పెట్టుబడుల ఆకర్షణకు ‘3ఎస్’ మంత్రం
ABN , Publish Date - Aug 27 , 2026 | 05:19 AM
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ‘3ఎస్’ (స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ) విధానాన్ని అనుసరిస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ అన్నారు.
రాష్ట్రంలో వ్యాపార ప్రక్రియలను వేగవంతం చేస్తున్నాం
స్థిరమైన పాలసీలను రూపొందిస్తున్నాం
పెట్టుబడులకు చంద్రబాబు ట్రాక్ రికార్డు కూడా కీలకం
రేపటి తరం గర్వపడేలా అమరావతి నిర్మాణం
ఫార్చూన్ ఇండియా అవార్డుల కార్యక్రమంలో లోకేశ్
అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి
అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ‘3ఎస్’ (స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ) విధానాన్ని అనుసరిస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. ముంబైలో జరిగిన ఫార్చూన్ ఇండియా ‘40 అండర్ 40’ అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేశ్ ఏమన్నారంటే.. ‘‘ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల విషయంలో రెండు అంశాలు అత్యంత కీలకం. మొదటిది మేము అమలు చేస్తున్న ‘3ఎస్’ పాలసీ. రెండవది మా బ్రాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వసనీయత, ఆయన ట్రాక్ రికార్డ్. 3ఎస్‌లో మొదటి ఎస్ అంటే వ్యాపార ప్రక్రియలను వేగవంతం చేయడం. ఇక్కడున్న పారిశ్రామిక భాగస్వాములు దీన్ని స్వయంగా తెలుసుకున్నారు. రెండో ‘ఎస్’ అంటే.. పెట్టుబడిదారులకు నిరంతర సేవలు అందించడం. ప్రాజెక్టుల పురోగతిపై నేనే స్వయంగా ఫీడ్‌బ్యాక్ అందిస్తాను. ప్రతి శనివారం రాత్రి నేరుగా ఇన్వెస్టర్లకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి స్టేటస్ వివరాలు పంచుకుంటాను. ఇక మూడో ‘ఎస్’ అంటే.. స్థిరమైన విధానాలు. ప్రభుత్వాలు మారినా మారకపోయినా, ఇన్వెస్టర్లు కోరుకునేది నిలకడైన పాలసీలనే.
దాన్ని మేము అందిస్తున్నాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక గ్లోబల్ బ్రాండ్. ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయన లాంటి విజనరీ లీడర్ తలుపులు తెరిచి మార్గం సుగమం చేస్తే, ఆ మీటింగ్ రూమ్‌లోకి వెళ్లి డీల్స్ క్లోజ్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే నా పని. ఈ బలమైన భాగస్వామ్యమే ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రత్యేకంగా నిలబెడుతోంది. వ్యాపారమైనా, రాజకీయాలైనా మనం నిర్వహించే సంస్థలకు మనం కేవలం సంరక్షకులం మాత్రమేననే విషయాన్ని బలంగా నమ్ముతాను. నేను నిర్వహించే మానవ వనరుల అభివృద్ధి శాఖకు నేను సంరక్షకుడిని మాత్రమే. నాకు అప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించి, శాఖను మరింత మెరుగైన స్థితికి తీసుకెళ్లాలనేదే నా ఆలోచన. కీలక నిర్ణయాలపై చంద్రబాబుతో చర్చిస్తుంటాను. కొన్ని విషయాల్లో విభేదిస్తుంటాను. ఇది అందరి పిల్లలు, తల్లిదండ్రుల విషయంలో జరిగేదే. ఆరోగ్యకరమైన చర్చ జరిగినప్పుడే మంచి నిర్ణయాలు వస్తాయి. చంద్రబాబు రేపటి తరం గర్వపడేలా అమరావతిని సృష్టిస్తున్నారు. ప్రపంచమంతా చెప్పుకొనేలా ఓ మోడల్‌ను ఏపీలో సృష్టించాలనేదే ఆయన లక్ష్యం. నా లక్ష్యమూ అదే. తప్పులు చేయడం అనేది ఎవరికైనా సహజమే. చేసే ప్రతి తప్పు నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఎవ్వరు అభిప్రాయాలు పంచుకున్నా స్వీకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు.