విశాఖ నేవీ రహస్యాలపై పాక్ గురి
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:18 AM
భారతీయ సిమ్ కార్డుల ఓటీపీలను పాకిస్థాన్ గూఢచారులకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు వ్యక్తుల్ని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) పోలీసులు బిహార్‌లో అరెస్టు చేశారు.
పాకిస్థాన్ ఏజెంట్లకు భారత సిమ్‌ల ఓటీపీలు
ఏపీ ఇంటెలిజెన్స్ ‘ఆపరేషన్ ఫైర్‌వాల్ 2026’
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భారతీయ సిమ్ కార్డుల ఓటీపీలను పాకిస్థాన్ గూఢచారులకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు వ్యక్తుల్ని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) పోలీసులు బిహార్‌లో అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్‌కు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాముల రహస్య సమాచారాన్ని సేకరించేందుకు గూఢచర్య నెట్‌వర్క్‌పై మన సీఐ సెల్ ఉచ్చు బిగించింది. నేపాల్ హ్యాండ్లర్ల ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పీఐవో)కు ఓటీపీలు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై బిహార్‌లోని రక్సౌల్‌లో ఈ ఇద్దరినీ అరెస్టు చేసింది.
ఆపరేషన్ ఫైర్‌వాల్ 2026 చేపట్టిన ఏపీ సీఐ సెల్ ఇప్పటికే విశాఖపట్నం, కొయంబత్తూరులో ఇద్దరిని అరెస్టు చేసింది. తాజాగా బిహార్ సరిహద్దు పట్టణమైన రక్సౌల్‌లో ఐదుగురు అనుమానితుల్ని విచారించిన అధికారులు తమకు లభించిన ఆధారాల మేరకు రాజ్ కుమార్, ఆదిత్యకుమార్ పాండేలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టగా... కోర్టు నవంబరు 10 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ గూఢచర్యంపై ఏపీ పోలీసు వర్గాలు స్పందిస్తూ... రక్సౌల్‌కు చెందిన పాయురట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) ఏజెంట్ రాజ్ కుమార్, పలువురు భారతీయ మొబైల్ నంబర్లపై వాట్సాప్ ఖాతాలు యాక్టివేట్ చేసేందుకు పాక్ ఏజెంట్లకు ఓటీపీలు చేరవేశాడు. ఇందుకోసం మరో వ్యక్తి పేరుతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతా తెరిపించి, సిమ్ కార్డుల ఓటీపీలకు సంబంధించిన చెల్లింపులు అందుకున్నట్లు తేలింది.
సోనీ, సోనీ క్వీన్ లాంటి పేర్లతో పాక్ ఏజెంట్లు పెద్ద మొత్తంలో పీవోఎస్ ఏజెంట్లకు డబ్బులు పంపినట్లు వెల్లడైంది. విశాఖపట్నంలో నేవీ అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేసే అన్నం సాయి వరప్రసాద్‌తో సంప్రదింపులు జరిపినట్లు బయటపడింది. యుద్ధనౌకలు, జలాంతర్గాముల సమాచారాన్ని అతని ద్వారా జోషితా పాల్ అనే పేరుతో ఉన్న పాక్ ఏజెంట్ పొందేందుకు ప్రయత్నించినట్లు సీఐ సెల్ పసిగట్టింది. దీంతో అక్టోబరు 1న సాయి వరప్రసాద్‌ను విశాఖలో, అక్టోబరు 3న నేవీ అధికారి ప్రదీప్ ముఖర్జీని కోయంబత్తూరులో అరెస్టు చేసింది. దర్యాప్తులో భాగంగా మరింత లోతుకు వెళ్లడంతో బిహార్‌కు చెందిన ఆదిత్యకుమార్, రాజ్‌కుమార్‌తో పాటు అదే ప్రాం తానికి చెందిన వసీం, సుల్తాన్, నయీమ్ అనే వ్యక్తులకు పాక్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది.
ఈ ముఠా ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ల ద్వారా పాక్ ఏజెంట్లకు సహకరించి, ఇతరుల పేర్లతో ఉన్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి నిధులు స్వీకరించినట్లు పోలీసులు గుర్తించారు. దేశ భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలపై నిఘా పెట్టామని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ సెల్ అధికారులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట