పరిషత్ పోరు నేడే
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:28 AM
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2.61 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
2.61 కోట్ల మంది ఓటర్లు, 31,460 పోలింగ్ కేంద్రాలు
77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవం
582 జడ్పీటీసీ, 7767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2.61 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌ల పరిధిలో 582 జడ్పీటీసీ స్థానాలకు, 659 మండల పరిషత్‌ల పరిధిలో 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
2.61 కోట్ల మంది ఓటర్లు
మొత్తం 2,61,52,377 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,28,76,887 మంది పురుషులు, 1,32,74,208 మంది మహిళలు, 1,282 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,97,321 మంది అధికంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకుగాను 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు 2,169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 9,821 ఎంపీటీసీ స్థానాలకుగాను 2,051 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,767 స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కడప జిల్లా కొండాపురం మండలంలోని సుగుమంచిపల్లి 1, 2 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని కృష్ణగిరి ఎంపీటీసీ స్థానానికి దాఖలైన నామినేషన్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. దాంతో ఈ మూడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు.
లక్ష బ్యాలెట్ బాక్సులు
పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం 1,01,618 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల సామగ్రి తరలింపునకు 7,642 వాహనాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 609 పంపిణీ కేంద్రాలను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 365 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 9,062 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. 11,002 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 28,692 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని నియమించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్