ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ABN , Publish Date - Feb 10 , 2026 | 06:00 PM
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం సమావేశమై పలు కీలక అంశాలపై హామీ తీసుకున్నారు.
ఢిల్లీ, ఫిబ్రవరి 10: ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. PM-PRANAM పథకం కింద ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్‌ను విస్తరించడానికి నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.216 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు విన్నవించారు.

వీటికి.. చేయూతనివ్వండి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి సాగు అభివృద్ధి చేయడానికి రూ.200 కోట్ల మేర సాయం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు అధునాతన పద్ధతులపై శిక్షణ, నర్సరీల విస్తరణకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీలో మఖానా డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉందని, అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం.. కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

అన్నింటికీ అండగా ఉంటాం: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10 శాతం ఉందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో జీడిపప్పు, కాఫీ, కోకో, కొబ్బరి ఎక్కువగా పండుతోందని, రైతులకు మద్దతు ధర దక్కేలా చూస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ పాత్ర కీలకమన్నారు. ఏపీ వ్యవసాయాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందు కోసం కేంద్రం ప్రత్యేక బృందాన్ని నియమించిందని చెప్పారు. కేంద్ర పథకాలు, సాంకేతికత విషయంలో ఏపీకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మత్స్యరంగం, పశుపోషణ అభివృద్ధికి సాయం చేస్తున్నట్టు చెప్పారు. సేంద్రియ సాగు, పామాయిల్ ఉత్పత్తిలో ఏపీ బాగా పనిచేస్తోందన్నారు. సేంద్రియ సాగు విస్తరణకు అన్ని విధాలుగా సాయం చేస్తామని కేంద్రమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చారు. అనంతరం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన సమావేశ వివరాల్ని సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్'ఖాతాలో ఫొటోలతో సహా వెల్లడించారు.

ఈ వార్తలూ చదవండి:
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్