సామాజిక భద్రతలో దేశంలోనే ఏపీ టాప్
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:51 AM
ఏపీ కేవలం సంపదను సృష్టించడంపైనే కాకుండా, ఆ సంపదను సమాజంలోని చివరి వ్యక్తికి ఉపయోగపడేలా సంక్షేమ, ప్రాథమిక వసతుల రూపంలో పంపిణీ చేయడంలో మార్గదర్శకంగా నిలుస్తోందని...
వసతుల్లో 2, ఆదాయంలో 13వనరులు తక్కువైనా సౌకర్యాల్లో భేష్
సంపన్న రాష్ట్రాలకు దీటుగా ప్రజాసేవ
గుజరాత్, కర్ణాటకల కంటే ఆంధ్రానే బెటర్
సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్-2026 నివేదికలో వెల్లడి
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఏపీ కేవలం సంపదను సృష్టించడంపైనే కాకుండా, ఆ సంపదను సమాజంలోని చివరి వ్యక్తికి ఉపయోగపడేలా సంక్షేమ, ప్రాథమిక వసతుల రూపంలో పంపిణీ చేయడంలో మార్గదర్శకంగా నిలుస్తోందని ‘సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్-2026’ నివేదిక పేర్కొంది. ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాయనేది ఒక సాధారణ నమ్మకమని, కానీ.. ప్రజల జీవన ప్రమాణాలు నిర్దేశించే ప్రాథమిక వసతులను అందించడంలో ధనిక రాష్ట్రాల కంటే కొన్ని పేద, మధ్య ఆదాయ రాష్ట్రాలే ఎంతో మెరుగ్గా రాణిస్తున్నాయని వెల్లడించింది.
సామాజిక భద్రతలో ఏపీ తొలిస్థానంలో నిలవగా, ప్రజలకు ప్రాథమిక వసతులు, సేవలను అందుబాటులోకి తేవడంలో దేశంలోనే రెండో ర్యాంకు సాధించిందని నివేదిక వివరించింది. అత్యధిక తలసరి ఆదాయం ఉన్న గోవా ఈ సూచీలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న గుజరాత్, కర్ణాటక, హరియాణ, మహారాష్ట్ర వంటి సంపన్న రాష్ట్రాల కంటే ఏపీ ఎంతో ముందువరుసలో నిలిచిందని తెలిపింది. తనకున్న బడ్జెట్ పరిమితులను అధిగమించి, ఊహించిన దాని కంటే రెట్టింపు స్థాయిలో ప్రజలకు విద్య, వైద్యం వంటి కనీస అవసరాలను తీర్చడం వల్లే ఏపీకి ఈ రెండోస్థానం దక్కిందని నివేదిక స్పష్టం చేసింది.
‘‘గృహవసతి, తాగునీరు, ఆస్పత్రి పడకలు వంటి మౌలిక వసతులు రాష్ట్రాల బడ్జెట్ సామర్థ్యంపై ఆధారపడతాయి. కానీ, విద్య, సామాజిక భద్రత వంటి రంగాలు కేవలం డబ్బుపైనే ఆధారపడవు. ప్రభుత్వాలు పథకాలను ఎంత సమర్థవంతంగా డిజైన్ చేస్తున్నాయి?. ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నాయి? అనే దానిపైనే వీటి విజయం ఆధారపడి ఉంటుంది.’’ అని ఈ నివేదిక పేర్కొంది.
సామాజిక భద్రతలో నెంబర్ 1
ఈ విభాగంలో 0.69 స్కోరుతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో గోవా 0.50 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. పేదలు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు, బీమా, ఉపాధి అవకాశాలు వంటి వాటిని ప్రజలకు చేర్చడంలో ఏపీ అత్యుత్తమంగా పనిచేసిందని నివేదిక పేర్కొంది.
తలసరి ఆదాయంలో..
ఈ నివేదిక ప్రకారం ఏపీ తలసరి ఆదాయంలో దేశంలో 13వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయం ప్రకారం ఏపీకి 0.51 స్కోరు రావాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో వసతుల కల్పన ద్వారా 0.66 స్కోరు సాధించింది. ఈ 0.15 పాయింట్ల సానుకూల వ్యత్యాసం దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదని నివేదిక పేర్కొంది. దీని తర్వాత స్థానాల్లో ఉన్న కేరళ 0.07, హిమాచల్ ప్రదేశ్ 0.06 ల కంటే ఏపీ రెండింతలు మెరుగైన ఫలితాలు చూపించింది.
ఏపీ ఈ సూచీలో రోల్‌మోడల్‌గా నిలిచిందని తెలిపింది. ధనిక రాష్ట్రం కాకపోయినా, బలమైన ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాల ద్వారా ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేసిందని పేర్కొంది. ప్రాథమిక వసతులు, ఆరోగ్య సేవలను వికేంద్రీకరణ పద్ధతిలో గ్రామీణ ప్రాంతాల వరకు క్లినిక్‌లు, తాగునీరు, పాఠశాల సౌకర్యాలను విస్తరించడం ఏపీకి కలిసొచ్చింది.
సదుపాయాలు సులభం
సదుపాయాల కల్పన విషయంలో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న గోవా మొదటి స్థానంలో ఉండగా, మధ్యస్థ ఆదాయం ఉన్న ఏపీ రెండోస్థానంలో నిలిచింది. అంటే, గుజరాత్, కర్ణాటక, హరియాణ వంటి సంపన్న, పారిశ్రామిక రాష్ట్రాల కంటే కూడా ఏపీలో సామాన్య ప్రజలకు స్కూళ్లు, ఆస్పత్రులు, బ్యాంకులు, కోర్టులు, తాగునీటి సదుపాయాలు అత్యంత సులభంగా అందుబాటులో ఉంటాయి. ఆదాయం ఇంకా పూర్తిగా పెరగకముందే, ప్రభుత్వం నేరుగా ప్రజల ఆరోగ్యం, విద్య, కనీస అవసరాలపై పెట్టుబడులు పెట్టడం ఏపీని అగ్రస్థానంలో నిలిపిందని నివేదిక వివరించింది.
ప్రగతి.. పురోగతి!
ఈ నివేదికలో ఆశ్చర్యపరచిన అంశం.. రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతి. మధ్యస్థ ఆదాయం ఉన్నప్పటికీ, ప్రజలకు ప్రాథమిక వసతులు, సేవలు అందించడంలో దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రమైన గోవా తర్వాత ఏపీ రెండోస్థానంలో నిలిచింది. ఒక రాష్ట్ర ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని అది ఎంతవరకు సేవలు అందించగలదనే అంచనా రేఖను గీస్తే, ఆ గీత కంటే ఎంతో ఎత్తులో నిలిచిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. తనకున్న వనరుల కంటే రెట్టింపు స్థాయిలో ప్రజలకు సేవలు చేరవేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఏపీతోపాటు కేరళ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ప్రజారోగ్యం, విద్యపై గతంలో చేసిన దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల ఈ జాబితాలో పైస్థాయిలో నిలిచాయి. దేశంలోనే అత్యంత పేదరాష్ట్రంగా ఉన్న బిహార్ ఈ సూచీలో కింది వరుసలోనే ఉన్నప్పటికీ, తనకున్న పరిమిత ఆర్థిక వనరులతో పోలిస్తే అంచనాల కంటే మెరుగైన వృద్ధి నమోదు చేసిందని నివేదిక వెల్లడించింది.
సంపన్న రాష్ట్రాలు వెనుకంజ
ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎంతో బలంగా ఉన్న గుజరాత్, కర్ణాటక వంటి సంపన్న రాష్ట్రాలు ఈ నివేదికలో వెనుకబడ్డాయి. వాటికి వస్తున్న భారీ ఆదాయంతో పోలిస్తే, సామాన్య ప్రజలకు అందుతున్న కనీస వసతుల(విద్య, వైద్యం, న్యాయం వంటివి) స్థాయి చాలా తక్కువగా ఉందని ఈ సూచీ స్పష్టం చేసింది. ముఖ్యంగా అంచనాల కంటే అత్యంత తక్కువ వసతులు కల్పిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి వరుసలో ఉండడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి: