Share News

చిన్న పరిశ్రమలకు అండ

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:21 AM

రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. వాటి అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఏపీ ఎంఎస్ఎంఈ రైట్‌ టు బిజినెస్...

చిన్న పరిశ్రమలకు అండ

  • ఎంఎస్ఎంఈలకు అనుమతులు సులభతరం.. వ్యాపార హక్కు బిల్లు-2026కు ఓకే

  • క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు.. చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా భేటీ

  • 30 అంశాల అజెండాకు ఆమోదం.. సీఐఐ సదస్సు ఒప్పందాల్లో ఆరింటికి అనుమతి

  • 36 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌.. భూములు, ప్రోత్సాహకాలకు ఆమోదం

  • రాజధానిలోని పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.1,215 కోట్లు

  • ‘అమరావతి సంగమం’కు రూ.626 కోట్లు కేటాయింపు

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. వాటి అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఏపీ ఎంఎస్ఎంఈ రైట్‌ టు బిజినెస్(వ్యాపార హక్కు) బిల్లు-2026ను ప్రవేశపెట్టడానికి క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై నియంత్రణ భారాన్ని తగ్గించి, వ్యాపారాలకు ముందస్తు అనుమతులను సులభతరం చేసి, సాధారణ తనిఖీల నుంచి రక్షణ కల్పించి, వేగవంతంగా వ్యాపారాల విస్తరణకు, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపర్చడానికి వీలుగా ఈ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది.

శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే 30 అంశాల అజెండాకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖలో ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) చేసిన పలు సిఫారసులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.


శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 19 వేల కోట్లు) పెట్టుబడితో ‘కియా ఇండియా’ ఆటోమొబైల్‌ ప్లాంట్‌-2 ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇంజన్‌, ట్రాన్స్‌మిషన్‌ తయారీతో పాటు ప్లాంట్‌-2 ఇంటిగ్రేటెడ్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ ఏర్పాటుకు కియా ఇండియా రూ. 15,200 కోట్లు, విక్రేతల ద్వారా రూ. 3,800 కోట్ల పెట్టుబడితో 12 వేల మందికి ఉపాధి కల్పించే ఒప్పందాన్నిఆమోదించింది.

క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు

  • శ్రీకాకుళం జిల్లాలో రూ. 13,667 కోట్ల పెట్టుబడితో 765 మందికి ఉపాధి కల్పించే ఇంటిగ్రేటెడ్‌ టైటానియం కాంప్లెక్స్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌.

  • అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ. 1,800 కోట్ల పెట్టుబడితో 1,200 టీపీడీ ఫ్లోట్‌ గ్లాస్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు.

  • చిత్తూరు జిల్లాలో 13.33 ఎకరాల్లో వస్త్ర తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతి.

  • అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీఎస్ఈజెడ్‌లో ప్యాసింజర్‌ కార్‌ రేడియల్‌ టైర్ల తయారీ ప్రాజెక్ట్‌ విస్తరణకు ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • ఏపీ ఇండస్ర్టియల్‌ కారిడార్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ భూ కేటాయింపు విధానం, భూ ధరల విధానం ప్రతిపాదనకు ఆమోదం.

  • శ్రీకాకుళం జిల్లా మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్‌ కెమికల్‌ పార్కుకు ప్రత్యేక ప్రోత్సాహాకాల ప్యాకేజీ విస్తరణ.

  • విశాఖ జిల్లా గుర్రంపాలెంలో అవంతి వేర్‌హౌసింగ్‌ సర్వీసెస్‌కు ఎకరా రూ. 88 లక్షల చొప్పున 30 ఎకరాలు అదనంగా కేటాయింపు.

  • శ్రీ సత్యసాయి జిల్లా కొండూరులో మెస్సర్స్‌ ఫ్లయింగ్‌ వెడ్జ్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌కు 86 ఎకరాల కేటాయింపు.


  • చిత్తూరు జిల్లా మొగిలి గ్రామంలో న్యూట్రిక్రీమ్స్‌ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • ఏపీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీని కార్యాచరణలోకి తీసుకురావటానికి 5 పోస్టుల కేటాయింపు.

  • మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ క్లౌడ్‌ సేవలు అందించడానికి ఆల్వీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌కు రూ. 13.96 కోట్లు, గూగుల్‌ క్లౌడ్‌ ఫ్లాట్‌ఫాం సేవలు అందించడానికి పారాడైమ్‌ ఐటీ టెక్నాలజీ సర్వీసెస్‌కు 13.96 కోట్లు ఒప్పందం ప్రకారం చెల్లించేందుకు అనుమతి.

  • అనంతపురం జిల్లాలోని 13 మండలాల్లో 9,917 ఎకరాల బంజరు భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఆమోదం.

  • ఏపీ పెట్టుబడుల రక్షణ చట్టం-2026 స్థితిపై పరిశ్రమలశాఖ ప్రతిపాదిత నోట్‌ సమీక్ష

అమరావతిలో అభివృద్ధి పనులకు నిధులు

  • రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమం కింద ప్రపంచబ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నిధులతో గ్రీన్‌ వర్క్స్‌ ప్యాకేజీ-2 కింద రూ. 180.68 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం. అమరావతిలో కాలువ వెంబడి బఫర్‌, గ్రావిటీ కాలువల వెంబడి ల్యాండ్‌ స్కేప్‌, శాఖమూరులో పబ్లిక్‌ పార్కు, ఉద్దండరాయునిపాలెంలో అమరావతి మెమోరియల్‌ పార్కు అభివృద్ధి చేయనున్నారు.

  • అమరావతిలో హైకోర్టు భవనానికి అంతర్గత ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి ఎల్‌1 బిడ్డర్‌కు పనులు అప్పగించడానికి అనుమతి. అసెంబ్లీ భవనంలో రూ. 353 కోట్ల అంచనాతో వివిధ అభివృద్ధి పనులను ఆమోదం.

  • అమరావతిలో సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయం రూ. 4,688 కోట్ల నుంచి రూ. 6,641 కోట్లకు పెంపునకు అనుమతి.

  • రాజధానిలోని అన్ని గ్రామ పంచాయతీలలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 1,215 కోట్లతో పనులకు ఆమోదం. రెండేళ్లలో పనుల పూర్తి బాధ్యతలతో ఎల్‌1 బిడ్డర్‌కు ఎల్‌వోఏ జారీ.

  • రాజధానిలోని శాఖమూరులో అమరావతి సంగమం పేరుతో రూ. 626 కోట్లతో రాష్ట్ర పబ్లిక్‌ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గుడ్‌ గవర్నెన్స్‌ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం.


విద్యుత్‌ సంస్థలకు అనుమతులు

  • కోల్‌ ఇండియా లిమిటెడ్‌తో 50 శాతం ఈక్విటీ వాటాతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు జెన్‌కోకు అనుమతి.

  • నంద్యాల జిల్లా బేతంచర్ల, డోన్‌ మండలాల్లో 210 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టును ఎకోరెన్‌ ఎనర్జీఇండియా నుంచి జెంటారి రెన్యూవబుల్స్‌ ఇండియా కాస్టర్‌ వన్‌కు బదిలీ.

  • ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు.

  • పునరుత్పాదక ఇంధనం, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల అమలును సులభతరం చేయడానికి ఏపీఎన్‌జీఈఎల్‌, హరిత్‌ అమృత్‌ పేరుతో ఉన్న కంపెనీలో ఎన్‌జీఈఎల్‌, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ మధ్య వాటాను 50:50 నుంచి 51:49కు మార్చడానికి అనుమతి.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 03:29 AM