స్థానికంలోనూ కూటమిని ఆశీర్వదించండి
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:43 AM
త్వరలో జరగనున్న 23 మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థులను ఆశీర్వదించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
ఉమ్మడి మీడియా సమావేశంలో పల్లా, నాదెండ్ల, మాధవ్
సమన్వయ లోపంతో కొన్ని చోట్ల ఓటమి
సమీక్షించుకుని ముందుకెళ్తాం: శ్రీనివాసరావు
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న 23 మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థులను ఆశీర్వదించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రజలను కోరారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కూటమి పార్టీల ఉమ్మడి మీడియా సమావేశంలో ముగ్గురు నేతలు మాట్లాడారు. ఈ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఈవీఎంలతో ఎన్నికలు జరిగినా.. బ్యాలెట్లతో ఎన్నికలు జరిగినా ప్రజల మద్దతు కూటమి వైపే ఉంది.
కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీ బలంగా ఉండటం, కూటమి పార్టీల నడుమ స్వల్ప సమన్వయ లోపాలతో మా అభ్యర్థులు ఓడిపోయారు. ఓడిన చోట ఏం జరిగిందన్నదానిపై తప్పకుండా సమీక్షించుకుంటాం. ఈ ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పులివెందులలో తొలిసారి ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరిగాయో తెలిపేందుకు ఇదే నిదర్శనం’ అని అన్నారు.
తుఫాన్లను సైతం లెక్క చేయకుండా..
ఎన్నికల మధ్యలో రెండు తుఫాన్లు వచ్చినా లెక్క చేయకుండా ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ‘ప్రజలు ఇచ్చిన తీర్పుతో మా బాధ్యత మరింత పెరిగింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపు చరిత్రాత్మకం. ఈ అద్భుత విజయం వెనుక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సమష్ఠి కృషి ఉంది. దేశంలో ఎక్కడైనా రెండు పార్టీల నడుమ పొత్తు కుదరడమే కష్టం. అలాంటిది మూడు పార్టీల కలసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం దేశంలోని రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది’ అని మాధవ్ అన్నారు.
కూటమి ఐక్యత కొనసాగించేలా పనిచేస్తాం: నాదెండ్ల మనోహర్
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ‘కూటమి ఐక్యత కొనసాగేలా జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయి. పుర, పరిషత్ ఎన్నికల్లో సాధించిన విజయ స్ఫూర్తి పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగాలి. సమాజానికి మేలు చేయాలని వచ్చే యువతకు కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి’ అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్