Share News

సభను ఎదుర్కొనే దమ్ములేకే ముఖం చాటేశారు: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:24 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చకు రావాల్సిన ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటంపై ప్రశ్నలు సంధిస్తూ.. సభను ఎదుర్కొనే దమ్ములేకే ముఖం చాటేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సభను ఎదుర్కొనే దమ్ములేకే ముఖం చాటేశారు: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
AP Assembly Sessions

అమరావతి, ఆగస్టు 21: సభను ఎదుర్కొనే దమ్ము లేకే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేయడం సరికాదన్నారు. సభను ఎదుర్కొనే దమ్ము లేకే వైసీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దేవాలయం లాంటి అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడే ధైర్యం లేక అసెంబ్లీ నుంచి పారిపోయి పులివెందుల పిల్లుల్లా మారారని విమర్శించారు. నాలుగు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగిందని, సభ 25 గంటల 15 నిమిషాల పాటు కొనసాగిందని తెలిపారు. ఈ సమావేశాల్లో 103 మంది సభ్యులు ప్రసంగించారని, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరై ఉంటే మరో 11 మంది ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఉండేదని జీవీ ఆంజనేయులు అన్నారు.


డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేశ్ సభలో వెల్లడించిన వాస్తవాలతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయిందని జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్‌లో దాక్కున్నారని ఆరోపించారు. మరోవైపు శాసనమండలిలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చకు వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు రావాలని సూచించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా సభకు హాజరై తమ వాదన వినిపించాల్సిన బాధ్యత వారిపై ఉందని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు

Updated Date - Aug 21 , 2026 | 06:02 PM