Share News

డ్రోన్లతో నిరంతర నిఘా

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:11 AM

మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబరు 1న జరిగే పోలింగ్‌కు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపింది.

డ్రోన్లతో నిరంతర నిఘా

  • మున్సిపల్‌ పోలింగ్‌కు పటిష్ఠ పోలీసు బందోబస్తు

  • సీసీటీవీలు, వీడియోలతో చిత్రీకరణ

  • 36 వేల మందితో భద్రతా ఏర్పాట్లు

  • స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు చర్యలు

  • రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడి

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబరు 1న జరిగే పోలింగ్‌కు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాట్లు చేసినట్లు చెప్పింది.

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. పట్టణ స్థానికసంస్థల ఎన్నికల భద్రత కోసం మొత్తం 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇందులో జిల్లాల్లో అందుబాటులో ఉన్న 32,276 మంది పోలీసు సిబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ పోలీసు నుంచి 2730 మంది, ఇతర విభాగాల నుంచి 1,345 మంది ఉన్నారు.


సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..

రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మకంగా గుర్తించిన 4,372 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వీటిలో అతి సున్నితమైన 671 కేంద్రాలకు 3355 మందిని, సున్నితమైన 1233 కేంద్రాలకు 4,943 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. పోలింగ్‌ సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికలకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఈసీ హెచ్చరించింది.

పశుపోషణ పనులకు కోడ్‌ మినహాయింపు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి నుంచి కొన్ని పశుసంవర్థక పనులకు ఎస్‌ఈసీ మినహాయింపునిచ్చింది. వీబీజీ రామ్‌జీ పథకం కింద శాశ్వత పచ్చిమేత సాగు, పశువుల షెల్టర్లకు సంబంధించిన పనులు చేపట్టేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ప్రభుత్వానికి లేఖ రాశారు. పశుగ్రాసం కొరత లేకుండా చూడటం, పశువుల వనరులను కాపాడాలనే ఉద్దేశంతో ఈ మినహాయింపు ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 01:12 AM