Share News

ఏపీలో కొత్తగా మూడు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Jul 03 , 2026 | 09:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదించింది.

ఏపీలో కొత్తగా మూడు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh Police

అమరావతి, జులై 3: ఏపీలో కొత్తగా మూడు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత మెరుగుపరచడం, పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాల పోలీస్ విభాగాలను కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెరుగుతున్న జనాభా, నగరాల విస్తరణ, అదేవిధంగా నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. జిల్లాల వారీగా ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని కమిషనరేట్ స్థాయికి పెంచడం ద్వారా మరింత మెరుగైన రక్షణ, వేగవంతమైన సేవలు ప్రజలకు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


ఈ నూతన కమిషనరేట్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అప్పుడే అడుగులు వేశారు. కొత్తగా ప్రతిపాదించిన ఈ మూడు కమిషనరేట్లకు సంబంధించిన సరిహద్దుల నిర్ణయం, అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాల ఎస్పీలను ఆయన ఆదేశించారు. వీటితో పాటూ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే కొత్త పోలీస్ వింగ్స్, అదనపు సిబ్బంది అవసరాలు, ఇతర సాంకేతిక వసతులపై సమగ్ర అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదికలను, ప్రతిపాదనలను వెంటనే పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఆయా నగరాల్లో ట్రాఫిక్, క్రైమ్ కంట్రోల్ వంటి విభాగాలు మరింత బలోపేతం కానున్నాయి.


ఇవి కూడా చదవండి..

IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ..ఒకే ట్రిప్‌లో 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు..

'మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేం'

Updated Date - Jul 03 , 2026 | 09:51 PM