Share News

వర్గపోరుతో వాయిదా పర్వం!

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:15 AM

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక వాయిదాల పర్వంలో కొనసాగుతోంది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో పలుచోట్ల సయోధ్యలేకపోవడంతో ఈ ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే.

వర్గపోరుతో వాయిదా పర్వం!

  • ఎంపీపీ పీఠాలపై కుదరని సయోధ్య.. నంద్యాలలో రచ్చకెక్కిన విభేదాలు

  • ప్రమాణ స్వీకారం అనంతరం సభ్యుల అంగీకార పత్రాలు చించివేత

  • 2 పదవులూ తమకే కావాలని పట్టు

  • భోగాపురంలో శాశ్వతంగా వాయిదా

  • వైసీపీ ఖాతాలోకి. బాపట్ల ఎంపీపీ

  • ఏడుగురు టీడీపీ సభ్యులూ గైర్హాజర్‌

  • పిఠాపురంలో అతికష్టంతో ఎన్నిక పూర్తి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక వాయిదాల పర్వంలో కొనసాగుతోంది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో పలుచోట్ల సయోధ్యలేకపోవడంతో ఈ ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎన్నిక నిర్వహించగా.. ఒకటి రెండు చోట్ల తప్ప.. మిగిలిన స్థానాల్లో వాయిదాలు పడ్డాయి. నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల వర్గ పోరు కారణంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ, నందికొట్కూరులోని పగడ్యాల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక వాయి దా పడింది. గురువారం కోరం లేక వాయిదా వేయగా శుక్రవారం కూడా అదే పరిస్థితి నెలకొంది.

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మధ్య విభేధాలు ఉండటంతో ఎంపీపీ ఎన్నికకు రెండు వర్గాల ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉయ్యాలవాడ మండల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎంపిక ఘర్షణలకు దారితీసింది. మండలంలో ఐదుగురు టీడీపీ, ఇద్దరు వైసీపీ, ఒకరు జనసేన నుంచి గెలుపొందారు. కూటమి సభ్యుల్లో ముగ్గురు ఒక వర్గంగా, మరో ముగ్గురు మరో వర్గంగా మారారు.


ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ నేత మురళి జోక్యం చేసుకుని ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులను కూటమిలోని ఇరువర్గాలకు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. దీంతో మధ్యాహ్నం ఎన్నిక నిర్వహించారు. ఒక వర్గానికి చెందిన బండి మరియమ్మ ఎంపీపీగా, మరో వర్గానికి చెందిన గోపిరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి వైస్‌ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. ఈ ప్రక్రియ అనంతరం ఊహించని విధంగా కూటమి సభ్యుల్లోని ఓ ఎంపీటీసీ.. రెండు పదవులూ తమ వర్గానికే కావాలంటూ.. అధికారి చేతిలోని సభ్యుల అంగీకార పత్రాలు లాక్కుని చించేసినట్లు రిటర్నింగ్‌ అధికారి నాగమునేశ్వరి తెలిపారు.

దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శుక్రవారం నిర్ణీత సమయానికి ఎంపీటీసీ సభ్యులెవరూ సమావేశానికి హాజరుకాకపోవడంతో ఎన్నికను శాశ్వతంగా వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్‌ అధికారి ఎం.రామారావు ప్రకటించారు. మండలంలో టీడీపీ, జనసేన చెరో 3 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 6, స్వతంత్రులు 4 సాధించారు. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికకు స్వతంత్రులు కీలకంగా మారారు.


స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి అభ్యర్థన మేరకు ఎంపీపీ పదవిని జనసేనకు కేటాయించాలని కూటమి నిర్ణయించినట్లు సమాచారం. అయితే, స్వతంత్రులు జనసేనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన చెరో రెండున్నరేళ్లు ఎంపీపీ పదవిని పంచుకోవాలనే ప్రతిపాదనకు వచ్చినప్పటికీ, తొలుత ఎవరికి అవకాశం ఇవ్వాలన్న విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇక్కడ వాయిదా పడింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. పూర్తి మెజార్టీ టీడీపీకి ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో స్పష్టత రాకపోవడమే కారణమని తెలుస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో టీడీపీ 10, బీజేపీ 1, వైసీపీ 1 చొప్పున ఎంపీటీసీలు గెలుచుకున్నాయి.

ఎంపీపీ పదవి విషయంలో బీజేపీ, టీడీపీ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఇరు పార్టీల శ్రేణులు గొడవకు దిగాయి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, బీజేపీ నేత కోలా ఆనంద్‌ చేరుకుని సముదాయించినా ఎవరూ వినిపించుకోలేదు. బీజేపీ నేత ఆనంద్‌ ఎంపీపీ పదవి తమకు కేటాయించారని, అడ్డుపడడం సబబు కాదని వాదించారు.

బుజ్జగించి.. ఎన్నుకున్నారు!

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొతపల్లి మండల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక శుక్రవారం పూర్తయింది. ఎంపీపీ పదవిని జనసేనకు చెందిన గంటా విజయ్‌కుమార్‌, వాడ్ర ధనబాబులు ఆశిస్తూ వచ్చారు. అయితే, గురువారం జనసేన ఎంపీపీ అభ్యర్థిగా విజయ్‌కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ విప్‌ జారీ చేసింది. ఇంతలో ధనబాబుకు మద్దతు ఇస్తానంటూ ఇండిపెండెంట్‌ అభ్యర్థి సమావేశ మందిరంలో ప్రకటించారు. దీంతో ఆగ్రహానికి గురైన విజయ్‌కుమార్‌ ఇండిపెండెంట్‌ ఎంపీటీసీపై చేయిచేసుకున్నారు. దీంతో ఆర్వో ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే వర్మ రంగంలోకి దిగి ధనబాబును బుజ్జగించారు. అనంతరం విజయ్‌కుమార్‌ను ఎంపీపీ పదవికి ధనబాబే ప్రతిపాదించేలా చేశారు. ధనబాబు వైస్‌ ఎంపీపీ పదవి తీసుకునేలా ఒప్పించారు. దీంతో ప్రక్రియ సజావుగా ముగిసింది.


టీడీపీ డుమ్మాతో..

బాపట్ల ఎంపీపీ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో చేపట్టి ప్రక్రియకు వైసీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీలు హాజరవగా, టీడీపీకి చెందిన ఏడుగురు సభ్యులు గైర్హాజరయ్యారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలుండగా 8 మంది హాజరుతో కోరం ఉన్నందున ప్రిసైడింగ్‌ అధికారి ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలను ఏకగ్రీవంగా వైసీపీ దక్కించుకుంది.

‘అర్హులు’ లేరు.. అధ్యక్షా!

పలు చోట్ల పదవుల కోసం నాయకులు పోటీ పడుతుండగా.. తిరుపతి జిల్లాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీపీ పదవులు చేపట్టేందుకు అర్హులైన అభ్యర్థులు లేక శుక్రవారం కూడా రెండు మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. తిరుపతి జిల్లాలోని ఐదు మండలాల ఎంపీపీ, ఆరు మండలాల వైస్‌ ఎంపీపీ స్థానాలలో 2 ఎంపీపీ, 2 వైస్‌ ఎంపీపీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు సజావుగా జరిగాయి. మిగిలిన 3 ఎంపీపీ, 4 వైస్‌ ఎంపీపీ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి.

ఓజిలి, వాకాడు మండలాల్లో టీడీపీకి మెజారిటీ ఉన్నా ఎంపీపీ పదవులకు అర్హులైన అభ్యర్థులు లేనందున వాయిదా పడ్డాయి. నాగలాపురం మండలంలో గురువారం వర్గ విభేదాలు చోటు చేసుకోగా.. శుక్రవారం ఏకాభిప్రాయంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే టీడీపీ, వైసీపీ చెరి సగం ఎంపీటీసీ స్థానాలు గెలిచిన వెంకటగిరిలో గురువారం లాటరీకి అంగీకరించని ఇరు పక్షాలు, శుక్రవారం ఓకే చెప్పాయి. దీంతో డిప్‌ వేయగా రెండు పదవులనూ టీడీపీనే దక్కించుకుంది. పిచ్చాటూరు వైస్‌ ఎంపీపీ పదవిపై టీడీపీలో ఏకాభిప్రాయం కుదరక శుక్రవారం కూడా వాయిదా పడింది.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 01:26 AM