వంట గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్
ABN , Publish Date - Mar 15 , 2026 | 09:58 PM
రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంటగ్యాస్ సరఫరాకు ఆటంకం లేకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎల్‌పీజీ కనెక్షన్ల తాజా పరిస్థితిని కూడా ఆయన వివరించారు.
సోషల్ మీడియాల్లో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా వార్తలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు. ఇంధనం తగినంత లేదన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వంట గ్యాస్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఓటీపీ- ఆధారిత ప్రమాణిక డెలివరీ పద్ధతి అమలవుతోందని అన్నారు. పెండింగ్ బుకింగ్‌ల పర్యవేక్షణను డిస్ట్రిబ్యూటర్‌ల వారీగా, మార్కెట్‌ల వారీగా, జిల్లాల వారీగా, సేల్స్ ఏరియాల వారీగా, ప్రాంతాల వారీగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి పరిశ్రమలకు బల్క్ ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేయడం జరిగిందని అన్నారు. అయితే, ముఖ్యమైన విభాగాలకు (ఆసుపత్రులు, హాస్టల్స్, ప్రభుత్వ సేవలు) వాణిజ్య సరఫరాకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు రెవెన్యూ, పౌర సరఫరాలు, సోషల్ మీడియా పర్యవేక్షణ సెల్‌తో సామాజిక మాధ్యమాలను పర్యవేక్షించడానికి, అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాస్తవాన్ని తెలియజేయడానికి ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు జారీ చేస్తున్నామని అన్నారు. అదే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పౌరసరఫరాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఆర్టీజీఎస్ కార్యదర్శులతో ఏర్పాటైన కమిటీ వంట గ్యాస్ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని అన్నారు.
అంతేకాకుండా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సహా, మంత్రుల బృందం తాజా పరిణామాలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తోందని అన్నారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్ తదితర విభాగాల అధికారులతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎల్‌పీజీ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఎల్‌పీజీ స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ వార్తలూ చదవండి:
58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
ఇదిగో.. నాకు ఐదు వేళ్లే ఉన్నాయ్! నెతన్యాహు కొత్త వీడియో