2,100 కోట్ల రీయింబర్స్‌మెంట్ కోసమే
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:50 AM
‘సివిల్ సప్లయిస్‌లో కమీషన్ల దందా’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ప్రత్యేక కథనంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ చైౖర్మన్, ఎండీ కన్నబాబు స్పందించారు.
పెండింగ్ బిల్లుల అప్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై సివిల్ సప్లయిస్ కమిషనర్ వివరణ
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘సివిల్ సప్లయిస్‌లో కమీషన్ల దందా’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ప్రత్యేక కథనంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ చైౖర్మన్, ఎండీ కన్నబాబు స్పందించారు. ‘ఆహార సబ్సిడీ, ధాన్యం సేకరణ కార్యకలాపాల వ్యయాల కింద కేంద్రం నుంచి సుమారు రూ.2,100 కోట్ల మేర నిధులు రాష్ట్రానికి రీయింబర్స్‌మెంట్ రూపంలో రావాల్సి ఉంది.
ఈ మొత్తాన్ని పొందాలంటే ధాన్యం సేకరణ, మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీ, రవాణా, ఇతర అనుబంధ ఖర్చులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను సమన్వయం చేసి, తుది లెక్కలను సిద్ధం చేసి, ఆడిట్ ప్రక్రియను పూర్తిచేసి సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి రావాల్సిన రీయింబర్స్‌మెంట్లను పొందేందుకే 2021-22 నుంచి 2025-26 వరకు ధాన్యం సేకరణ, మిల్లింగ్, సీఎంఆర్ కార్యకలాపాలకు సంబంధించి మిల్లర్లకు చెల్లించాల్సిన వివిధ రకాల పెండింగ్ బిల్లుల పరిశీలన, అప్‌లోడింగ్ పక్రియను వేగవంతం చేశాం. పౌరసరఫరాల సంస్థలో ఏ ఒక్క అధికారి స్వతంత్రంగా, ఏకపక్షంగా బిల్లులను ఆమోదించి, చెల్లించే అవకాశం లేదు.
ప్రతి బిల్లు, సంబంధిత రికార్డులు, క్షేత్రస్థాయి నివేదికలు, నిర్దేశిత విధానాల ప్రకారం పలు స్థాయుల్లో పరిశీలించిన అనంతరం ఆమోద ప్రక్రియ పూర్తయిన తర్వాతే అర్హులకు చెల్లింపులు జరుగుతాయి’ అని కన్నబాబు వివరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో కమీషన్లు డిమాండ్ చేస్తున్నారనే అరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి