Share News

మతలబు కుదరదంతే!

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:20 AM

గత ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తే.. కూటమి ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, పురపాలక శాఖల్లో అడుగుడుగునా స్థానిక ఎన్నికల రిజర్వేషన్‌ ప్రక్రియపై నిఘా పెట్టారు.

మతలబు కుదరదంతే!

  • అత్యంత పారదర్శకంగా రిజర్వేషన్లు

  • ‘స్థానిక’ రిజర్వేషన్ల తారుమారుకు యత్నించిన ఓ జడ్పీ సీఈవోపై వేటు

  • ఒక రూరల్‌ ఎంపీడీవో కూడా సస్పెన్షన్‌

  • పిఠాపురం, మంగళగిరిలో సానుకూల రిజర్వేషన్లకు నేతల విన్నపాలు

  • జోక్యం చేసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేశ్‌ నో

  • మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఎస్టీకి,

  • పిఠాపురం మున్సిపాలిటీ ఎస్సీకి వెళ్లడమే నిదర్శనం

  • అన్నీ రోస్టర్‌ ప్రకారమే కేటాయింపు

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తే.. కూటమి ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, పురపాలక శాఖల్లో అడుగుడుగునా స్థానిక ఎన్నికల రిజర్వేషన్‌ ప్రక్రియపై నిఘా పెట్టారు.

రోస్టర్‌ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా అన్నీ ఏర్పాట్లు చేయడంతో రాష్ట్రంలో ఎక్కడా... ఒక్క తప్పు దొర్లకుండా మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, కార్పొరేషన్లు, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియలో మతలబు చేయడానికి ప్రయత్నించిన ఓ జిల్లా పరిషత్‌ సీఈవోను హుటాహుటిన తొలగించి వేరే అధికారిని నియమించారు. ఇదే ప్రయత్నం చేసిన ఓ రూరల్‌ ఎంపీడీవోను సస్పెండ్‌ చేశారు. మరో డీడీవోపై ఆరోపణలు రావడంతో ఈ ప్రక్రియను పూర్తిగా ఆర్‌డీవోకు అప్పగించి పూర్తిచేశారు. పలు దశల్లో స్ర్కూటినీ చేపట్టడంతో ఎక్కడ తప్పు జరిగినా వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ఒక నిఘా టీం దీని కోసం ప్రత్యేకంగా పనిచేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పూర్తిగా చట్టనిబంధనలకే పెద్దపీట వేశారు.


స్థానిక నేతలు కోరినా..

అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు కొందరు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలం పెంచుకోవడానికి రిజర్వేషన్లు మార్చాలని తమ తమ నేతలను కోరారు. ముఖ్యంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ను బీసీలకు కేటాయించేలా చూడాలని, అప్పుడు నియోజకవర్గంపై టీడీపీ పట్టు మరింత పెరుగుతుందని ఆ పార్టీ స్థానిక నాయకులు భావించారు. అయితే రోస్టర్‌ను, చట్టనిబంధనలను అతిక్రమించడానికి వీల్లేదని మంత్రి లోకేశ్‌ తెగేసి చెప్పారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఎస్టీకి రిజర్వ్‌ అయిన సంగతి తెలిసిందే. పిఠాపురం మున్సిపాలిటీ విషయంలోను, ఆ నియోజకవర్గంలో సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీల విషయంలోను జనసేన బలోపేతానికి అనుగుణంగా రిజర్వేషన్లపై నిర్ణయాలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ నేతలు కూడా అభ్యర్థించారు.

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎంత మాత్రం అంగీకరించలేదు. చట్టబద్ధ ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరించడం కుదరదని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఖాతరు చేయొద్దని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ క్రమంలోనే పిఠాపురం మున్సిపాలిటీ ఎస్సీలకు రిజర్వ్‌ అయింది. పంచాయతీ వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌ దాకా ఒక్క పొరపాటూ జరుగకుండా అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా టీం వారం రోజులు నిరంతరాయంగా పనిచేసింది. ప్రతి స్థాయిలోనూ అధికారులు అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించడంతో రిజర్వేషన్ల ఖరారు సజావుగా జరిగింది.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

17వ వార్షికోత్సవంలో ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి ఆదిత్య..

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:20 AM