విపత్తులకు భయపడొద్దు.. ప్రజలకు భరోసా ఇద్దాం
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:04 AM
ముప్పై రోజుల వ్యవధిలో మూడో తుఫాను రాష్ట్రాన్ని తాకుతోంది. విపత్తులు వచ్చాయని భయపడాల్సిన అవసరం లేదు. వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలి.
పునరావాసం.. పునరుద్ధరణ తక్షణ కర్తవ్యాలు
అక్వాన్ తుఫానుపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘ముప్పై రోజుల వ్యవధిలో మూడో తుఫాను రాష్ట్రాన్ని తాకుతోంది. విపత్తులు వచ్చాయని భయపడాల్సిన అవసరం లేదు. వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలి. ఎంతటి పెద్ద విపత్తు సంభవించినా.. తమను ఆదుకోవటానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరోసా ప్రజలకు కల్పించాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. అక్వాన్ తుఫాను ప్రభావంపై మంగళవారం అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ గమనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్వాన్.. తీవ్ర తుఫానుగా మారే ప్రమాదం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు చెప్పారు. తుఫాను కారణంగా ఈ నెల19-20 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపుతూనే ఉండాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలి. చెట్టు కూలినా, విద్యుత్ స్తంభం నేలకొరిగినా వెంటనే క్లియర్ చేయాలి. పునరుద్ధరణ పనులు చేపట్టాలి. రియల్ టైమ్‌లో అంచనాలు వేయాలి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలి. పునరావాసం కల్పించాలి. భారీ వర్షాల కారణంగా చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని సీఎం నిర్దేశించారు.
అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి: అనిత
తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేస్తూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. మంగళవారం విపత్తు నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అక్వాన్ తుఫాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో బలమైన ఈదురుగాలులు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు