ఎల్‌నినో.. సవాల్!
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:44 AM
ఎల్‌నినో విపత్తు కాలంలో.. రైతులను ఆదుకోవడం, ఎక్కడా తాగునీటికి సమస్య లేకుండా చూడడం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఎల్‌నినో విపత్తును సవాల్‌గా స్వీకరించాలన్నారు.
రైతుల మీదే కాదు.. అన్ని వ్యవస్థలపైనా ప్రభావం: సీఎం
అన్నదాతలను కాపాడాలి
అదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరగకుండా చూడాలి
బియ్యం నిల్వలను మార్కెట్లోకి వదలాలి
ఉల్లి సాగును ప్రోత్సహించాలి
హైరిస్క్ ఉద్యాన పంటలకు 190 కోట్లు
డిమాండ్ ఆధారిత పంటల సాగుపై దృష్టి
ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించాలి
అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి
స్థానిక ఎన్నికలున్నా.. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించాలి.. సీఎం నిర్దేశం
కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో విపత్తు కాలంలో.. రైతులను ఆదుకోవడం, ఎక్కడా తాగునీటికి సమస్య లేకుండా చూడడం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఎల్‌నినో విపత్తును సవాల్‌గా స్వీకరించాలన్నారు. ప్రజాప్రతినిధులు, యంత్రాంగం, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, సాగునీటి సంఘాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం కేవలం రైతుల మీదే కాదు.. అన్ని వ్యవస్థలపైనా పడుతోందన్నారు. దాని బారి నుంచి రైతులను కాపాడే ప్రయత్నం చేస్తూనే.. నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, దానిని ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ అమలుపై ఆదివారం ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు, రైతుసేవా కేంద్రం సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో పరిస్థితులపై ముందుగానే వేసుకున్న అంచనాకు అనుగుణంగా సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాలని స్పష్టంచేశారు. బియ్యం, కందిపప్పు, ఉల్లి, పామాయిల్ వంటి నిత్యావసరాల ధరలను నియంత్రించాలన్నారు. ‘గోడౌన్లలో బియ్యం నిల్వలు పరిశీలించాలి.
ధరలను అదుపులో ఉంచేందుకు బియ్యం నిల్వలను మార్కెట్లోకి వదలాలి. ఉల్లి ధరల నియంత్రణకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. రానున్న కాలంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలి. పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టేలా ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను త్వరతగతిన అమలు చేయాలి. కిచెన్ గార్డెన్లలో కూరగాయలు పండించేలా డ్వాక్రా బృందాలను ప్రోత్సహించాలి. కిచెన్ గార్డెన్లను వ్యవస్థీకృతం చేయగలిగితే కూరగాయల ధరలు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తోంది. దీనిపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి’ అని సూచించారు. స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఎక్కువగా పర్యటించి, రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
కంటింజెన్సీ ప్లాన్ అమలు చేయాలి
ఖరీఫ్ కంటింజెన్సీ ప్లాన్ కోసం 60 కోట్లు సిద్ధం చేసుకున్నాం. ఆ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేయాలి. 5.21 లక్షల హెక్టార్ల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు పచ్చిరొట్ట ఎరువులు సరఫరా చేశాం. 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80శాతం సబ్సిడీతో ఇచ్చాం. ప్రతి ఒక్కరికీ తాగునీటిని అందించాలి. పశుసంపదకూ నీరివ్వడంతో పాటు పశుగ్రాసమూ అందేలా చూడాలి. ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ.190కోట్లు కేటాయించాం. ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. పశుగ్రాసం పెంచడం, మల్చింగ్ కోసం విత్తనాలు జల్లడం వంటివి చేయాలి. పచ్చదనం తగ్గకుండా చర్యలు తీసుకోవాలి. వీబీజీరామ్‌జీ పనులను అనుసంధానం చేసుకుంటూ, జలధార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలి.
50.7 శాతం లోటు..
రాష్ట్రవ్యాప్తంగా 50.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అత్యధిక లోటు కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో 30.84లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఎల్‌నినో కారణంగా 79శాతం భూముల్లోనే సాగు జరుగుతోంది. పప్పుధాన్యాల సాగు మెరుగ్గా ఉన్నా.. నూనెగింజల సాగు తక్కువగా ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని పంటలపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో కరువు ప్రాంతాలకు నీటిని పంపుతున్నాం. హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకూ నీరందించాం. ఇప్పుడు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
వర్షాలను సద్వినియోగం చేసుకోవాలి
కొన్నిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. వర్షాభావ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. వర్షాభావ పంటల సాగుతో ప్రయోజనాలను వివరించాలి. సంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిరప సాగు చేపట్టాలి. డిమాండ్‌కు అనుగుణంగా వివిధ పంటలు సాగుపై ఫోకస్ పెట్టాలి. ఖరీఫ్‌లో పంటల బీమా చేయించాం. పంట నష్టం సంభవిస్తే.. బీమా మొత్తం రైతులకు దక్కేలా చూడాలి.
ఈ వార్తలనూ చదవండి..