Share News

పుంగనూరు మళ్లీ భగ్గు

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:10 AM

పరిషత్‌ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు పలు చోట్ల నామినేషన్లు పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, మరికొన్ని చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడులతో నామినేషన్‌ కేంద్రాల వద్ద టెన్షన్‌ పెంచారు.

పుంగనూరు మళ్లీ భగ్గు

  • ‘పరిషత్‌’ నామినేషన్ల మొదటిరోజే.. రెచ్చిపోయిన పెద్దిరెడ్డి అనుచరులు

  • టీడీపీ వర్గీయులపై దౌర్జన్యకాండ.. దాడుల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు

  • కారు, ట్రాక్టర్‌కు నిప్పుపెట్టిన వైసీపీ మూకలు.. తిరుపతిలో పరస్పరం రాళ్ల దాడులు

  • నిబంధనలు ఉల్లంఘించి మాచర్లలో రోడ్డెక్కిన పిన్నెల్లి.. చర్యలు తప్పవన్న పోలీసులు

అన్నమయ్య, తిరుపతి, మాచర్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పరిషత్‌ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు పలు చోట్ల నామినేషన్లు పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, మరికొన్ని చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడులతో నామినేషన్‌ కేంద్రాల వద్ద టెన్షన్‌ పెంచారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల దాఖలు సందర్భంగా పుంగనూరు మరోసారి భగ్గుమంది. టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు, సదుం మండలాల్లో విధ్వంసం సృష్టించారు. టీడీపీ వర్గీయులపై రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. టీడీపీ నాయకులకు చెందిన కారు, ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. ఈ దాడిలో ఏడుగురు గాయపడ్డారు. తమకేమీ తెలియదని, తాము నామినేషన్లు వేయడానికి వెళితే టీడీపీ వాళ్లే అడ్డుకుంటున్నారని వైసీపీలో పైనుంచి కింది స్థాయి వరకు నాయకులు గగ్గోలు పెడుతున్నారు.


అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సరిగ్గా వారం కిందట మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల తొలిరోజు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఎనిమిది వాహనాల కాన్వాయ్‌తో నామినేషన్ల కేంద్రం వద్దకు వచ్చి, టీడీపీ మద్దతుదారులను కారుతో ఢీకొని, గాయపర్చిన విషయం తెలిసిందే. ఎంపీపైనా టీడీపీ నాయకులు దాడికి పాల్పడటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి ఆయనను రక్షించారు. ఈ ఘటనలపై పోలీసులు మూడు కేసులు నమోదు చేసి, 70 మందిపై కేసులు నమోదు చేశారు. అయినా, వైసీపీ మద్దతుదారులు బుధవారం రెచ్చిపోయారు. పుంగనూరు కొత్తఇండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌లో ఎంపీటీసీ నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులపై రాళ్లు, కట్టెలతో దాడిచేసి వీరంగం సృష్టించారు. ఉదయం 9 గంటల సమయంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప నామినేషన్‌ కేంద్రం వైపు వస్తుండగా, కూటమి శ్రేణులు అడ్డుకుని వెనక్కు పంపించేశారు. 11 గంటల సమయంలో వైసీపీకి చెందిన సుమారు 10 మంది మహిళా నేతలు నామినేషన్‌ కేంద్రం వద్దకు వచ్చారు. వారి వెనుకే వచ్చిన 300 మంది వైసీపీ శ్రేణులు రాళ్లు, కట్టెలు, ఇనుపరాడ్లతో టీడీపీ వాళ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన నేతిగుంటపల్లెకు చెందిన బాలాజి, గోపిశెట్టిపల్లెకు చెందిన శివానంద, కమతంపల్లెకు చెందిన రామాంజులు గాయపడ్డారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరుగుతుండగా మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌, పుంగనూరు సీఐ సుబ్బరాయుడు లాఠీచార్జీ చేసి, ఇరువర్గాలను చెదరకొట్టారు.


వైసీపీ మహిళా నేతలు తాము నామినేషన్లు వేయాలని రోడ్డుపైన బైఠాయించారు. దీంతో పోలీసులు వాళ్లకు అనుమతి ఇచ్చారు. అయితే అక్కడున్న వైసీపీ వాళ్లు జగన్‌ జిందాబాద్‌.. మిథున్‌రెడ్డి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో మళ్లీ గొడవ మొదలైంది. ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తె చ్చారు. తొలిరోజు వైసీపీ నుంచి ఆరుగురు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్లు వేశారు. మరోవైపు, సదుం ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ మద్దతుదారులు ఘర్షణపడ్డారు. వైసీపీ దాడిలో నడిగడ్డకు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి, సదుంకు చెందిన పవన్‌కుమార్‌, ఊటుపల్లెకు చెందిన శంకర్‌, తాటికుంటపల్లెకు చెందిన మునిరెడ్డి గాయపడ్డారు. వైసీపీ వాళ్లు పవన్‌కుమార్‌రెడ్డి కారుకు, అబ్బిరెడ్డి ట్రాక్టర్‌కు నిప్పు పెట్టారు. సదుం మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా, వైసీపీ నుంచి 15 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ వారు అడ్డుకోవడంతో తొలిరోజు టీడీపీ వారు నామినేషన్లు వేయలేదు.

‘తిరుపతి’ ఉద్రిక్తం..

ఉద్రిక్త వాతావరణం నడుమ తిరుపతి జిల్లాలో బుధవారం పరిషత్‌ నామినేషన్ల ఘట్టం మొదలైంది. శ్రీకాళహస్తిలో నామినేషన్‌ కేంద్రం వద్దకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంలను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలూ రెచ్చిపోయి పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. కాగా, అదే నామినేషన్‌ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి కుమార్తె పవిత్ర, కుమారుడు ఆకర్ష్‌రెడ్డి అభ్యర్థుల వెంట రాగా వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరువర్గాల నడుమ తోపులాట జరిగింది. కాగా, రైల్వే కోడూరు నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయలు వర్గీయులు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఇదిలాఉండగా, తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ నామినేషన్‌ కేంద్రంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉదయం 10.30 నుంచీ మధ్యాహ్నం 1.30 వరకూ మకాం వేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పులివర్తి నానీ కూడా కలెక్టరేట్‌ చేరుకుని ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


మాచర్లలో పిన్నెల్లి వీరంగం

పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్‌ ఉప సంహరణ నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హడావుడి చేశారు. 144 సెక్షన్‌ను ఉల్లంఘించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. పిన్నెల్లి ఇంటి వద్ద ఎస్‌ఐ వెంకటరావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయినా లెక్క చేయకుండా ఆయన తన అనుచరులతో ఎస్‌ఐ వెంకటరావును నెట్టివేయగా, ఎస్‌ఐ కాలికి గాయమైంది. ఇంటి నుంచి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి.. రాస్తారోకో చేశారు. పట్టణ సీఐ నజీర్‌బేగ్‌ హెచ్చరికతో పిన్నెల్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. మార్కాపురంఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై వైసీపీ మూకలు దౌర్జన్యానికి పాల్పడ్డాయి.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 06:35 AM