డ్రగ్స్ ముఠాలపై పోలీసు పంజా
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:16 AM
మత్తు రహిత రాష్ట్రమే లక్ష్యంగా.. డ్రగ్స్, గంజాయి ముఠాల్ని ఏరి వేయడంలో పోలీసులు ఉమ్మడి కార్యాచరణను పక్కాగా అమలు చేస్తున్నారు.
ఇంటెలిజెన్స్, ఈగల్, పోలీస్ ఉమ్మడి ఆపరేషన్లు
రైల్లో డ్రగ్స్ తెస్తున్న యువతి బెజవాడలో అరెస్ట్
కారులో తరలిస్తున్న యువకుడికి కర్నూల్లో సంకెళ్లు
ఒడిశా నుంచి తరలిస్తున్న గంజాయి విశాఖలో స్వాధీనం
నెల్లూరులో సాగు చేస్తున్న గంజాయి మొక్కలు ధ్వంసం
డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా పోలీసుల ఉమ్మడి చర్యలు
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మత్తు రహిత రాష్ట్రమే లక్ష్యంగా.. డ్రగ్స్, గంజాయి ముఠాల్ని ఏరి వేయడంలో పోలీసులు ఉమ్మడి కార్యాచరణను పక్కాగా అమలు చేస్తున్నారు. గత ఐదు రోజులుగా చేపట్టిన మూడు కీలక ఆపరేషన్లు డ్రగ్స్ ముఠా వెన్నులో వణుకు పుట్టించాయి. ఒడిశా నుంచి రహస్యంగా రవాణా చేస్తున్న గంజాయి స్మగ్లర్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, రైల్లో డ్రగ్స్ తీసుకువస్తున్న యువతిని విజయవాడలో, కారులో మత్తు పదార్థాలు తరలిస్తున్న యువకుడిని కర్నూలు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నెల్లూరులో జొన్న చేను మాటున సాగు చేస్తున్న గంజాయి మొక్కల్ని జిల్లా ఎస్పీ నేతృత్వంలోని పోలీసు, ఈగల్ బృందాలు తొలగించి తగులబెట్టాయి. పోలీ సు శాఖలోని మూడు కీలక విభాగాలు(ఇంటెలిజెన్స్, ఈగల్, లా అండ్ ఆర్డర్) సమన్వయంతో చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సమాచారంతో పోలీసు, ఈగల్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇటీవల బెంగుళూరు నుంచి ఓ యువతి రైలులో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన జీఆర్పీ పోలీసులు.. విజయవాడ రైల్వే స్టేషన్లో యర్రంశెట్టి నాగ సౌమ్య అనే యువతిని అదుపులోకి తీసుకుని ఆమె నుంచి రూ.11 లక్షల విలువైన 110 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు హ్యాండ్లర్‌గా వ్యవహరించిన షేక్ బషీర్‌ను సైతం అరెస్టు చేసి జైలుకు పంపారు. కర్నూలు జిల్లాలోకి వస్తు న్న ఓ కారులో డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో నల్లూరి వరుణ్ తేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు 20 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్ సరఫరా ముఠా వెనకున్న నెట్‌వర్క్‌పై దృష్టి సారించి మూలాల్ని శోధించే పనిలో నిమగ్నమయ్యారు.
మత్తు ముఠాలపై కఠిన చర్యలు: డీజీపీ
రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకొచ్చే ముఠాలతో పాటు గంజాయి అక్రమ రవాణా, సాగుచేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి ముఠాల ఆగడాలను ఎక్కడా సాగనివ్వబోమన్నారు. మత్తు రహిత రాష్ట్రం కోసం రాష్ట్రంలోని వివిధ విభాగాలతోపాటు పొరుగు రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు. డ్రగ్స్, గంజాయి సాగు, సరఫరాపై టోల్ ఫ్రీ నెంబర్ 1972 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఒడిశా నుంచి షిర్డీకి
ఒడిశాలోని మాచ్‌ఖండ్ నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి తరలిస్తున్న 385 కిలోల గంజాయిని విశాఖ జిల్లా తర్లువాడ టోల్ ప్లాజా దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం సేకరించిన సమాచారంతో పోలీసు, ఈగల్ బృందం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1.9 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ వాహనంతో పాటు గంజాయి సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్‌ను జైలుకు పంపి నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు.
ఉత్తరాంధ్రలో గంజాయి సాగుపై గట్టి నిఘా పెట్టిన అక్కడి పోలీసులు గంజాయి మొక్క లేకుండా చేశారు. తెలివి మీరిన మత్తు స్మగ్లర్లు నెల్లూరు జిల్లా దుత్తలూరులో ప్రాంతంలోని ఓ పొలంలో చుట్టూ జొన్న చేను వేసి మధ్యలో రెండెకరాల స్థలంలో గంజాయి సాగు చేస్తున్నారు. దీనిని పసిగట్టిన పోలీసులు.. ఈగల్ బృందంతో వెళ్లి మొక్కలను తొలగించి జిల్లా ఎస్పీ సమక్షంలో తగులబెట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ