Share News

‘సర్‌’కు సిద్ధం

ABN , Publish Date - May 21 , 2026 | 04:53 AM

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

‘సర్‌’కు సిద్ధం

  • ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం

  • నిజమైన ఓటరుకు అన్యాయం జరగదు

  • అనర్హుల ఓట్లకు చెక్‌ పెట్టి జాబితా శుద్ధి

  • అక్రమ, నకిలీ, మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యం

  • ఈ నెల 26న రాజకీయ పార్టీలతో సమావేశం

  • జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే

  • జూలై 21న ముసాయిదా జాబితా ప్రచురణ

  • సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల చేస్తాం

  • ప్రీ ఎస్‌ఐఆర్‌లో 64.6 శాతం మ్యాపింగ్‌ పూర్తి

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఇంటింటి సర్వే ద్వారా మృతులు, నకిలీ, అక్రమంగా చేరిన పేర్లను తొలగిస్తామని తెలిపారు. ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా కఠిన ధ్రువీకరణ చేపడతామని చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఓటరు జాబితాలో అనర్హులకు చోటుండకూడదు, అర్హులను జాబితా నుంచి తప్పించకూడదనే లక్ష్యంతో ఎన్యుమరేషన్‌ చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బీఎల్‌వోలు జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే చేపడతారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్‌ ఫాంలు ఇస్తారు. వాటిలో ఒక ఫాంను ఓటరు స్వయంగా పూర్తిచేసి ఇవ్వాలి. ఇక రెండోదానిపై బీఎల్‌వో సంతకం చేసి ఎక్నాలెడ్జ్‌మెంట్‌గా ఓటరుకు ఇస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తాం. అనంతరం నెల రోజుల పాటు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తాం. అనర్హులకు నోటీసులు జారీ చేసి రెండు నెలల్లో వాటిని పరిష్కరిస్తాం. ఈ దశలన్నీ పూర్తయిన తర్వాత సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం’ అని ఆయన వెల్లడించారు. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇంటెన్సివ్‌ రివిజన్‌ తర్వాత విభజిత రాష్ట్రంలో తొలిసారిగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ ఏడాది జూలై 1ని ఎస్‌ఐఆర్‌కు క్వాలిఫయింగ్‌ తేదీగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. 2002 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు డీమ్డ్‌ టూ బీ ఎలక్టోరల్‌ కింద కొనసాగుతారు. వీరంతా ఎన్యుమరేషన్‌ ఫాం పూర్తిచేసి బీఎల్‌వోలకు అందించాలి. 2002 ఓటర్ల జాబితాలో లేకుండా ప్రస్తుత జాబితాలో ఉన్న వారు ఎన్యుమరేషన్‌ ఫాంతో పాటు ఎన్నికల సంఘం ప్రకటించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది.


ముగిసిన ప్రీ మ్యాపింగ్‌

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రీ మ్యాపింగ్‌ నిర్వహించామని వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ‘ప్రస్తుతం ఉన్న జాబితా ప్రకారం ఏపీలో 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,68,86,239 (64.6శాతం) మంది 2002 నాటి ‘సర్‌’లో నమోదయ్యారు. మరో 1,47,32,120 మంది ఆ తర్వాత ఓటర్లుగా నమోదు చేసుకొని ప్రస్తుత జాబితాలో ఉన్నారు.

బీఎల్‌వోల పాత్ర ఇదీ.. రాష్ట్రవ్యాప్తంగా 46,397 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం పరిధిలో 1,000 నుంచి 1,200 ఓట్లకు మించకుండా హేతుబద్ధీకరిస్తారు. జూలై 14 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సర్‌లో భాగంగా ప్రతి బీఎల్‌వో తమ బూత్‌ పరిధిలోని ప్రతి ఇంటికి మూడుసార్లు తప్పనిసరిగా వెళ్తారు. ఆ సమయంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటి వద్ద ఉండకపోవచ్చు. వలస వెళ్లి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఆ కుటుంబంలో మిగిలినవారు వారి ఎన్యుమరేషన్‌ ఫాంతో వివరాలు పూర్తిచేసి సంతకం చేసి బీఎల్‌వోకు ఇవ్వవచ్చు. వారు ఆ పత్రాలు తీసుకుని సమగ్ర విచారణ చేస్తారు. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉన్నావెంటనే ఓటు తొలగించరు. పొరుగు వారి నుంచి కూడా సమాచారం సేకరిస్తారు. దీనికి సంబంధించి బీఎల్‌వో నుంచి ఈఆర్‌వో వరకు ఒక విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించాం.

రాజకీయ పార్టీలతో సమన్వయం

పోలింగ్‌ బూత్‌లకు బూత్‌ లెవల్‌ ఏజెంట్‌( బీఎల్‌ఏ)ను రాజకీయ పార్టీలు నియమించుకుంటే బీఎల్‌వోలతో సమన్వయం పెరుగుతుంది. బీఎల్‌ఏలకు సర్‌పై శిక్షణ ఇస్తాం. ఇప్పటి వరకూ 68,868 మంది బీఎల్‌ఏల జాబితాలను పార్టీలు అధికారులకు అందించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మండల స్థాయిలో ఈఆర్వోలు, జిల్లాస్థాయిలో డీఈవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 26న సీఈవో కార్యాలయంలో సమావేశం ఉంటుంది.

సర్‌పై ఓటర్లకు అవగాహన

సర్‌ ప్రక్రియపై సందేహాలు వస్తే ఓటర్లు వెంటనే బీఎల్‌వోలను సంప్రదించవచ్చు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్స్ మీడియా, సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా కూడా అవగాహన కల్పిస్తాం. ఇంటింటి సర్వేకు వెళ్లినప్పుడు ఓటర్లకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలని బీఎల్‌వోలకు సూచించాం. నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదు. డీఈవో, ఈఆర్‌వో, బీఎల్‌వోలతో పాటు సర్‌లో భాగస్వాములైన ప్రతి అధికారికి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాం.

Updated Date - May 21 , 2026 | 04:53 AM