100కే కందిపప్పు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:06 AM
నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ షాపుల ద్వారా రూ.100కే కిలో కందిపప్పు అందించడానికి సమాయత్తమవుతోంది. ప్రస్తుతం రిటైల్ షాపుల్లో కిలో కందిపప్పు రూ.170 నుంచి 200 వరకు అమ్ముతున్నారు.
రేషన్ షాపుల్లో రాయితీ ధరపై విక్రయం
ఒక్కో కార్డుపై నెలకు కిలో చొప్పున పంపిణీకి నిర్ణయం
నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ షాపుల ద్వారా రూ.100కే కిలో కందిపప్పు అందించడానికి సమాయత్తమవుతోంది. ప్రస్తుతం రిటైల్ షాపుల్లో కిలో కందిపప్పు రూ.170 నుంచి 200 వరకు అమ్ముతున్నారు. దీంతో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద చర్యలు చేపట్టి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే కందిపప్పు ధరను కిలో రూ.100కు మించకుండా నిర్ణయించాలని మంగళవారం ధరల నియంత్రణపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
సబ్సిడీపై కందిపప్పు సరఫరాకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేసి దీపావళి నాటికి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రేషన్ షాపుల ద్వారా లీటరు పామాయిల్ రూ.125కు, కిలో గోధుమపిండి రూ.25కే అందించాలన్నారు. ధరల నియంత్రణ చర్యలతో ప్రభుత్వంపై నెలకు రూ.100 కోట్లకుపైగా భారం పడుతుందని అధికారులు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు తొలుత రాష్ట్రంలోని 1,48,88,444 రేషన్ కార్డుదారులకు నెలకు ఒక కిలో చొప్పున కందిపప్పును రాయితీపై అందించేందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్రం నుంచి ముడి కందులు
పేదలకు 6 నెలల పాటు రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరపై కందిపప్పు సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం నెలకు 14,750 టన్నుల చొప్పున, ఆరు నెలలకు మొత్తం 88,500 టన్నుల కందిపప్పు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం ఒక లక్ష టన్నులకుపైగా ముడి కందులను రాష్ట్రానికి కేటాయించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రస్తుతం నాఫెడ్ వద్దనున్న 40,300 టన్నుల ముడి కందులను రాష్ట్రానికి కేటాయిస్తూ 26న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నవంబరు 8న దీపావళి పండుగ నాటికి రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై కందిపప్పు పంపిణీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. నవంబరులో సాధ్యం కాకపోతే డిసెంబరు నుంచి కచ్చితంగా రాయితీపై కందిపప్పును పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు