భూకేటాయింపులు.. ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:35 AM
రాష్ట్రంలో వివిధ పరిశ్రమలకు భూకేటాయింపులు, ప్రత్యేక ప్రోత్సాహకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఖరీఫ్ వరి ధాన్య సేకరణ కోసం మార్క్‌ఫెడ్‌కు రుణం కోసం ప్రభుత్వ గ్యారెంటీని పొడిగించడానికి అనుమతి ఇచ్చింది.
వివిధ సంస్థలకు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
అమరావతి క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీ పార్కుకు పల్నాడు జిల్లాలో
250 ఎకరాల భూ సేకరణ
అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ పరిశ్రమలకు భూకేటాయింపులు, ప్రత్యేక ప్రోత్సాహకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఖరీఫ్ వరి ధాన్య సేకరణ కోసం మార్క్‌ఫెడ్‌కు రుణం కోసం ప్రభుత్వ గ్యారెంటీని పొడిగించడానికి అనుమతి ఇచ్చింది. ఎన్డీటీపీఎస్, ఆర్టీపీపీలో యూనిట్లను నడపడానికి 3 లక్షల టన్నుల బొగ్గు దిగుమతికి అంగీకారం తెలిపింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో మంత్రివర్గ సమావేశం జరిగింది.
మంత్రులు వర్చువల్‌గా పాల్గొనగా, అధికారులు నేరుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపి, పలు సంస్థలకు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. అర్హత కలిగిన పలు ప్రాజెక్టులకు ‘ఎర్లీ బర్డ్’ ప్రోత్సాహక పథకం కింద మూలధన రాయితీలు అందించాలని నిర్ణయించింది.
కీలక నిర్ణయాలివీ..
గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) నుంచి ఏపీ పవర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఇప్పటికే పొందిన రూ.500 కోట్లు, రూ.1,000 కోట్ల మధ్యకాలిక రుణాలకు కార్పొరేట్ గ్యారెంటీల జారీకి ఏపీ జెన్‌కో ఎండీకి అనుమతి.
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీ పార్క్ ఏర్పాటుకు పల్నాడు జిల్లా పరిధిలో 250 ఎకరాల భూ సేకరణకు ఆమోదం.
రాజధాని అమరావతిలోని ప్రభుత్వ భవన సముదాయంలో సచివాలయం, హెచ్‌వోడీలకు చెందిన 1,2 టవర్లలో ఎలక్ర్టిక్, ఫైర్, ఫ్లంబింగ్ వంటి పనులను రూ.768.89 కోట్లు, జీఏడీ టవర్‌లో పనులకు రూ.429.83 కోట్లు, 3,4 టవర్లలో పనులకు రూ.679.19 కోట్లు ఏక మొత్త టెండర్ పద్ధతిలో ఆమోదించిన బిడ్డర్లకు పనులు అప్పగించడానికి ఎల్‌వోసీ జారీకి సీఆర్‌డీఏకి అనుమతి.
విశాఖ జిల్లా అడవివరం, ముడసర్లోవలోని 5.84 ఎకరాల జీవీఎంసీ భూమిని.. ఎస్‌ఆర్వో విలువపై 3శాతం చొప్పున, ప్రతి ఐదేళ్లకోసారి 5శాతం పెంపుతో అదానీ ఇన్‌ఫ్రాకు చెందిన వైజాగ్ హైపర్ స్కిల్ డేటా సెంటర్‌కు ప్రత్యేక కేసుగా లీజుకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం.
రూ.3700 కోట్ల పెట్టుబడితో, 1200 మందికి ఉపాధి కల్పించేలా 5 గిగావాట్ల సమీకృత సిలికాన్ క్రిస్టల్ వేఫర్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రెనైసెన్స్ సోలార్, ఎలక్ర్టానిక్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 91.10 ఎకరాలు కేటాయింపు.
కడప జిల్లా ఎస్.ఉప్పలపాడులో శ్రీ సిమెంట్ లిమిటెడ్‌కు 452 ఎకరాలు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడులో అందుబాటులో ఉన్న 41,855 ఎకరాల భూమి జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్‌కు కేటాయింపు. మీదివేముల గ్రామంలో జాక్సన్ సోలార్ ఇంటిగ్రేటెడ్ లిమిటెడ్‌కు 290 ఎకరాలు కేటాయింపు.
నెల్లూరు జిల్లా అల్లంపాడులో సన్‌షైన్ ఎనర్జెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 455.91 ఎకరాలు కేటాయింపు. దుత్తలూరు మండలంలో రూ.269.25 కోట్ల పెట్టుబడితో ఎనర్జిటిక్ మెటీరియల్స్, కమర్షియల్ ఎక్స్‌ప్లోజివ్స్, ఎక్స్‌ప్లోజివ్ ఫిల్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటుకు మునీష్ డిఫెన్స్ సొల్యూషన్స్‌కు 250 ఎకరాలు కేటాయింపు. ఆదిత్య ప్రెసిటిక్ లిమిటెడ్‌కు 300 ఎకరాలు.
ప్రకాశం జిల్లా టంగుటూరులో మత్స్యకార బాలికల శాశ్వత పాఠశాల, వసతి గృహ నిర్మాణం కోసం సోమరాజుపల్లిలో 5 ఎకరాలు ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శికి ఉచితంగా బదిలీ చేయడానికి అనుమతి.
ఏపీఐఐసీకి కర్నూలు జిల్లా కంబాలపాడులో 200 ఎకరాలు, అన్నమయ్య జిల్లా శిబ్యాల గ్రామంలో 50 ఎకరాలు, చిత్తూరు జిల్లా పోతుకనుమలో 46.22 ఎకరాలు, నెల్లూరు జిల్లా వడ్లపూడిలో 29.94 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. చిత్తూరు జిల్లా వసనాడు గొల్లపల్లిలో 6.12 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు ఆమోదం.
అనంతపురం జిల్లాలో 265 ఎకరాల ప్రభుత్వ భూమిని కమలపాడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీజెన్‌కోకు కేటాయింపు.
తిరుపతిలో రూ.55 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన టీచ్‌మింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూ కేటాయింపునకు ఆమోదం.
విజయనగరం జిల్లా శ్రీరామపురంలో రూ.5,194 కోట్ల పెట్టుబడితో 3 వేల మందికి ఉపాధి కల్పించేలా ఎంపీటీఏ స్పెషాలిటీ గ్రీన్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు.
రామ్‌కో సిమెంట్స్‌కు వాణిజ్య ఉత్పత్తి కాలపరిమితి సవరణకు సంబంధించి జారీ అయిన జీవో 7 ప్రకారం పెరిగిన ప్రోత్సాహకాలకు అనుమతి.
అప్పికొండలోని ఫ్యూర్ సస్టెయిన్‌కు పారిశ్రామిక పార్కుకు ప్రోత్సాహాకాలు, మద్దతుకు ఆమోదం.
ఓర్వకల్లులో రూ.2,606 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించే ప్యాకేజ్డ్ కార్బోనైట్రైడ్ పానియాలు, జ్యూస్‌లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
కాకినాడలో లాలా ల్యాండ్ వాటర్, అమ్యూజ్‌మెంట్ పార్కు అభివృద్ధికి ‘మన్ ప్రకృతి గ్రూప్స్’కు ప్రోత్సాహకాలు.
అనంతపురంలో 4స్టార్ హోటల్ అభివృద్ధికి ‘స్కై రిట్రీట్స్’కు ప్రోత్సాహకాలు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 1,222.6 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ‘సబ్‌స్ర్టేట్ క్యాపిటల్’సంస్థకు భూ కేటాయింపు, ప్రత్యేక ప్రోత్సాహకాలు.
కృష్ణా జిల్లా విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం, చాట్రాయి, నూజివీడు మండలాల్లో 50వేల ఎకరాలకు సాగునీటి కోసం కోటపాడు లిఫ్ట్, చనుబండ, విస్సన్నపేట మూడు దశల లిఫ్టుల పంప్‌హౌస్, ప్రధాన కాలువ నిర్మాణ పనుల కొనసాగింపునకు రూ.698.90 కోట్ల అంచనాతో మేఘా ఇంజనీరింగ్‌కు పనులు అప్పగింత.
అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలో కమ్యూనిటీ లిఫ్ట్ కం డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొనసాగింపు పనులు కూడా మేఘాకే అప్పగించడానికి ఆమోదం.
చిత్తూరు జిల్లా కలియంబాక్కంలో ఐరా బయో ఎనర్జీకి 12 టీపీడీ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు.
కర్నూలు జిల్లా కడివెల్ల సమీపంలో 500 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు విండోరా ఎనర్జీకి ఎకరా రూ.31 వేల లీజుతో ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంపుతో భూమి కేటాయింపు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు