మున్సిపల్ ఎన్నికలకు 31 మంది పర్యవేక్షక అధికారులు
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:16 AM
రాష్ట్రంలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం 31 మంది అనువజ్ఞులైన మున్సిపల్ కమిషనర్లు, సీనియర్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం 31 మంది అనువజ్ఞులైన మున్సిపల్ కమిషనర్లు, సీనియర్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్లు లేకపోవడం, కొందరు అధికారులు దీర్ఘకాలిక సెలవులు లేదా ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్‌లో ఉండటం, మరికొన్ని చోట్ల ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పూర్తి అదనపు బాధ్యతలు లేదా తాత్కాలిక ఏర్పాట్లతో పనిచేస్తుండటాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగంతో సమన్వయం, కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి భద్రత, రికార్డుల నిర్వహణ, నివేదికల సమర్పణ వంటి కీలక పనులను పర్యవేక్షించేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పర్యవేక్షణ అధికారులు స్థానిక సంస్థల అధికారులకు మార్గదర్శకత్వం, సహకారం అందిస్తూ ఎన్నికలకు ముందు, తర్వాత చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్, ఆదేశాలను పాటించేలా చూడాలి. ఈ అదనపు బాధ్యతల వల్ల సంబంధిత అధికారులు ప్రస్తుతం నిర్వహిస్తున్న అసలు విధులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ అధికారి ఏ మున్సిపాలిటీ పర్యవేక్షక బాధ్యత చూడాలో జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ