‘ఈవెనింగ్ కోర్టు’లపై ముందుకెళ్లొద్దు
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:00 AM
ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనపై ముందుకెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ బార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం తీర్మానం చేసింది.
కేంద్రాన్ని కోరుతూ ఏపీ బార్ కౌన్సిల్ తీర్మానం
అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనపై ముందుకెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ బార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం తీర్మానం చేసింది. ‘పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడం, కేసుల పెండెన్సీని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నప్పటికీ ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటుతోనే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. పైగా న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టుకు హాజరైన న్యాయవాదులు... సాయంత్రం కూడా సమర్థంగా విధులు నిర్వర్తించడం కష్టతరమవుతుంది. మహిళా న్యాయవాదులకు రాత్రి సమయాల్లో ప్రయాణించడం ఇబ్బందికరంగా ఉంటుంది.
ఈవెనింగ్ కోర్టులు ఏర్పాటు చేయడానికి బదులు ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పోస్టులను సకాలంలో భర్తీ చేయడం, కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి తగినంత మంది సిబ్బందిని నియమించేం దుకు చర్యలు తీసుకోండి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేం దుకు మరిన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి. కేసులు వేగంగా పరిష్కారానికి బార్ కౌన్సిల్ పూర్తి సహకారం అందిస్తుంది. ఈ సిఫారసుల ను పరిగణనలోకి తీసుకోకుండా ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనపై ముందుకెళ్లవద్దు’ అని బార్ కౌన్సిల్ కోరింది. మరోవైపు శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో బార్ కౌన్సిల్‌కు సంబంధించి కార్యనిర్వాహక, ఎన్‌రోల్‌మెంట్, శాసన, ఆర్థిక, క్రమశిక్షణ కమిటీలతో పాటు వివిధ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత శనివారం ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం