ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే..పెట్టుబడులెలా?
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:24 AM
రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.
మార్కెట్ ధరకే భూములిస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్లిపోతాయి
ప్రభుత్వ పాలసీని విస్తృత కోణంలో చూడాలి
ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి మేమిక్కడ లేం
విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు
పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు
ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు
ప్రచారం కోసమో, మరెందుకో ఒకే అంశంపై పిల్‌లు
వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘‘ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి మేమిక్కడ లేము. కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో వ్యత్యాసాలు ఉండవచ్చు. దాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం అభివృద్ధిని అడ్డుకోవడం సరి కాదు. ప్రభుత్వ పాలసీతో ఐటీ ఎకో సిస్టం అభివృద్ధి చెందితే, వచ్చే రెండు వందల సంవత్సరాల పాటు ఆ ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తారు. అయినా, ప్రభుత్వ పాలసీ కారణంగా తాము పెట్టుబడి పెట్టలేకపోయామని ఏ ఒక్క కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఓ రాజకీయ నాయకుడు మాత్రమే దీనిపై ప్రజాహితవ్యాజ్యాన్ని వేశారు.’’
- హైకోర్టు
అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ప్రపంచ దేశాలు, పక్క రాష్ట్రాలతో పోటీని తట్టుకొని పెట్టుబడులు రాబట్టాలంటే, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎవరు ముందుకొస్తారని పిటిషనర్, వైసీపీ ఎంపీ గురుమూర్తిని సూటిగా ప్రశ్నించింది. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు మాత్రమే భూములిస్తామంటే కంపెనీలు దండం పెట్టి అనుకూల ప్రాంతాలకు వెళతాయని పేర్కొంది. పక్క రాష్ట్రాలతో పోటీపడి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్దఎత్తున పెట్టుబడులు అవసరమన్నారు. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం తెలుగువారే ఉన్నారని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో వారు స్థిరపడ్డారని గుర్తు చేసింది. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, భూ కేటాయింపు పాలసీలను రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రభుత్వ పాలసీలో భూకేటాయింపు అనేది ఒక అంశం మాత్రమేనని, దానివల్ల కలిగే విస్తృత ప్రయోజనాలను భవిష్యత్తులో చూడవచ్చని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి తామిక్కడ లేమని తేల్చి చెప్పింది. కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో వ్యత్యాసాలు ఉండవచ్చని, వాటిని ఆధారంగా చేసుకొని మొత్తం అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదంది. ప్రభుత్వ పాలసీతో ఐటీ ఎకో సిస్టం అభివృద్ధి చెందితే, తదుపరి 200 సంవత్సరాలపాటు ఆ ప్రయోజనాలు లభిస్తాయని తెలిపింది.
వేలం ద్వారా కంపెనీలకు భూములు కేటాయించడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని, ఇది తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని తెలిపింది. ప్రభుత్వ పాలసీ కారణంగా పెట్టుబడి పెట్టలేకపోయామని ఏ ఒక్క కంపెనీ కోర్టును ఆశ్రయించలేదని, ప్రస్తుత ప్రజాహిత వ్యాజ్యాన్ని ఓ రాజకీయ నాయకుడు దాఖలు చేశారని గుర్తు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు సహజంగానే జోక్యం చేసుకోవని, తమ పాత్ర పరిమితమని తెలిపింది. ప్రచారం కోసమో, మరే ఇతర కారణాలతోనో ఒకే అంశంపై ఒకటి తరువాత ఒకటి ప్రజాహిత వ్యాజ్యాలు వేస్తూనే ఉన్నారని, దీనివల్ల విచారణ ముందుకెళ్లడం లేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పిల్‌లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
ఐటీ, అభివృద్ధి పేరిట చౌకగా భూములు: పిటిషనర్
రాష్ట్రంలో ప్రభుత్వ భూములను తక్కువ ధరకే ప్రైవేటు సంస్థలు, రియల్‌ఎస్టేట్ డెవలపర్స్‌కు కేటాయిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘‘ఐటీ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు సత్వ, రహేజా లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయిస్తున్నారు. ఆ భూముల్లో 50ు ఆయా సంస్థలు సొంత అవసరాలకు వినియోగించుకొనేందుకు వెసులుబాటు ఇచ్చారు. మౌలికసదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన విషయంలో కచ్చితమైన గడువు విధించలేదు. ప్రభుత్వ పాలసీ ప్రైవేటు సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టేదిలా ఉంది’’ అని శ్రీరామ్ వాదించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘‘వివిధ సంస్థలకు భూకేటాయింపులు, ప్రభుత్వ పాలసీలను సవాల్ చేస్తూ ఇప్పటికే అనేక పిల్‌లు దాఖలయ్యాయి. కొన్ని పిటిషన్లలో మేం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశాం. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన పాలసీని అనుసరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ వాదన ఉంది. ఒకే అంశంపై కొత్త పిటిషనర్‌ను తెరమీదకు తెచ్చి వ్యాజ్యాలు వేయిస్తున్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం’’ అని తెలిపారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వం కౌంటర్ వేసిన అనంతరం వివిధ సంస్థలకు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని పేర్కొంది.
మళ్లీ విద్వేషం చిమ్మినఅభివృద్ధి నిరోధకుడు జగన్
గూగుల్ హబ్‌పై పిల్ వేస్తారా? : లోకేశ్ ఆగ్రహం
అభివృద్ధి నిరోధకుడు జగన్ మరోసారి రాష్ట్రాభివృద్ధిపై అక్కసు వెళ్లగక్కారని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ‘తొలుత అమరావతిని వ్యతిరేకించారు. తర్వాత విద్యుత్తు కాంట్రాక్టులు రద్దు చేశారు. ఉద్యోగాలు సృష్టించే ఐటీ రంగం అభివృద్ధికి వ్యతిరేకంగా పిల్‌లు వేశారు. తాజాగా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయిన విశాఖ గూగుల్ ఏఐ హబ్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలతో కోర్టులో కేసులు వేయించారు. అభివృద్ధి నిరోధకుడినని జగన్ మరోసారి నిరూపించుకున్నారు. ఏపీ యువత పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల ఎందుకింత ద్వేషం? మీరు ఎన్ని కుయక్తులు పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగదు’ అని లోకేశ్ స్పష్టం చేశారు.