Share News

బురద జల్లడం మానండి

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:49 AM

మెగా డీఎస్సీపై జగన్‌ ముఠా దుష్ప్రచారం చేస్తోందని డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్లు మండిపడ్డారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమను అవమానించడం తగదని, మెగా డీఎస్సీపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు.

బురద జల్లడం మానండి

  • రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు

  • అబద్ధాలు రుద్దొద్దు.. ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు

  • జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాష్ట్ర

  • ఖ్యాతిని చాటి పతకాలు, సర్టిఫికెట్లు పొందాం

  • ఉత్తమ ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించాం

  • అలాంటి మమ్మల్ని అవమానించడం దుర్మార్గం

  • మెగా డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం

  • స్పోర్ట్స్‌ కోటా టీచర్ల ఆగ్రహం.. బెజవాడలో భేటీ

విజయవాడ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై జగన్‌ ముఠా దుష్ప్రచారం చేస్తోందని డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్లు మండిపడ్డారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమను అవమానించడం తగదని, మెగా డీఎస్సీపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. మెగా డీఎస్సీ నియామకాలపై వాస్తవాలను వివరించేందుకు స్పోర్ట్స్‌ కోటా టీచర్లు ఆదివారం విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు సాధించిన 300 మందికి పైగా అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తాము అడ్డదారిలో ఉద్యోగాలు సాధించలేదని, కష్టపడి సాధించామని ముక్తకంఠంతో స్పష్టం చేశారు. టెట్‌ అర్హత సాధించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాష్ట్రఖ్యాతిని చాటి సర్టిఫికెట్లు పొందామని వివరించారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే కూటమి ప్రభుత్వం తమకు వ్యాయామ ఉపాధ్యాయులుగా 3 శాతం రిజర్వేషన్‌తో ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం నియామకాలను పారదర్శకంగా చేపట్టిందన్నారు.

ఉద్యోగాలను అమ్ముకుంటే ఇంకా బ్యాక్‌లాగ్‌లో సుమారు 40 పోస్టులు ఎందుకు మిగిలి ఉంటాయని అభ్యర్థులు ప్రశ్నించారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లను క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యలు ఇస్తాయని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) మంజూరు చేయదని, ఈ విషయం వైసీపీ నేతలకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. బ్రిడ్జ్‌ గేమ్‌ (పేకాట) సర్టిఫికెట్‌కు ఉద్యోగాలు ఇచ్చారంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో బ్రిడ్జ్‌ గేమ్‌ సంఘం లేనేలేదు. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారిలో బ్రిడ్జ్‌ గేమ్‌ క్రీడాకారులు లేరు’ అని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా, కేవలం బురద చల్లేందుకు జగన్‌ ముఠా అసత్య ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎక్స్‌లో ‘స్పోర్ట్స్‌ టీచర్స్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌

మెగా డీఎస్సీపై దుష్ప్రచారాన్ని ఖండిస్తూ స్పోర్ట్స్‌ కోటా టీచర్ల సమావేశం నేపథ్యంలో ఆదివారం ‘స్పోర్ట్స్‌ టీచర్స్‌ ఫైట్‌ ఫేక్స్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ‘ఎక్స్‌’లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక సమయంలో ఈ యాష్‌ ట్యాగ్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో కూడా నిలిచింది. ఫేక్‌ వార్తలు, తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా స్పోర్ట్స్‌ టీచర్లు ఈ పోరాటానికి శ్రీకారం చుట్టారు.

మానసిక క్షోభ

ఏళ్లుగా క్రీడల్లో కొనసాగుతున్నా. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించా. నా చిన్నతనం నుంచే ఖోఖోలో రాణిస్తున్నా. క్రీడాకారులను అవమానించేలా మాట్లాడటం దుర్మార్గం. ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి అవకాశం కల్పించిందనే సంతోషం లేకుండా అసత్య ప్రచారాలు చేయడం బాధాకరం. నిరాధార ఆరోపణలతో అవమానాలకు గురవడంతో పాటు మానసిక క్షోభను అనుభవిస్తున్నాం.

- పి.శివారెడ్డి, ఖోఖో క్రీడాకారుడు

సమాధానం చెప్పండి

ఎనిమిదేళ్లుగా కానిస్టేబుల్‌గా పనిచేశా. ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ఇటు వచ్చా. చిన్న వయసు నుంచే వివిధ స్థాయిల్లో రాష్ట్రం తరఫున క్రీడా పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నా క్రీడా అర్హతలను ‘ఫేక్‌’ అంటూ ఆరోపణలు చేస్తే.. గత నియామకం సైతం తప్పేనని భావించాలా? ఆరోపణలు చేస్తున్న వారు గత ప్రభుత్వ హయాంలో నాకు ప్రభుత్వ ఉద్యోగం ఎలా వచ్చిందో చెప్పాలి.

- గిడ్ల హర్ష చిన్ని, క్రీడాకారుడు

డీఎస్సీ పారదర్శకం

2005లో తొలిసారిగా మహిళల ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్ గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ జట్టులో నేను సభ్యురాలిని. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి నాకు 25 ఏళ్లు పట్టింది. కూటమి ప్రభుత్వం అమలు చేసిన మూడు శాతం క్రీడా రిజర్వేషన్‌ వల్లే నాకు ఉద్యోగం దక్కింది. కబడ్డీ సమాఖ్య నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం పొందిన తర్వాతే నన్ను ఎంపిక చేశారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగింది.

- శ్వేత, కబడ్డీ క్రీడాకారిణి


స్పోర్ట్స్‌ కోటా టీచర్‌ పెళ్లికి ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన అక్రమ్‌బాషా మెగా డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా కింద టీచర్‌ ఉద్యోగం సాధించారు. ఆదివారం జరిగిన ఆయన వివాహానికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు పొందారని, కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 04:49 AM