Share News

రోబో 4.0!

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:15 AM

నాయకులు వస్తుంటారు, పోతుంటారు. సంక్షోభాలు వచ్చినప్పుడు హేమాహేమీలనుకున్న నేతలు సైతం గుడ్లు తేలేస్తారు. కానీ, చంద్రబాబు సంక్షోభాల్లోను నాయకుడిగా మెరుస్తారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో చంద్రబాబుపై విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి.

రోబో 4.0!

  • ఆ అర్థాన్ని క్రైసిస్‌ మేనేజర్‌గా మార్చిన రోబో 4.0. చంద్రబాబు!

  • 76 ఏళ్ల వయసులోనూ అలుపెరగని చంద్రుడు

  • సంక్షోభమొస్తే పరిష్కరించకుండా విశ్రమించడు

  • రాజకీయంలోనైనా, పరిపాలనలోనైనా ఆయనకు ప్రతి సంక్షోభం ఓ సవాలే

  • అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా..విపత్తులపై యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమే

  • గడ్డు కాలాలను గట్టిగా ఎదురొడ్డిన చరిత్ర

  • ఎల్‌నినో, అర్నబ్‌ వేళ ఆయన పనితీరుకు

  • పక్క రాష్ట్రం నాయకులు సైతం ఫిదా

నాయకులు వస్తుంటారు, పోతుంటారు. సంక్షోభాలు వచ్చినప్పుడు హేమాహేమీలనుకున్న నేతలు సైతం గుడ్లు తేలేస్తారు. కానీ, చంద్రబాబు సంక్షోభాల్లోను నాయకుడిగా మెరుస్తారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో చంద్రబాబుపై విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి. అదే ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు, ప్రత్యర్థులు సైతం ఆయన పనితీరుకు ఫిదా అయిపోతారు. ప్రశంసలతో ముంచెత్తుతారు. సంక్షోభం ఓ పరీక్ష అయితే చంద్రబాబు దానికి సమాధానంగా నిలిచిన సందర్భాలెన్నో. ఎల్‌నినో కమ్మేసిన రాష్ట్రాన్ని ఆయన బయట పడేస్తున్న తీరును, ‘అర్నబ్‌’ను ఎదుర్కొన్న వైనాన్ని పక్క రాష్ట్రాల నేతలు సైతం కొనియాడుతూ ప్రకటనలు ఇస్తున్నారు. సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌.


ఎవ్రీ క్రైసిస్‌ ఈజ్‌ యాన్‌ ఆపర్చునిటీ! ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట తరచూ వినిపించే మాట ఇది. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తొలి నాళ్ల నుంచీ ఆయన పని తీరును పరిశీలిస్తే సంక్షోభం ఎదురైన ప్రతిసారీ, ఆయన నాయకుడిగా ఓ మెట్టు పైకి ఎక్కడం కనిపిస్తుంది. 1980లోకాంగ్రెలో అధిష్ఠానం మాటే శాసనంగా సాగుతున్న రోజుల్లో చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విషయంలో ఆ పార్టీలో తీవ్రస్థాయి పోటీ ఏర్పడింది. అప్పటి వరకు సామాజిక, ఆర్థిక దన్ను ఉన్న నాయకులే జడ్పీ పీఠాన్ని అధిరోహించేవారు. జడ్పీ చైర్మన్‌ ఎంపిక విషయంలో నెలకొన్న సంక్షోభాన్ని నాడు కాంగ్రె్‌సలో యువనాయకుడిగా ఉన్న చంద్రబాబు అవకాశంగా మలుచుకున్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దళిత వైద్యురాలిని జడ్పీ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ క్రమంలో తనపై సస్పెన్షన్‌ వేటు వేసినా, దాన్ని కూడా సవాలుగా తీసుకుని ఢిల్లీలో తన పరపతిని పెంచుకున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే చంద్రబాబులోని ఈ నైజం ఆ తర్వాతి కాలాల్లో మరింత పదునెక్కింది.

సైక్లోన్‌ క్రైసిస్‌ మేనేజర్‌..

తుఫానుల సమయంలో చంద్రబాబు పనితీరుకు మిగిలిన ముఖ్యమంత్రుల పనితీరుకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తుఫాను సమయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 1977 నవంబరులో కృష్ణా జిల్లా దివిసీమను భయంకరమైన ఉప్పెన కకావికలం చేసింది. దివిసీమ కన్నీరు తుడవడానికి ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రబాబు తిరుపతి నుంచి కొందరు యువకుల్ని కూడగట్టుకుని దివిసీమ వచ్చారు. స్థానికుల మన్ననలు పొందేలా సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సవాల్‌ సూపర్‌ సైక్లోన్‌ హరికేన్‌ తుఫాను రూపంలో వచ్చింది. 1996లో తూర్పుగోదావరి జిల్లాను సూపర్‌ సైక్లోన్‌ అతలాకుతలం చేసింది. తుఫాన్‌ వచ్చిన మరుసటి రోజే చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి చేరుకుని, సుమారు 15 రోజులు అక్కడే మకాం వేశారు. హైదరాబాద్‌లోని సచివాలయం మొత్తం రాజమండ్రికి తరలివచ్చింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను చక్కదిద్దడం అదే తొలిసారి.


హుద్‌హుద్‌ సమయంలోనూ చంద్రబాబులోని సైక్లోన్‌ క్రైసిస్‌ మేనేజర్‌ తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. 2014 అక్టోబరులో హుద్‌హుద్‌ తుఫాను తీవ్రస్థాయిలో విశాఖ మీద విరుచుకుపడిందన్న సమాచారం తెలియడంతో కోడలి శ్రీమంతం కార్యక్రమం నుంచి అర్ధంతరంగా బయలుదేరి, అప్పటికప్పుడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. రాత్రి రాజమండ్రిలో బస చేసి మరుసటి రోజు ఉదయాన్నే రోడ్డు మార్గంలో విశాఖ చేరుకుని అక్కడే మకాం వేశారు. ఆగమేఘాలపై విశాఖ పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే విశాఖను సాధారణ స్థాయికి తీసుకువచ్చారు.

ఆ సమయంలో సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ను పునరుద్ధరింప చేసేందుకు ఏకంగా ఎయిర్‌టెల్‌ యజమాని సునీల్‌ మిట్టల్‌ను విశాఖ పిలిపించడం, పశ్చిమ బెంగాల్‌ నుంచి 300 లారీల్లో బంగాళాదుంపలు, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి ఉల్లిపాయలను ఆగమేఘాలపై విశాఖకు తెప్పించడం..వంటివి చంద్రబాబు మార్క్‌ పనితీరుకు అద్దం పడతాయి. తుఫాను అనంతరం ఆయన విద్యుత్తు స్తంభాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఆయనను విజనరీ అని ఎందుకంటారో చెబుతుంది. విశాఖను భవిష్యత్తులో తుఫానులు అతలాకుతలం చేసినా విద్యుత్తు స్తంభాలు నేలకొరగడం.. వైర్లు తెగి మరణాలు సంభవించడం వంటివి జరగకుండా విశాఖలో భూగర్భ విద్యుత్తు కేబుల్‌ వ్యవస్థను తీసుకొచ్చారు.


2015లో తితిలీ తుఫాను శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. అప్పుడూ చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని చక్కదిద్దారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు ముంచెత్తినప్పుడూ చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని కుదుటపర్చారు.

తాజాగా ఆర్నబ్‌ తుఫాను గోదావరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. తుఫాను తీరాన్ని తాకడానికి నాలుగు రోజుల ముందు నుంచే చంద్రబాబు తుఫాను సహాయక చర్యలపై దృష్టి సారించారు. రోజంతా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, వారిని కార్యోన్ముఖులను చేశారు. తుఫాను తీరాన్ని దాటిన తర్వాత ఆగమేఘాలపై క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులకు ‘నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అంతా తానై..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి సంక్షోభం 1984 ఆగస్టులో చోటుచేసుకుంది. 1984 ఆగస్టు 16న కుట్రపూరితంగా ఎన్టీఆర్‌ను గద్దె దించి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల బలం ఎన్టీఆర్‌కు ఉన్నా ఆయన సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిణామం టీడీపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి శిబిరం వైపు వెళ్లకుండా కాపాడుకోవడంతోపాటు రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ పేరుతో ఉద్యమాలు నిర్వహించడం ద్వారా నెలరోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.


పార్టీ కనుమరుగవుతున్న వేళ..

1995 ఆగస్టులో టీడీపీలో అంతర్గత సంక్షోభం నెలకొంది. ఎన్టీఆర్‌ సహాయకురాలిగా ప్రవేశించిన లక్ష్మీపార్వతి చివరికి ఆయన భార్యగా పార్టీని శాసిస్తున్నారు. సీనియర్‌ నాయకులంతా తీవ్ర అవమానాలకు గురవుతూ, పార్టీని వీడిపోతున్న పరిస్థితి. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో, అధికశాతం ఎమ్మెల్యేలు లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా గళం విప్పారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ మనుగడకే ప్రమాదమని భావించిన చంద్రబాబు, పార్టీని బతికించుకునేందుకు నడుం బిగించారు. టీడీపీ పగ్గాలను చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2004-14 మధ్య వరుసగా రెండు సార్లు ఓడిపోయి, పార్టీ ఇబ్బందుల్లోపడిన సందర్భంలోనూ, గట్టిగా నిలబెట్టి.. 2014లో తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారు. 2019-24 నడుమ టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ ఎదుర్కోని విధంగా నిర్బంధాన్ని ఎదుర్కొంది. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిన వచ్చింది. ఇక టీడీపీ కనుమరుగు ఖాయమని భావించిన వాళ్ల నోళ్లు మూతపడేలా 2024లో మెజార్టీల రికార్డులన్నీ చెరిపేస్తూ, అధికారపీఠాన్ని అధిష్ఠించారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా..

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విపత్తు వచ్చిదంటే చంద్రబాబు ముందుంటారు. 2011లో ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి, వరదలు ముంచెత్తినప్పుడు అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారిని రక్షించేందుకు చంద్రబాబు ముందుకొచ్చారు. ఆ సమయంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నా వెనుకంజ వేయలేదు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి సుమారు 300 మంది తెలుగువారిని స్వస్థలాలకు తరలించారు. ప్రతిపక్ష పార్టీ ఇలా స్పందించడం దేశ చరిత్రలోనే అది మొదటి సారి. 2019లో కర్నూలును తుంగభద్ర ముంచెత్తి బీభత్సం సృష్టించినప్పుడూ చంద్రబాబు ప్రతిపక్షంలోనే ఉన్నారు. అయినా పార్టీ శ్రేణులందరినీ రంగంలోకి దింపి సుమారు రూ.5 కోట్ల వరదసాయాన్ని బాధితులకు అందించారు.

రాజధాని లేని రాష్ట్రంగా మిగిలినా..

2014లో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. అప్పులు, విద్యుత్తు కొరత రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. వాటినీ సవాలుగా తీసుకుని చంద్రబాబు ముందుకు నడిచారు. హైదరాబాద్‌కు మిన్నగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే విద్యుత్తు కొరతల నుంచి మిగులు దిశగా రాష్ట్రాన్ని నడిపారు. అమరావతిని ప్రపంచంలోనే ఓ అత్యున్నత జీవన ప్రమాణాలు కల నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు దృష్టిలో అమరావతి కేవలం భవనాల సముదాయం కాదు.. ఓ లివింగ్‌ ల్యాబోరేటరీ.


శత్రువులైనా శెభాష్‌ అనాల్సిందే..

సంక్షోభాలకు కొత్త పాఠాలు నేర్పగల నాయకుడు చంద్రబాబు. కరువు సీమలో ఉద్యానవన పంటలను పండించడమే కాదు, గోదావరిని పట్టిసీమ ద్వారా కృష్ణా తీరానికి ఉరుకులు పెట్టించగల సామర్థ్యం చంద్రబాబు సొంతం. సాధారణ సమయాల్లో చంద్రబాబుపై నిప్పులు చెరిగే ప్రత్యర్థులు సైతం, సంక్షోభాల సమయంలో ఆయన పనితీరు చూసి ప్రశంసించక తప్పని పరిస్థితి. కరోనా సమయంలో చంద్రబాబు అంటే అసలు గిట్టని సీనియర్‌ పాత్రికేయులు కూడా.. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఉంటే బాగుండేదని చెప్పడమే ఆయన క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌కు గీటురాయి. చంద్రబాబు పేరు చెబితే అగ్గిమీద గుగ్గిలమయ్యే బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ సైతం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఏపీలో తెలంగాణ కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. అయినా నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడా పంటలు ఎండిపోకుండా.. క్రాప్‌ హాలిడే లేకుండా చంద్రబాబు చూసుకున్నారంటూ ఇటీవల హరీశ్‌రావు, కేటీఆర్‌ అన్నారు. ఏపీలో కరువులు.. క్రాప్‌ హాలిడేలు లేవని.. దీనికి చంద్రబాబు పనితీరే కారణమని ప్రశంసించడం విశేషం.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 04:15 AM