Share News

లేదంటూనే.. రీసర్వేకు ఒత్తిడి..!

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:33 AM

సర్వేశాఖలో ఓ ఉత్తర్వుతో పెద్ద కలకలం రేగింది. ఎన్నికల విధుల్లో తలమునకలైన సర్వేయర్లను రీసర్వే పేరిట జిల్లాలకు పంపిస్తామంటూ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (ఆర్‌డీడీ) డిప్యుటేషన్‌ ఉత్తర్వులు ఇవ్వడం ఆ కలకలానికి కారణమైంది.

లేదంటూనే.. రీసర్వేకు ఒత్తిడి..!

  • ఎన్నికల విధుల్లో ఉన్నవారిని ఒత్తిడి చేయబోమంటూ ఇటీవలే సర్వే డైరెక్టర్‌ హామీ

  • అయినా డిప్యుటేషన్‌ ఉత్తర్వులివ్వడంపై సర్వేయర్ల భగ్గు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): సర్వేశాఖలో ఓ ఉత్తర్వుతో పెద్ద కలకలం రేగింది. ఎన్నికల విధుల్లో తలమునకలైన సర్వేయర్లను రీసర్వే పేరిట జిల్లాలకు పంపిస్తామంటూ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (ఆర్‌డీడీ) డిప్యుటేషన్‌ ఉత్తర్వులు ఇవ్వడం ఆ కలకలానికి కారణమైంది. పైఅధికారికి తెలియకుండానే కిందిస్థాయి అధికారి ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి? ఎన్నికల విధుల్లో ఉన్న సర్వేయర్లపై రీసర్వే ఒత్తిడిచేయబోమని సర్వేడైరెక్టర్‌ చెప్పిన తర్వాత కూడా రీసర్వే పేరిట ఆర్‌డీడీ ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు. వారికి టార్గెట్లు విధిస్తూ ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారు? అంటూ సర్వే శాఖలో చర్చ జరుగుతోంది. సర్వేడైరెక్టర్‌ సంతకం లేకుండా నేరుగా సీసీఎల్‌ఏ డిజిటల్‌ సంతకంతో ఆర్‌డీడీ ఉత్తర్వులు ఇవ్వడం ఒక ఎత్తయితే, అది సర్వేడైరెక్టర్‌కు తెలియకుండానే రావడం మరో ఎత్తు.

దీంతో సర్వే శాఖలో ఎవరు సుప్రీమ్‌? అన్న చర్చ బయలుదేరింది. ఇదిలా ఉండగా, డిప్యుటేషన్ల ఉత్తర్వులపై గ్రామ సర్వేయర్లు భగ్గుమన్నారు. ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలంటూ వాట్సాప్‌ గ్రూప్‌లు, సోషల్‌ మీడియాల వేదికగా డిమాండ్‌ చేశారు. తమదైన శైలిలో ఆర్‌డీడీ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలు గమనించిన ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌.. సర్వేడైరెక్టర్‌తో మాట్లాడారు. జరుగుతున్న పరణామాలు ఆరా తీశారు. సర్వేడైరెక్టర్‌కు తెలియకుండా, కేవలం సీసీఎల్‌ఏ సంతకంతోనే ఆర్‌డీడీ ఉత్తర్వులు ఇచ్చారని గుర్తించారు.

సర్వేయర్లను శాంతింపచేసేందుకు తక్షణమే ఆర్‌డీడీ ఇచ్చిన డిప్యుటేషన్‌ ఆర్డర్‌ను నిలిపివేయాలని, దీపావళి పండుగ ముగిసేవరకు ఎలాంటి ఒత్తిళ్లు, టార్గెట్‌లపై ఉత్తర్వులు, మార్గదర్శకాలు ఇవ్వొద్దని సీఎస్‌ ఆదేశించినట్లు తెలిసింది. అయితే, ఈ ఉపశమనాన్ని స్థానిక ఎన్నికల గడువు అయిన డిసెంబరు 5 వరకు పొడిగించాలని గ్రామసర్వేయర్లు, సర్వే ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.


వెసులుబాటు కల్పిస్తామని..:

రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ), గ్రామ సర్వేయర్‌ (వీఎస్)లను రెవెన్యూ, సర్వే సంబంధిత పనులకే జిల్లా యాంత్రాంగం ఉపయోగించుకోవాలి. అయితే, ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన సర్‌కు, ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు వారి సేవలనువినియోగించుకుంటున్నారు. ఎన్నిలక విధుల్లో తీరిక లేకుండా ఉన్న తమకు స్థానిక ఎన్నికలు ముగిసే వరకు రీ సర్వే నుంచి వెసులుబాటు కల్పించాలని, టార్గెట్లు పెట్టవద్దని, సమీక్షల్లో తిట్లదండకం వద్దని గ్రామ సర్వేయర్లు కోరారు. ఇదే విషయమై సర్వేయర్ల సంఘం నుంచి సర్వే డైరెక్టర్‌కు ఓ లిఖితపూర్వక విన్నపం కూడా ఇచ్చారు.

అయినా కూడా కొందరు అధికారులు గ్రామ సర్వేయర్లపై రీ సర్వే ఒత్తిడి తీసుకొచ్చారు. రోజుకు 30 ఎకరాలు పూర్తిచేయకుంటే చార్జ్‌మెమోలు ఇప్పిస్తామని హెచ్చరించారు. ఇది సర్వేయర్లను ఆందోళనకు గురిచేసింది. ఇదే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ఈనెల 18న ‘‘భూముల కొలతలకు ఎన్నికల చిక్కులు-టార్గెట్‌ల ఒత్తిడి వద్దంటోన్న ఉద్యోగులు’’ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారిని రీసర్వే టార్గెట్‌ల పేరిట ఒత్తిడి చేయబోమని, ఎన్నికలు లేని చోట్లే సర్వే చేయిస్తామని అప్పట్లో సర్వేడైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ చెప్పారు.


డైరెక్టర్‌ను పక్కనబెట్టి.. ఆర్‌డీడీ ఉత్తర్వులు

సర్వేయర్లపై ఒత్తిడి చేయబోమని సర్వేడైరెక్టర్‌ చెప్పిన తర్వాత మళ్లీ ఆ అంశంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సర్వే డైరెక్టర్‌నే తీసుకోవాలి. లేదంటే రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి. సాయిప్రసాద్‌, సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మీలే ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. అదీ సర్వైడైరెక్టర్‌కు చెప్పి, ఆయనతోనే ఆదేశాలు ఇప్పించాలి. కానీ, సర్వే డైరెక్టర్‌కు తెలియకుండానే రీసర్వే పనుల కోసం ఈనెల 24న సర్వే ఆర్‌డీడీ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై సర్వే శాఖలో విమర్శలు వినిపిస్తున్నాయి.

డిప్యుటేషన్‌, రీసర్వేపై ఆర్‌డీడీ ఇచ్చిన ఉత్తర్వులపై గ్రామ సర్వేయర్లు విమర్శలు గుప్పించారు. ఒత్తిడి చేయబోమని సర్వేడైరెక్టర్‌ ప్రకటించిన వారం రోజుల్లోనే , ఓ జూనియర్‌ అధికారి డిప్యుటేషన్‌ ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాల వారీగా కలెక్టర్‌లు, సర్వే డీడీ, ఏడీలకు వినతిపత్రాలు ఇచ్చి తమను ఎన్నికలు ముగిసేవరకు రీసర్వేపేరిట వేధించవద్దని వేడుకున్నారు. మరోవైపు సర్వేయర్ల సంఘం తరఫున ప్రభుత్వానికి వినతిపత్రం చేరింది. డిప్యుటేషన్‌ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళనకు వెళ్తామని అందులో హెచ్చరించారు. పరిణామాలు చేతులు దాటుతుండటంతో సీఎస్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదే అంశంపై సర్వేడైరెక్టర్‌ను సంప్రదించేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:33 AM