Share News

91 వేలకోట్ల పెట్టుబడి..లక్ష ఉద్యోగాలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:19 AM

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ ముందుకొచ్చింది.

91 వేలకోట్ల పెట్టుబడి..లక్ష ఉద్యోగాలు

  • ముందుకొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌

  • విశాఖ, రాయలసీమలో డిజిటల్‌ ఇన్‌ఫ్రా ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ పార్కుల ఏర్పాటు

  • దావో్‌సలో ఏపీ సర్కారు, ఆర్‌ఎంజెడ్‌ ప్రకటన

  • సదస్సులో సీఎం చంద్రబాబు కీలక భేటీలు

  • ఐబీఎం చైర్మన్‌ అర్వింద్‌ కృష్ణతో సమావేశం

  • క్వాంటమ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు వినతి

  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ ఓకే

  • ఆ దేశ ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి భేటీ

  • గూగుల్‌ క్లౌడ్‌ సీఈవోతోనూ సమావేశం

  • విశాఖలో ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణంపై చర్చ

  • రామ్మోహన్‌ నాయుడు, లోకేశ్‌, భరత్‌ హాజరు

అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ ముందుకొచ్చింది. దావోస్‌ ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌ఎంజెడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాయి. డిజిటల్‌ ఇన్‌ఫ్రా, ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ పార్కుల ఏర్పాటుకు ఆర్‌ఎంజెడ్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్‌ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం చంద్రబాబుతో ఐబీఎం చైర్మన్‌, సీఈవో అర్వింద్‌ కృష్ణ సమావేశమయ్యారు. అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో క్వాంటమ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ నెలకొల్పాలని ఈ సందర్భంగా ఐబీఎం చైర్మన్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో పది లక్షల మంది యువతకు ఐబీఎం శిక్షణ ఇవ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కోరారు. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువతకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా అర్వింద్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని ఈ సందర్భంగా కురియన్‌కు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేశ్‌, టీజీ భరత్‌ పాల్గొన్నారు.


ఆర్‌ఎంజెడ్‌ భారీ పెట్టుబడులు

  • విశాఖ, ఉమ్మడి అనంతపురం జిల్లా టేకులోడులో ప్రఖ్యాత రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ భవిష్యత్‌ తరం డిజిటల్‌ ఇన్‌ఫ్రా, ఇండస్ట్రియల్‌, ఇన్‌ఫ్రా, లాజిస్టిక్స్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మంత్రి లోకేశ్‌, ఆర్‌ఎంజెడ్‌ చైర్మన్‌ సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ఆర్‌ఎంజే సంస్థ 10 బిలియన్‌ డాలర్ల (రూ.91 వేలకోట్లు) పెట్టుబడితో, లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రతిపాదనలు చేసింది. వీటికి సూత్రప్రాయంగా అంగీకరించారు.

  • విశాఖ కాపులుప్పాడలోని ఫేజ్‌-1 ఐటీ పార్కులో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) పార్కు అభివృద్ధి చేయాలని ఆర్‌ఎంజెడ్‌ ప్రతిపాదించింది. పది మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని పేర్కొంది.

  • విశాఖపట్నం రీజియన్‌ పరిధిలో ఒక గిగావాట్‌ సామర్థ్యంతో హైపర్‌ స్కేల్‌ డేటా క్లస్టర్‌ను 500 నుంచి 700 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని ఆర్‌ఎంజెడ్‌ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు డిజిటల్‌, ఏఐ వర్క్‌లోడ్‌కు సహకరిస్తుంది. హరిత విద్యుత్తు వినియోగంతో ఈ డేటా క్లస్టర్‌ను నడుపుతామని వెల్లడించింది.

  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో టేకులోడు ఇండస్ట్రియల్‌ పార్కులో 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ పార్కును స్థాపిస్తామని ఆర్‌ఎంజెడ్‌ వెల్లడించింది. ఈ పార్కులో ఇండస్ట్రియల్‌ యాంకరింగ్‌, తయారీ పరిశ్రమ, వేర్‌ హౌసింగ్‌, లాజిస్టిక్స్‌ వ్యవహారాలు ఉంటాయని పేర్కొంది.


యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సూత్రప్రాయంగా అంగీకరించింది. యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మార్రీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ-యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ఇద్దరూ చర్చించారు. యూఏఈకి చెందిన దాదాపు 40 సంస్థలు రాష్ట్రంలో తమ వాణిజ్యాన్ని నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఆహార భద్రత, లాజిస్టిక్‌, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుత్తు, పర్యాటకం, మౌలిక వసతుల కల్పన రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. యూఏఈకి చెందిన షరీఫ్‌ గ్రూప్‌ ఏపీలో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనలపైనా చర్చలు జరిగాయి. లైట్‌ గేజ్‌ స్టీల్‌ ఫ్రేమింగ్‌ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్‌, డీపీ వరల్డ్‌తో కలసి రాష్ట్రంలో భారీ పోర్టు టెర్మినల్‌, లాజిస్టిక్స్‌, మౌలిక వసతుల అభివృద్ధి, ఏడీఏన్‌ఓసీ సంస్థ ద్వారా ఫ్గోటింగ్‌ స్టోరేజీ, విశాఖలో లులూ గ్రూప్‌ మెగా షాపింగ్‌ మాల్‌ నిర్మాణంపైనా చర్చించారు. యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశా లు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోకి పెట్టుబడులపై చంద్రబాబు ప్రతిపాదనలపై యూఏఈ ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో యూఏఈ సంస్థలు మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో యూఏఈ సంస్థల భాగస్వామ్యానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


5.jpg2.jpg3.jpg

దావో్‌సలో నేడు...

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు బుధవారం, మూడోరోజు ప్రముఖ కంపెనీల అధినేతలు, సీఈవోలతో సమావేశం కానున్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కాంగ్రెస్‌ సెంటర్‌లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్‌లో సీఎం పాల్గొంటారు. హొరాసిస్‌ చైర్మన్‌ ఫ్రాంక్‌ జర్గెన్‌ రిక్టర్‌, తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్‌ ఎస్‌డీ శిబులాల్‌, కాలిబో ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు రాజ్‌ వట్టికుట్టి, సీఈఓ స్కాట్‌ సాండ్‌షాఫర్‌ తదితరులతో సీఎం సమావేశమవుతారు. అనంతరం ఏపీసీఎన్‌ఎ్‌ఫ నిర్వహించే ‘హీలింగ్‌ ప్లానెట్‌ త్రూ రీ జెనరేటివ్‌ ఫుడ్‌ సిస్టిమ్‌’ చర్చావేదికలో పాల్గొంటారు.

  • రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారిని అతిథుల్లా చూస్తున్నాం. వారిని గౌరవిస్తున్నాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తాం.

  • అభివృద్ధి ఏ ఒక్కరికో పరిమితం కారాదు. అందరూ భాగస్వాములు కావాలి. ఈ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలి. ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ‘వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ విధానానికి శ్రీకారం చుట్టింది.

- దావోస్‌ సదస్సులో సీఎం చంద్రబాబు

Updated Date - Jan 21 , 2026 | 07:09 AM