిమానుల ప్రార్థనలు, ప్రజల నమ్మకంతో నిర్బంధం నుంచి నిజాయితీకి నిలువెత్తు తెలుగు సంతకం చంద్రబాబు జనం జేజేల మధ్య వచ్చిన ఈ రోజు... అక్టోబరు 31 జీవితంలో మర్చిపోలేని రోజు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
ఎక్స్‌లో ట్రెండింగ్‌లో చంద్రుడి విముక్తికి మూడేళ్లు
అక్రమ కేసుల నుంచి విముక్తి పొంది చంద్రబాబు జైలు నుంచి విడుదలై అక్టోబరు 31కి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక మాఽధ్యమాల్లో ‘చంద్రుడి విముక్తి మూడేళ్లు’ (3 ఇయర్స్ సిన్స్ సీబీఎన్ రిలీజ్డ్) హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!