పట్టణాల్లో నామినేషన్లు నేటి నుంచే
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:17 AM
రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానిక సంస్థల్లో నోటిఫికేషన్లు జారీచేస్తారు.
87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు,
13 నగర పాలక సంస్థలకు ఎన్నికలు
ఎల్లుండి వరకు నామినేషన్ల స్వీకరణ
19న పరిశీలన.. 21 వరకు ఉపసంహరణ
అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానిక సంస్థల్లో నోటిఫికేషన్లు జారీచేస్తారు. 18వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 19న వాటిని పరిశీలిస్తారు. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. అదే రోజు పోటీలో ఉన్న తుది జాబితా ప్రకటిస్తారు. 28న ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. ఎక్కడైనా పోలింగ్ నిలిచిపోతే 29న రీపోలింగ్ నిర్వహిస్తారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆ పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్లు అయిఉండాలని నియమావళి పేర్కొంటోంది. పోటీ చేయదలచిన అభ్యర్థులకు ఆయా వార్డుల్లోని ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు కాకపోయినా.. ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో నమోదై ఉన్నా చాలు. గతంలో ఇద్దరు బిడ్డల కంటే ఎక్కువ మంది ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండేది కాదు. ఇప్పుడు ఎంతమంది బిడ్డలున్నా.. పోటీ చేయవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ, కాంట్రాక్టు ఉద్యోగులు గానీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కాదు. రేషన్షాపుల డీలర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా పోటీకి అనర్హులు.
స్థానిక సంస్థలకు పన్ను బకాయిలు కలిగినవారూ పోటీకి అనర్హులవుతారు. ఒక స్థానిక సంస్థకు సంబంధించి అభ్యర్థి ఒకే వార్డులో నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఎన్ని సెట్లు వేసినా ఫీజు మాత్రం ఒక్కటే ఉంటుంది.
పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియపై అప్పీలు చేసుకునే వెసులుబాటు చట్టంలో లేదు.
ఆన్లైన్ ద్వారా నామినేషన్లు స్వీకరించేందుకు వచ్చే ఎన్నికల నుంచి ఏర్పాట్లు చేయాలని అధికారులు రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాయనున్నారు.
తెలంగాణ నుంచి కూడా 20 వేల బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చి ఎన్నికలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
17వ వార్షికోత్సవంలో ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి ఆదిత్య..
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు